'హార్ట్' ఆఫ్ గోల్డ్‌గా చెన్నై
చెన్నై : గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు చెన్నై మహా నగరంలోని ఆసుపత్రులు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఈ శస్త్ర చికిత్స కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులంతా చెన్నైకి క్యూ కడుతున్నారు. గత ఐదేళ్ల కాల వ్యవధిలో దాదాపు 145 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చెన్నైలోనే జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తొమ్మిదేళ్ల మహాలక్ష్మీకి గతేడాది చెన్నైలోనే గుండెమార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆ పాప ఇప్పుడు స్కూల్‌కి వెళ్తుంది. బాగా చదువుకుని కార్డియాలజిస్ట్ అయి పలువురు ప్రాణాలు నిలబెడతానని చెబుతుంది. గతేడాది ఈ పాపకు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను అమర్చారు.
అలాగే కర్ణాటకకు చెందిన గణేష్ అనే వ్యాపారీ ఇటీవలే చెన్నైలో ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నాడు. అంతేకాకుండా ఏడు కేజీలు తగ్గానని... అయిన సాధారణంగానే ఉన్నానని చెబుతున్నాడు. తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే తన తల్లిదండ్రులను చూసుకుంటూ... తన ఆరోగ్యాన్ని పట్ల జాగ్రత్త వహిస్తున్నట్లు చెప్పాడు.
డోనర్ నుంచి గుండెను ఎవరికైనా అమర్చే క్రమంలో...ఆ గుండెను వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా గ్రీన్ కారిడార్ పేరుతో చెన్నై పోలీసులు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు గుండెను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
మరీ అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లు కూడా ఇందుకోసం వినియోగిస్తున్న విషయాన్ని ఫోర్టీస్ సెంటర్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్‌ప్లంట్ డైరెక్టర్ డాక్టర్ సీకే బాలకృష్ణ వెల్లడించారు. అవయువ దానం అనేది తమిళనాడులో ప్రజల ఉద్యమంగా సాగుతుందన్న సంగతి తెలిసిందే. 2008లో తిరుక్రున్రంకు చెందిన హితేంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ స్థితికి వెళ్లాడు.
అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. హితేంద్రన్ గుండె 9 ఏళ్ల చిన్నారికి అమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో అవయవ దానంపై చైతన్యాన్ని రగిల్చింది. ఈ సంఘటన తరువాతనే ఆవయవదాన పథకం అదే ఏడాది అక్టోబరులో ఆవిర్భవించిన విషయం విదితమే.