గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంవోపై వేటు
డీఎంఈకి సరెండర్ చేసిన మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంవో డాక్టర్ సరస్వతిపై వేటు పడింది. ఆమెను డీఎంఈకి సరెండర్ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆస్పత్రిలోని ఆర్‌ఎంవోలకు అదనంగా మరికొన్ని అధికారాలు కల్పించారు. ఇకపై ఎవరి పరిధిలో చోటు చేసుకునే ఘటనలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు మదింపు చేయాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్, డీఎంఈ రమణిలను ఆదేశించారు. పనితీరును మెరుగు పర్చుకుని, రోగులకు ఉత్తమ సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. బుధవారం డీఎంఈతో కలసి ఆయన గాంధీ జనరల్ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ వార్డుల్లో అందుతున్న సేవలను.. ఫార్మసీలో మందులను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం ఆయా విభాగాల అధిపతులతో సుమారు రెండు గంటల పాటు సమావేశమయ్యారు.
ఒళ్లు దగ్గరపెట్టుకొని పని చేయండి..
ప్రజలకు ఇప్పుడిప్పుడే ప్రజావైద్యంపై నమ్మకం పెరిగి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ‘‘ఇలాంటి సమయంలో వారికి మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజావైద్యానికి మంచి పేరు తీసుకురావాల్సిన వైద్యులు.. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటి? ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరించినా, పేషెంట్లను విస్మరించినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినట్లు తెలిసినా చర్యలు తప్పవు. ఇకపై వైద్యులు సహా వైద్య సిబ్బంది అంతా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలి’’ అని ప్రభుత్వ వైద్య సిబ్బందిని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఆ మేరకు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించి.. ఆస్పత్రుల్లో రోగులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. గాంధీ ఆస్పత్రికి దేశంలోనే మంచి పేరుందని, ఆ పేరును చెడగొట్టవద్దని వైద్య సిబ్బందికి సూచించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని ఆస్పత్రుల్లో 20 శాతం ఓపీ పెరిగిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత వైద్యులపైనే ఉందన్నారు. చిన్నచిన్న నిర్లక్ష్యాలు, పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారుతున్నాయని, ఆర్‌ఎంవోలంతా ఎవరి డ్యూటీ వారు చేయాలని సూచించారు. ఇటీవలి వరుస సంఘటనలను ఉదహరిస్తూ అలాంటివి పునరావృతమైతే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. రోగుల సహాయకుల కోసం అదనంగా కొన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఆస్పత్రిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, ఒక రోగికి ఒక సహాయకుడినే అనుమతించాలని సూచించారు.
కొత్తగా 65 పడకలతో ఐసీయూ..
గాంధీలో కొత్తగా 65 పడకలతో ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లక్ష్మారెడ్డి ప్రకటించారు. నెల రోజుల్లోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. వైద్య పరీక్షల కోసం మరో కొత్త ల్యాబ్ సహా అత్యాధునిక వైద్య పరి కరాలు అందుబాటులోకి తీసుకురా ను న్నట్లు తెలిపారు. ఇకపై ఆస్పత్రికి వచ్చిన రోగుల పూర్తి వివరాలతో పాటు వారికి అందించిన చికిత్స వివరాలను కూడా కంప్యూటర్‌లో పొందుపర్చనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆస్పత్రుల్లోనూ 20 వేల పడకలు ఉండగా, ఇప్పటికే లక్ష బెడ్‌షీట్స్‌ను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.