healthy old age
-
నాజూకు దేహానికి నిద్ర
కంటినిండా నిద్రపోయే పిల్లలు యుక్తవయసులో ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. నాజూకుగానూ ఉంటారని అంటున్నారు అమెరికన్ శాస్త్రవేత్తలు. దాదాపు 20 నగరాల్లోని 2200 మంది పిల్లలపై తాము ఒక అధ్యయనం జరిపామని.. వేళకు నిద్రపోవడం.. నిద్ర తగినంత ఉండటం వారికి ఏళ్ల తరువాత కూడా మేలు చేస్తుందని ఇందులో తెలిసిందని పెన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త బక్స్టన్ అంటున్నారు. ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయస్కులపై జరిగిన ఈ అధ్యయనంలో తాము వారి బాడీ మాస్ ఇండెక్స్‌ను (బీఎంఐ) పరిశీలించామని.. అవసరమైన సమయం కంటే తక్కువ నిద్రపోయే వారి బీఎంఐ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. నిద్రలేమి అటు శారీరక, ఇటు మానసిక ఆరోగ్యం రెండింటిపై దుష్ప్రభావం చూపుతుందనేందుకు ఈ అధ్యయనం తాజా తార్కాణమని బక్స్టన్ అన్నారు. రాత్రివేళల్లో టీవీలకు అతుక్కుపోతున్న తల్లిదండ్రులు కనీసం పిల్లలను సరైన సమయంలో నిద్రపోయేలా చేసేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని వివరించారు. పరిశోధన వివరాలు స్లీప్ జర్నల్ తాజా సంచికలో ప్రచురితమైంది. -
ఆ ప్రొటీన్‌తో వందేళ్లు, ఆరోగ్యం కూడా!
వందేళ్లు బతకాలని అందరూ కోరుకుంటారుగానీ.. ముసలి వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలు గుర్తుకొస్తే మాత్రం.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకేనేమో.. బ్రౌన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆయుష్షును పెంచడం కాకుండా, బతికున్నంత కాలమూ ఆరోగ్యం ఉండటం ఎలా? అన్న అంశంపై దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఈగలపై కొన్ని ప్రయోగాలు చేస్తే.. సిర్ట్4 అనే ప్రొటీన్‌తో ఇది సాధ్యమని తెలిసింది. ఈ ప్రొటీన్ అటు జీవక్రియలతోపాటు.. వయసుతోపాటు వచ్చే వ్యాధుల్లోనూ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఈ నేపథ్యంలో సిర్ట్4 ప్రొటీన్‌ను ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకునేందుకు ఈగలపై పరిశోధనలు జరిగాయన్నమాట. సిర్ట్4 ప్రొటీన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఈగల ఆయుష్షు 20 శాతం ఎక్కువ కావడంతోపాటు ఆరోగ్యంగానూ ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసిన ఈగలను పరిశీలిస్తే ఆయుష్షు 20 శాతం వరకూ తగ్గినట్లు తెలిసింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఉపవాసమున్నప్పుడు సిర్ట్4 ప్రొటీన్ కణాలకు అవసరమైన ఇంధనాన్ని అందిస్తూందని.. ఈ ప్రొటీన్ తక్కువ ఉన్న ఈగలు సాధారణ ఈగల కంటే వేగంగా చచ్చిపోయాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ హెల్ఫాండ్ తెలిపారు. -
వృద్ధాప్యాన్ని ఇలా జయించవచ్చు!
సిడ్నీ: ఫైబర్ ఎక్కువ గా ఉండే ధాన్యాలు, పండ్లు రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవడం ద్వారా వృద్ధాప్యాన్ని జయించవచ్చని తాజా పరిశోధనల్లో తేలింది. సిడ్నీలోని భారత సంతతికి చెందిన బామినీ గోపినాథ్ ఆధ్వర్యంలోని బృందం 50 ఏళ్లకు పైబడిన 1600 మందిపై పరిశోధనలు జరిపిన అనంతరం ఈ విషయాలు వెల్లడించారు. ఫైబర్ ఎక్కువగా తీసుకునే వారిలో ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించవని, వయసుతోపాటు వచ్చే నిసృ్పహ భావాలు, శ్వాస, హృదయ సంబంధిత వ్యాధులు దరిచేరవని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా ఇతరులతో పోలిస్తే వీరు పదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని, దీనికి కారణం వారిలో రక్తపోటు, మధుమేహం వంటివి అదుపులో ఉండడమేనన్నారు. బామినీ గోపినాథ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ‘వెస్ట్‌మెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ రీసెర్చ్’లో అసోసియేటివ్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.