సమైక్యాంధ్ర ఉద్యమానికి హెచ్ఎంల అసోసియేషన్ మద్దతు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లాశాఖ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్థానిక ప్రధానోపాధ్యాయుల సంఘ భవనంలో శనివారం ఉదయం నిర్వహించిన అసోసియేషన్ సమావేశానికి సంఘ జిల్లా అధ్యక్షుడు వై.వెంకట్రావు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వెంకట్రావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమావేశంలో పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ప్రధానోపాధ్యాయుల సీనియారిటీ జాబితాలను వెంటనే ప్రకటించాలని, స్కూలు అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా వెంటనే పదోన్నతులివ్వాలని, ప్రధానోపాధ్యాయుల జిల్లా వార్షిక సమావేశం త్వరలో ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాలకు వాచ్మెన్, స్వీపర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. వేసవిలో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన ప్రధానోపాధ్యాయులందరికీ సంపాదిత సెలవును వారి సేవా పుస్తకాల్లో నమోదు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్వీ రమణ, కోశాధికారి కె.దయానందం, రాష్ట్ర కార్యదర్శి జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.పెద్దిరాజు, నాలుగు విద్యా డివిజన్ల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.