సాక్షి, ఆదిలాబాద్ : విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చూసి నివ్వరపోయేలా చేసింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా, తదితర ప్రదర్శనలు తయారు చేశారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 700లకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రయోగాలను ప్రదర్శించారు.కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా విద్య శాఖాధికారి డాక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తిలకించారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ మెట్టు ప్రహ్లాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈఓ జయశీల, శ్రీహరిబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు.
పర్యావరణాన్ని కాపాడేందుకు..
పర్యావరణ కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యమై రోగాలు ప్రబలుతున్నాయి. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
– నవీన, ప్రతిభ, కేజీబీవీ, ఆదిలాబాద్
గాలి ద్వారా వంట..
గాలిద్వారా వంట చేసుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్, నీరు అవసరం ఉంటుంది. రెండు వేర్వేరు బాటిళ్లలో నీళ్లు, పెట్రోల్ పోసి పైపులను అమర్చుకోవాలి. పెట్రోల్ బాటిల్‌కు ఒక పైపును ఏర్పాటు చేసి గాలిని పంపాలి. ఆ గాలి పెట్రోల్‌లోకి వెళ్లి గ్యాస్లీన్ వాయువు తయారవుతుంది. దానిద్వారా వంట చేసుకోవచ్చు. పెట్రోల్ అలాగే ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు.
– తృప్తి, ఝాన్సీరాణి, జెడ్పీఎస్‌ఎస్, ఇచ్చోడ
విషజ్వరాలు సోకకుండా..
ప్రస్తుతం దోమలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకుతున్నాయి. దోమల నివారణ కోసం తులసీ, బంతి, సజ్జల మొక్కలను ఇంట్లో పెంచితే దోమలు వృద్ధి చెందవు. గడ్డి చామంతి, వేప ఆకులను ఎండబెట్టి పొగపెడితే దోమలు ఉండవు. వేప నూనె, కొబ్బరి నూనె చర్మానికి రాసుకుంటే కుట్టవు. బ్యాక్టీరియా దరిచేరదు.
– వర్ష, కృష్ణవేణి, జెడ్పీఎస్‌ఎస్, మావల
సహజ వనరుల వినియోగం
సహజ వనరుల వినియోగంతో అనేక లాభాలు పొందవచ్చు. వర్షాకాలంలో ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంచుకొని వర్షాలు లేనప్పుడు వాటిని డ్రిప్ ద్వారా వినియోగించుకుంటే పంటలు పండుతాయి. పశువుల పెంపకంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. సౌర శక్తితో విద్యుత్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సహజసిద్ధమైన ఎరువులను తయారు చేసి వాడాలి.
– యశశ్విని, దుర్గా, అరుణోదయ పాఠశాల, ఆదిలాబాద్
దోమలు వృద్ధి చెందకుండా..
దోమలు మురికి కాల్వలు, నిల్వ నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. దోమలను లార్వ దశలోనే నివారించేందుకు ఇంట్లో వాడిన మంచినూనె, రంపం పొట్టు, గుడ్డలను తీసుకోవాలి. రంపం పొట్టును గుడ్డలో కట్టి నూనెలో ముంచి మురికి కాల్వల్లో పారవేయాలి. ఆయిల్ పైకివచ్చి దోమల లార్వలకు ఆక్సిజన్ అందకుండా నూనె పైకితేలుతూ అవి నశించేలా చేస్తాయి.
– దీపాలి, మారుతి, జెడ్పీఎస్‌ఎస్, మన్నూర్
సైన్స్ ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేలు
చల్లని, వేడి గాలిచ్చే కూలర్..
తక్కువ ఖర్చుతో వేడి, చల్లని గాలినిచ్చే కూలర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాటరీ, ఫ్యాన్, స్విచ్, బెండ్ పైపు, వైర్ అవసరం ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. వేసవి కాలంలో చల్లని నీటిని అందులో పోస్తే చల్లని గాలి వస్తుంది. చలికాలంలో వేడి నీళ్లు పోస్తే వేడి గాలిలో గది వెచ్చగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – అవంతిక, ఆర్యభట్ట పాఠశాల, ఆదిలాబాద్
ద్రియ సాగు.. బహుబాగుసేం
ప్రస్తుతం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడంతో ఆహార పదార్థాలు విషహారంగా మారుతున్నాయి. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ వల్ల సహజమైన పంటలు లభిస్తాయి. ఆవులు, గేదెల ద్వారా స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు వాటి పేడతో ఎరువులు, గోబర్‌గ్యాస్ తయారు చేసుకోవచ్చు.
– కె.అంకిత, విశ్వశాంతి పాఠశాల, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment