గాంధీ అత్యవసర విభాగంలో ఘటన
గాందీఆస్పత్రి : కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన మరువక ముందే సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది. అత్యవసర విభాగంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఇంటర్నీ (జూనియర్ డాక్టర్)పై చికిత్స కోసం వచి్చన ఓ రోగి దాడి చేశాడు. మహిళ ఇంటర్నీ చేయి, యాప్రాన్ పట్టుకుని గట్టిగా లాగడంతో ఆమె భయాందోళనకు గురైంది. దీనిని గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది రోగి చేతుల్లోంచి ఆమెను విడిపించారు.
ప్రత్యక్ష సాక్షులు, గాంధీ అధికారులు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బన్సీలాల్‌పేటకు చెందిన జీ.ప్రకాశ్ (60) దినసరి కూలీగా పని చేస్తున్నాడు. మద్యం, కల్లు తాగే అలవాటు ఉన్న ప్రకాశ్ బుధవారం ఫుల్లుగా మద్యం సేవించి, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుండటంతో అతడి భార్య వైద్యసేవల నిమిత్తం ప్రకాశ్‌ను గాంధీ ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువచి్చంది.
భార్య పక్కనే ఉన్న ప్రకాశ్ అక్కడే డ్యూటీలో ఉన్న ఓ వైద్యవిద్యార్థిని చేయి పట్టుకుని గట్టిగా లాగాడు. ఆమె యాప్రాన్ పట్టుకుని బయటికి లాక్కెళ్లేందుకు యత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన తోటి వైద్యులు, సిబ్బంది అతడిని కొట్టి అతని చేతుల్లోంచి ఆమెను విడిపించారు. ఈ ఘటన దృశ్యాలు అత్యవసర విభాగంలోని సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా అతడిని గాంధీ పోలీస్ అవుట్‌పోస్ట్‌కు అక్కడి నుంచి చిలకలగూడ ఠాణాకు తరలించారు.
మద్యం మత్తులో మతిస్థిమితం కోల్పోయి దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజకుమారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను జూనియర్ డాక్టర్ల సంఘం గాంధీ యూనిట్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. వైద్యులు, వైద్య విద్యార్థులపై దాడులు జరగకుండా, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని జూడా సంఘ అధ్యక్ష, కార్యదర్శులు వంశీకృష్ణ, లౌక్య, గిరిప్రసాద్‌లు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment