One Stop Center
-
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
-
మహిళల అండతోనే అధికారంలోకి: తానేటి వనిత
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని కేజీహెచ్‌లో 42 లక్షల వ్యయంతో నిర్మించిన సఖి వన్ స్టాప్ సెంటర్‌ను మంత్రులు తానేటి వనిత, అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అభాగ్య, బాధిత మహిళలకు ఆసరాగా, అండగా ఉండేందుకు సఖి వన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సెంటర్ల ద్వారా బాధిత మహిళలకు అయిదు రకాల సేవలను అందిస్తామని పేర్కొన్నారు. వేధింపులకు గురయ్యే మహిళలు 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నాలుగు నెలల పాలనలోనే మహిళా పక్షపాతి అని నిరూపించుకున్నారని అన్నారు. మహిళలకి అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌దేనని ప్రశంసించారు. కేబినెట్లో కీలకమైన శాఖలు మహిళలకు అప్పగించిన రాష్ట్రం ఏపీనేని తెలిపారు. మహిళల్లో ఉన్న 53 శాతం ఎనీమియాను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని ప్రస్తావించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తమది మహిళా సంక్షేమ ప్రభుత్వమని, వైఎస్సార్సీపీ 151 స్థానాలు గెలుచుకోవడంతో మహిళా ఓటర్ల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. లైంగిక, యాసిడ్ బాధిత మహిళలకు అండగా ఈ సఖి వన్ స్టాప్ సెంటర్లు ఉపయోగపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వీఎంఆర్టీఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే విజయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘సఖీ’తో సమస్యల పరిష్కారం
కాజీపేట అర్బన్ : బాధిత మహిళల సంరక్షణ, వసతి, పోలీస్, న్యాయ సేవలందించేందుకు మేమున్నామంటూ భరోసా ఇస్తోంది సఖీ/వన్‌స్టాప్ సెంటర్. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు తదితర సమస్యలను ఒకే చోట పరిష్కారం అందించేందుకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఇది తోడ్పడుతోంది. 24 గంటలు అందుబాటులో సేవలందిస్తూ నేడు మహిళలకు, బాలికల సంరక్షణకు ఆత్మీయ నేస్తంగా సఖీ సెంటర్ మారింది. 2017 డిసెంబర్లో ప్రారంభం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు షీటీమ్స్, 181 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, డీవీ సెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 186 వన్‌స్టాప్ సెంటర్లను ప్రారంభించేందుక శ్రీకారం చుట్టగా రాష్ట్రంలోని పది జిల్లాలను ఎంపిక చేసింది. వీటిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవలందించేందుక ప్రణాళికలను రూపొందించింది. ఇందులో భాగంగా నగరంలో 2017 డిసెంబర్లో సర్వోదయ యూత్ ఆరనైజేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలో సఖి/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు. సఖీ సెంటర్ కార్యాలయం అందుబాటులో సేవలు.. బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు 24 గంటలపాటు సఖి/వన్‌స్టాప్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. మహిళలకు, బాలికలకు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, పోలీస్ సహాయం, కోర్టుకు రాలేని బాధిత మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయ సహాయం అందిస్తారు. వన్‌స్టాప్ సెంటర్ వీరికే.. బాధిత మహిళలు, బాలికలకు సేవలందించే లక్ష్యంతో సఖీ/వన్‌స్టాప్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గృహహింస, వరకట్న, లైంగిక వేదింపులు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, పనిచేసే చోట లైం గిక వేదింపులకు గురి చేసే చోట అన్ని శాఖ సమన్వయంతో పరిష్కార మార్గాలను చూపుతుంది. వన్‌స్టాప్ అంబులెన్స్ 260 సమస్యల పరిష్కారం.. మహిళలకు, బాలికలకు తక్షణ రక్షణ, తాత్కాలికంగా ఐదు రోజుల వసతిని అందిస్తూ బాధితులకు మేమున్నామనే భరోసానందిస్తుంది సఖీ సెంటర్. గత పదిహేను నెలల్లో సుమారు 260 బాధిత మహిళల సమస్యలను పరిష్కరించారు. జిల్లాలోని 58 డివిజన్ల్లో సఖీ సెంటర్ సేవలపై విస్త్రత ప్రచారం అందిస్తూ బాధితులకు చేరువవుతున్నారు. నిరంతర సేవలందిస్తున్నాం.. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బాధిత మహిళలకు నిరంతరం సేవలందించడం ఆనందంగా ఉంది. హింసా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. న్యాయ, పోలీసు, వైద్య సేవలతో పాటు తాత్కాలిక వసతి అందించి కౌన్సిలింగ్ ద్వారా మార్పునకు నాంది పలుకుతున్నాం. – పల్లెపాటు దామోదర్, సఖీ సెంటర్ నిర్వాహకుడు -
హిందీ రాని వారి కోసం హెల్ప్‌సెంటర్
సాక్షి, న్యూఢిల్లీ: ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చి భాష రాక ఇబ్బందుల పాలయ్యేవారి సహాయార్థం ఓ హెల్ప్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే వలస వాసుల కోసం ఫెసిలిటేషన్ కమ్ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు కానుంది. అందరికీ అందుబాటులో ఉండేలా నగరం నడిబొడ్డున దీనిని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 2.5-3 లక్షల మంది వలస వాసులకు ఇది ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. వలసవాసులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి ఇది వన్ స్టాప్ సెంటర్ అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ హెల్ప్‌సెంటర్ ఏర్పాటు కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వానికి కోటి రూపాయలు కేటాయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చే వారిలో అత్యధికులు పేదలే. కూలి పని చేయడానికో, వృత్తి విద్యను వెతుతక్కుంటూనో ఢిల్లీకి వస్తుంటారు. నగరపు హంగులను చూసి బెంబేలు పడుతుంటారు. వారికి భాష తెలియక, ఉండటానికి గూడు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. పిల్లలను బడికి ఎలా పంపించాలో, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అటువంటి వారికి చేయూతనందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రభుత్వాధికారి తెలిపారు. హిందీ రాని వలస వాసులకు సాయమందించడం కోసం ఏర్పాటు చేసే ఈ సెంటర్లో స్థానిక భాషలతో పాటు హిందీ తెలిసిన వాలంటీర్ల సేవలను ఉపయోగించుకోనుంది. ఇందుకోసం వాలంటీర్లకు గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ కేంద్రంలోని వాలంటీర్లు వలసవాసులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, పిల్లల విద్య, ప్రభుత్వ పథకాల గురించి తెలియచేసి వీలైన సాయాన్ని అందిస్తారు. ఇది స్వయం ప్రతిపత్తి గల సంస్థగా పనిచేస్తుందని, దానికి ఓ హెల్ప్‌లైన్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు.