సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని కేజీహెచ్‌లో 42 లక్షల వ్యయంతో నిర్మించిన సఖి వన్ స్టాప్ సెంటర్‌ను మంత్రులు తానేటి వనిత, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అభాగ్య, బాధిత మహిళలకు ఆసరాగా, అండగా ఉండేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు అయిదు రకాల సేవలను అందిస్తామని పేర్కొన్నారు. వేధింపులకు గురయ్యే మహిళలు 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నాలుగు నెలల పాలనలోనే మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. మహిళలకి అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. కేబినెట్‌లో కీలకమైన శాఖలు మహిళలకు అప్పగించిన రాష్ట్రం ఏపీనేని తెలిపారు. మహిళల్లో ఉన్న 53 శాతం ఎనీమియాను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని ప్రస్తావించారు.
మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమది మహిళా సంక్షేమ ప్రభుత్వమని, వైఎస్సార్‌సీపీ 151 స్థానాలు గెలుచుకోవడంతో మహిళా ఓటర్ల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. లైంగిక, యాసిడ్ బాధిత మహిళలకు అండగా ఈ సఖి వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వీఎంఆర్టీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment