Healthy Eating
-
మూడొంతుల మందికి మంచి తిండి కలే
న్యూఢిల్లీ: దేశంలో దాదాపు మూడొంతుల మందికి ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పటికీ కలే. పళ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, మాంసం తదితరాలతో కూడిన సమతులాహారం సగటు భారతీయులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉంది. అంతేగాక ఏటా 17 లక్షల మందికి పైగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తద్వారా వచ్చే క్యాన్సర్, మధుమేహం తదితర వ్యాధులతో మృత్యువాత పడుతున్నారు. సెంటర్‌పర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ మేగజీన్ విడుదల చేసిన ‘గణాంకాల్లో భారత పర్యావరణ స్థితిగతులు: 2022’ నివేదిక ఈ మేరకు పేర్కొంది. ఆహార వ్యయం వ్యక్తిగత ఆదాయంలో 63 శాతాన్ని మించితే సదరు వ్యక్తులకు ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. 20 ఏళ్లు, అంతకు మించిన వాళ్ల రోజువారీ ఆహారంలో కనీసం 200 గ్రాముల పండ్లు తప్పనిసరి. కానీ భారత్‌లో మాత్రం సగటున 35 గ్రాములకు మించి తినడం లేదట. అలాగే రోజుకు 300 గ్రాముల దాకా కూరగాయలు తీసుకోవాల్సి ఉండగా 168 గ్రాములతో సరిపెడుతున్నారు. కొంతకాలంగా పరిస్థితిలో మెరుగుదల కనిపిస్తున్నా మొత్తమ్మీద చూస్తే అంత సానుకూలంగా లేదని నివేదిక పేర్కొంది. ‘‘ఆహార ధరలు నానాటికీ కొండెక్కుతుండటమే ఇందుకు ప్రధాన కారణం. వినియోగదారుల ఆహార ధరల సూచీ ద్రవ్యోల్బణం ఏడాదిలోనే ఏకంగా 327 శాతం పెరిగిపోయింది’’ అంటూ ఆందోళన వెలిబుచ్చింది. -
మా అబ్బాయి బరువు తగ్గడం ఎలా?
మా అబ్బాయి వయసు 13 ఏళ్లు. బరువు 64 కిలోలు. వాడు విపరీతంగా బరువు పెరుగుతున్నాడు. మా వాడి విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - నాగరాణి, సింగరాయకొండ టీనేజ్‌లో నుంచి సరైన ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పకపోతే పిల్లలు మరింత బరువు పెరిగి, అది భవిష్యత్తులో ఎన్నో రుగ్మతలకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే మీ బాబు వయసులోనే వాళ్లకు ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్పాలి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... స్వీట్లు, సాఫ్ట్‌డ్రింక్స్, జామ్ వంటి వాటిని క్రమంగా తగ్గించడం లేదా పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. కూల్‌డ్రింక్స్‌కు పిల్లలను దూరంగా ఉంచాలి. బేకరీ ఉత్పాదనల్లోని కొవ్వు పాళ్లు పిల్లల్లో బరువును మరింతగా పెంచుతాయి. కాబట్టి కొవ్వుతో ఉండే ఆహారాలను పరిహరించి, పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, తాజా పండ్లు వంటివి తినడం అలవాటు చేయాలి. వంటలో ఎక్కువగా నూనెలు వాడటం, నెయ్యి, వెన్న వంటివి పిల్లల్లో మరింతగా బరువు పెంచుతాయి. వాటిని ఎక్కువగా వాడవద్దు. సాధ్యమైనంతవరకు బయటి ఆహారానికి బదులు ఇంట్లోనే తయారు చేసిన ఆహారాలే ఇవ్వడం మంచిది. పై అలవాట్ల నేర్పడంతో పాటు ముందుగా పిల్లల్లో థైరాయిడ్ వంటి మెడికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని కూడా పరీక్షలు చేయించి, అవేవీ లేవని రూల్ అవుట్ చేసుకోవడం అవసరం. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్