help center
-
మురిసిన మానవత్వం
ఉంగుటూరు(ఏలూరు జిల్లా): నెలల తరబడి శుభ్రం చేయని శరీరం, అట్టలు కట్టిన తల, మురికి పట్టిన దుస్తులు, మాసిన గెడ్డంతో మతి స్థిమితం లేని స్థితిలో జాతీయ రహదారిపై నెలల తరబడి సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను లవ్ ఇన్ యాక్షన్ టీమ్ సభ్యులు మానవత్వంతో స్పందించి వారికి ప్రేమతో సపర్యలు చేశారు. నారాయణపురానికి చెందిన ఈ టీమ్ సభ్యులు వారిని చేయి పట్టుకుని తీసుకువెళ్లి నారాయణపురంలో ఏలూరు కాలువ వద్ద సోమవారం వారికి జుట్టు కత్తిరించి, గెడ్డం గీసి, పిల్లలకు చేయించినట్లు సబ్బుతో ఒళ్లు రుద్ది షాంపూతో తల స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగారు. అనంతరం వారికి కడుపు నిండా ఆహారం అందించారు. ఈ టీమ్ అధ్యక్షుడు శ్రీరాముల పాలదినకరన్, ఉపాధ్యక్షుడు ఎస్.అబ్నేర్, కార్యదర్శి పెండ్యాల ప్రసాద్, కోశాధికారి పండుబాబు, కార్యనిర్వాహక సభ్యుడు కలపాల కుమార్‌తో మరికొంతమంది సభ్యులు ఎంతో మానవత్వంతో అందించిన ఈ సేవలను చూసినవారు వారిని మనసారా అభినందించారు. -
భార్యకు గుండు కొట్టించి..!
► భర్త వికృత చేష్టలపై సహాయవాణి కేంద్రంలో ఫిర్యాదు యశ్వంతపుర: భార్యకు గుండు కొట్టించి బయటకు పంపకుండా చిత్రహింసలకు గురి చేస్తున్న భర్త ఉదంతం ఇది. ఇతని వికృత చేష్టలపై భార్య మహిళా సహాయ వాణి కేంద్రంలో ఫిర్యాదు చేసింది. వివరాలు.. కేజీ హళ్లికి చెందిన బాధిత మహిళ(26)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. దంపతులకు నాలుగేళ్ల వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లికి ముందే ఆమె ఓ సంస్థలో పనిచేసేది. వివాహమైన తర్వాత ఆమె విధులకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. అంతేగాకుండా గుండు కొట్టించి ముఖంపై కత్తితో గాట్లు పెట్టి మానసికంగా హింసిస్తున్నాడు. వేధింపులు భరించలేని సదరు బాధితురాలు ఇటీవల మహిళా సహాయవాణి కేంద్రంలో ఫిర్యాదు చేసింది. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
హిందీ రాని వారి కోసం హెల్ప్‌సెంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి భాష రాక ఇబ్బందుల పాలయ్యేవారి సహాయార్థం ఓ హెల్ప్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వలస వాసుల కోసం ఫెసిలిటేషన్ కమ్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా నగరం నడిబొడ్డున దీనిని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 2.5-3 లక్షల మంది వలస వాసులకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. వలసవాసులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇది వన్ స్టాప్ సెంటర్ అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ హెల్ప్‌సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి కోటి రూపాయలు కేటాయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చే వారిలో అత్యధికులు పేదలే. కూలి పని చేయడానికో, వృత్తి విద్యను వెతుతక్కుంటూనో ఢిల్లీకి వస్తుంటారు. నగరపు హంగులను చూసి బెంబేలు పడుతుంటారు. వారికి భాష తెలియక, ఉండటానికి గూడు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పిల్లలను బడికి ఎలా పంపించాలో, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అటువంటి వారికి చేయూతనందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వాధికారి తెలిపారు. హిందీ రాని వలస వాసులకు సాయమందించడం కోసం ఏర్పాటు చేసే ఈ సెంటర్లో స్థానిక భాషలతో పాటు హిందీ తెలిసిన వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోనుంది. ఇందుకోసం వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ కేంద్రంలోని వాలంటీర్లు వలసవాసులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, పిల్లల విద్య, ప్రభుత్వ పథకాల గురించి తెలియచేసి వీలైన సాయాన్ని అందిస్తారు. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుందని, దానికి ఓ హెల్ప్‌లైన్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.