సేంద్రియ ఎరువుతో సాగు బంగారం
ఖర్చు తక్కువ.. ఫలితమెక్కువ
అందుబాటులో ఉన్న వనరులతో ఎరువు తయారీ
వర్మి కంపోస్టు వాడకంపై రైతుల్లో ఆసక్తి
పంటల సాగుకు రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూమి సారం కోల్పోయి ఆశించిన దిగుబడి రాకపోవడం.. వాతావరణం కాలుష్యం ఏర్పడడం తదితర నష్టాలను గ్రహించిన రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారిస్తున్నారు. సహజసిద్ధంగా అందుబాటులో ఉన్న గొర్రెలు, మేకల ఎరువు, పశువుల పేడ, చెత్త, చెదారంతో వర్మికంపోస్టు తయారు చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వ్యవసాయ అధికారుల ప్రోత్సాహంతో జనగామ మండలంలో 40 వర్మి కంపోస్టు యూనిట్లు ప్రారంభయ్యాయి.
వర్మి కంపోస్టు తయారీ విధానం
వర్మి కంపోస్టు(వానపాములతో) ఎరువు తయారీ యూనిట్‌కు అవసరమైన డేరాను వ్యవసాయ శాఖ పంపిణీ చేస్తుంది. డేరాలో చెత్త, చెదారం, చెట్ల ఆకులు, పశువుల మేయకుండా వదిలేసిన, ఒడ్డు ఒరాలపై ఉన్న గడ్డి(రెండు వంతులు), పశువుల పేడ(ఒక వంతు) వేయాలి. రోజు సాయంత్రం 10 నుంచి 20 లీటర్ల నీటిని చల్లాలి. 10 నుంచి 15 రోజులలో అంతా కుళ్లి పోతుంది. ఒక కేజీ ఎర్రలు(వాన పాములు) బయట కొనుగోలు చేసి ఈ డేరాలో వేయాలి. డేరాలో కుళ్లిన ద్రావణ రసాయనం వెలువడే చోట కుండ లేదా ఒక పాత్ర ఉంచాలి. మరో 10 రోజుల్లో కుళ్లిన గడ్డి, చెత్త చెదారం, పేడలను తిన్న ఎర్రలు చేత్తలోంచి బయటకు వచ్చి విసర్జింప చేస్తాయి. దీనిని రోజు వారీగా బస్తాలలోకి ఎత్తుకోవాలి. ఇలా రెండు నెలల్లో పూర్తవుతుంది. దీని ద్వారా ఒక టన్ను(వెయ్యి కిలోలు) వర్మి కంపోస్టు తయారవుతుంది.
చీడ పీడలు, తెగుళ్లకు చెక్ వర్మి కంపోస్టు డేరాకు మూలన ఏర్పాటు చేసిన కుండలోకి చేరిన ద్రావణాన్ని అన్ని రకాల పంటలపై పిచికారీ చేయవచ్చు. పంటను ఆశించే చీడ, పీడలు, తెగుళ్లు, మసిపేను, బూడిద తెగుళ్ల నివారణిగా పని చేస్తుంది. ప్రతి 10 లీటర్ల నీటికి అర లీటరు ద్రావణాన్ని కలిపి పిచికారి చేయడం వల్ల 15-20 రోజుల వరకు పంటకు ఎలాంటి తెగులు సోకకుండా ఉంటుంది.
ఎరువు తయారీ చాలా సులువు
వర్మి కంపోస్టు తయారీ అంటే ఇబ్బందులుంటాయని రైతులు అపోహ పడుతున్నారు. ఇది చాలా సులువు. వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సూచనల మేరకు రెండు నెలల క్రితం అందుబాటులో ఉన్న వనరులతో యూనిట్ ప్రారంభించి నిర్వహిస్తున్నాను.
- యానాల చిన్న సిద్ధారెడ్డి(9951021348), రైతు (అడవికేశ్వాపూర్)
గొర్ల మందల తోలింపుతో ఖర్చు తగ్గింది
ప్రతి ఏటా నాలుగు ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నాను. గతంలో డీఏపీ, యూరియా, పోటాష్లకు రూ.12వేల నుంచి రూ.13వేలు ఖర్చు అయ్యేది. మూడేళ్లుగా మేకలు, గొర్రెల మందలను పొలాలు, చెల్కల్లో నిలబెట్టుకుంటున్నం. వాటి యజమానులకు ఎకరాకు రూ.1500 చెల్లిస్తున్నం. దీంతో ఎకరానికి ఎరువుల బస్తాల వాడకానికి రూ.4 వేల నుంచి రూ.5 వేలు వరకు మాత్రమే ఖర్చు అవుతోంది. మామూలుగా పత్తిలో డీఏపీ, యూరియా, పోటాష్ ఐదు నుంచి ఆరు మార్లు వేస్తారు. గొర్రెలు, మేకల మందలను నిలుపుకుంటే ఒకటి, రెండు మార్లు వేస్తే సరిపోతుంది. అంటే రూ.6 వేల వరకు ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా భూమిలో బలం పెరుగుతుంది.
- ముక్కెర శ్రీను, పత్తి రైతు(గానుగుపహాడ్)
సేంద్రియ ఎరువు అన్ని రకాల మేలు
పశువులు, మేకలు, గొర్రెలకు చెందిన టన్ను పేడలో 5 నుంచి 8 కిలోల నత్రజని, 2కిలో భాస్వరం, 2 కిలోల ఫాస్పరస్‌తోపాటు పోటాష్, సల్ఫర్ ఉంటాయి. పంటకు సూక్ష్మ పోషక పదార్థాలు ఎక్కువగా అందడంతోపాటు, పొలాల్లో నత్తగుల్లలు, వానపాములు వృద్ధి చెంది భూసారం పెరుగుతుంది. గొర్రెలు, మేకల మందల నిలుపుదలతో వర్షం వచ్చిన కొద్ది రోజుల పాటు భూమిలో తేమ నిలిచి ఉంటుంది. తద్వారా రసాయన ఎరువులు వాడిన దానికంటే పంట దిగుబడిలో 25-30 శాతం వరకు వృద్ధి కనిపిస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జనగామ మండలంలోని అడవికేశ్వాపూర్, ఎర్రగొల్లపహాడ్, పెద్దపహాడ్, ఓబుల్‌కేశ్వాపూర్, గోపరాజుపల్లి గ్రామాలకు 40 వర్మి కంపోస్టు యూనిట్లు పంపిణీ చేశాం.
- అలువాల శ్రీనివాస్(88866 14586) (జనగామ ఏఓ)