వర్షబీభత్సం
- పిడుగు పాటుతో మహిళ మృతి
- పిన్నాపురంలో 70 గొర్రెలు మృత్యువాత
- కానాలలో ఆటో బోల్తా- ఒకరు దుర్మరణం
- శ్రీశైలంలో కారుపై కూలిన చెట్టు..
డ్రైవర్‌కు స్పల్పగాయాలు
- రుద్రవరం బెస్తకాలనీలో దెబ్బతిన్న ధ్వజస్తంభం
సాక్షినెట్‌వర్క్: జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీగాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగు పడడంతో రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో దాసరి నర్సమ్మ(50) మృతి చెందారు. యాదవాడ గ్రామానికి చెందిన ఈమె.. కుమార్తెను చూసేందుకు నర్సాపురం వచ్చారు. అల్లుడు పెద్ద వెంకటేశ్వర్లు, కుమార్తె పెద్ద ఓబులమ్మలతో కలిసి పొలంలో చెత్తాచెదారం ఏరివేసేందుకు వెళ్లారు. వర్షం పడుతుండడంతో ముగ్గురు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. అల్లుడు, కుమార్తె వర్షంలో తడకుండా ఉండేందుకు పరుగెత్తారు. నర్సమ్మ వర్షంలో తడుస్తూ ఇంటి వస్తుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. మృతురాలికి భర్త చిన్న ఓబన్న ఉన్నాడు. ఇదిలా ఉండగా.. రుద్రవరం బెస్తకాలనీలో పిడుగుపడి రామాలయంలోని ధ్వజస్తంభం దెబ్బతినింది.
పాణ్యం మండలం పిన్నాపురం గ్రామానికి చెందిన గొల్ల సుబ్బన్న, కర్నూలు వెంకటేశ్వర్లు, మద్దయ్యలకు చెందిన 70 గొర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. గొర్రెలను కొండ నుంచి ఇంటికి తీసుకొని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రూ.3.50లక్షల వరకు నష్టం వాటిల్లిందని యజమానులు వాపోయారు.
పాములపాడు మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. బేతంచెర్ల పట్టణంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. కోవెలకుంట్ల డివిజన్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో ఎండవేడిమి నుంచి అల్లాడుతున్న ప్రజలు ఉపశమనం పొందారు. ఆత్మకూరు పట్టణం ఆర్అండ్బీ అతిథి గృహం విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించాయి. విద్యుత్ అధికారులు వచ్చి వెంటనే తీగలను తొలగించడంతో ప్రమాదం తప్పింది. ఉయ్యాలవాడ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
చాగలమర్రి మండలం శెట్టివీడు, చిన్నవంగలి, పెద్దవంగలి, చింతలచెరువు గ్రామాల్లో అరటి తోటలకు తీవ్ర నష్టం కలిగింది. మల్లెవేముల, ముత్యాలపాడు, గోడిగెనూరు గ్రామాల్లో మునగ చెట్లు నేల కూలాయి. చాగమర్రిలో పూరిగుడిసెలు దెబ్బతిన్నాయి. వ్యాపారాల కోసం ఏర్పాటు చేసుకొన్న తాత్కాలిక షెడ్లు గాలికి కొట్టుకుపోయాయి.
గాలీవాన బీభత్సంతో గోస్పాడు మండలం చింతకుంట్ల, పసురపాడు, ఎం.కృష్ణాపురం, కానాలపల్లె, యాళ్లూరు, జూలేపల్లె, తదితర గ్రామాల్లో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. నంద్యాల, కోవెలకుంట్ల రహదారిలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో 60 విద్యుత్ స్తంభాలకు పైగా నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
బండిఆత్మకూరు దాటిన తర్వాత భారత్ గ్యాస్ గోడౌన్‌కు ఎదురుగా ఉండే తుమ్మచెట్టు రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో నంద్యాల–ఆత్మకూరు వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం ఏర్పడింది. బండిఆత్మకూరు పోలీసులు జేసీబీతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును పక్కకు తొలగించారు.
భారీ వర్షానికి శ్రీశైల మహాక్షేత్రంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కారును పార్క్ చేస్తుండగా భారీ వృక్షం కూలడంతో డ్రైవర్ వెంకటేష్‌కు గాయాలయ్యాయి. శ్రీశైలం టూటౌన్ ఎస్ఐ ఓబులేస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు.
మహానంది పుణ్యక్షేత్రంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.
ఆటోబోల్తా..ఒకరు మృతి
నంద్యాల పట్టణ శివారులోని కానాల గ్రామం వద్ద వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి ఆటో బోల్తా పడి..పీవీఎస్ బేకరి సేల్స్‌మెన్ మహబూబ్(40) మృతి చెందాడు. నంద్యాల పట్టణం గాంధీచౌక్ ప్రాంతానికి చెందిన ఇతను..తండ్రి బాషాతో కలిసి కానాల గ్రామంలో బేకరి పదార్థాలను అమ్మి తిరుగు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో నడుపుతున్న మహబూబ్‌పై ఆటో పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రమణ ఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.