సాక్షి, న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి భాష రాక ఇబ్బందుల పాలయ్యేవారి సహాయార్థం ఓ హెల్ప్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వలస వాసుల కోసం ఫెసిలిటేషన్ కమ్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా నగరం నడిబొడ్డున దీనిని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 2.5-3 లక్షల మంది వలస వాసులకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. వలసవాసులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇది వన్ స్టాప్ సెంటర్ అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ హెల్ప్‌సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి కోటి రూపాయలు కేటాయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చే వారిలో అత్యధికులు పేదలే. కూలి పని చేయడానికో, వృత్తి విద్యను వెతుతక్కుంటూనో ఢిల్లీకి వస్తుంటారు. నగరపు హంగులను చూసి బెంబేలు పడుతుంటారు. వారికి భాష తెలియక, ఉండటానికి గూడు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పిల్లలను బడికి ఎలా పంపించాలో, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అటువంటి వారికి చేయూతనందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వాధికారి తెలిపారు. హిందీ రాని వలస వాసులకు సాయమందించడం కోసం ఏర్పాటు చేసే ఈ సెంటర్‌లో స్థానిక భాషలతో పాటు హిందీ తెలిసిన వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోనుంది. ఇందుకోసం వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ కేంద్రంలోని వాలంటీర్లు వలసవాసులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, పిల్లల విద్య, ప్రభుత్వ పథకాల గురించి తెలియచేసి వీలైన సాయాన్ని అందిస్తారు. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుందని, దానికి ఓ హెల్ప్‌లైన్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.
హిందీ రాని వారి కోసం హెల్ప్‌సెంటర్
Published Mon, Mar 9 2015 10:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM
Advertisement
Advertisement