Herat provinces
-
అఫ్గానిస్తాన్‌లో మళ్లీ భూకంపం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ఈనెల 7వ తేదీన శక్తివంతమైన భూకంపం చోటుచేసుకున్న హెరాట్ ప్రావిన్స్‌లోనే ఆదివారం మళ్లీ భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. భూకంప కేంద్రం హెరాట్ ప్రావిన్స్ రాజధాని హెరాట్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో భూమికి 8 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. తాజా భూకంపం తాకిడికి నలుగురు చనిపోగా మరో 150 మందికి పైగా గాయపడినట్లు స్వచ్చంద సంస్థలు తెలిపాయి. బలోచ్ ప్రాంతంలోని రబట్ సాంగి జిల్లాలోని కొన్ని గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలు చేరుకోవాల్సి ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశా లున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 7న భూకంపం సంభవించిన హెరాట్ ప్రావిన్స్‌లో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. మొత్తం 2 వేల మందికి పైగా చనిపోగా మృతుల్లో 90 శాతం వరకు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి పేర్కొంది. -
అఫ్గాన్ భూకంపం..2,400కు చేరిన మరణాలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లోని హెరాట్ ప్రావిన్స్‌లో శనివారం సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మట్టిదిబ్బల్లా మారిన ఇళ్ల శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం స్థానికులు, సహాయక సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. సోమవారం మరికొన్ని మృతదేహాలు బయటపడటంతో మృతుల సంఖ్య 2,445కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, క్షతగాత్రుల సంఖ్య గతంలో ప్రకటించిన 9,240 కాదన్నారు. 2వేల మంది మాత్రమే గాయపడ్డారన్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. హెరాట్‌లోని ఏకైక ప్రధాన ఆస్పత్రి వెలుపల బాధితుల కోసం బెడ్లు ఏర్పాటు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక్కడ ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. సోమవారం మరోసారి భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురై రోడ్లపైకి చేరుకున్నారు. అఫ్గాన్ ఉప ప్రధాని, ఆర్థిక మంత్రి అబ్దుల్ బరాదర్ సోమవారం హెరాట్ ప్రావిన్స్‌లో పర్యటించారు. ఇజ్రాయెల్ పరిణామాలపైనే ప్రపంచదేశాల దృష్టి కేంద్రీకృతం కావడంతో అఫ్గాన్‌లో భూకంపబాధితులకు సాయం నెమ్మదిగా అందుతోంది. దశాబ్దాలపాటు అంతర్యుద్ధంతో చితికిపోయిన అఫ్గానిస్తాన్ ప్రజలకు తాజాగా సంభవించిన భూకంపం మరింత కుంగదీసింది. అంతర్జాతీయ సమాజం స్పందించాలంటూ ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిచ్చినప్పటికీ చైనా, పాకిస్తాన్ వంటి కొన్ని పొరుగుదేశాలు మాత్రమే అఫ్గాన్లకు సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అఫ్గాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీకి చెందిన 20 బృందాలు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సేవలందిస్తున్నాయి. నీడ కోల్పోయిన వారికోసం తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేసింది. -
తాలిబన్ల దాడులు; 16 మంది భద్రతా సిబ్బంది మృతి
అఫ్గానిస్తాన్: అఫ్గానిస్తాన్‌లోని సాల్మా డ్యామ్ సమీపంలో తాలిబన్ల దాడుల్లో 16 మంది భద్రతా సిబ్బంది మృతి చెందారు. పశ్చిమ ఆఫ్ఘన్‌లోని చిస్తి జిల్లాలోని హెరాత్ ప్రావిన్స్‌ను తాలిబన్లు తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇక్కడి చెక్‌పాయింట్ సహా ఆ ప్రదేశాలను తమ వశం చేసుకున్న తాలిబన్లు భద్రతా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 16 మంది సిబ్బంది మృతి చెందగా, మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతకాలంగా సాల్మా డ్యామ్ వద్ద భారత ప్రభుత్వం ఆఫ్ఘన్ ప్రభుత్వంతో కలిసి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అతి పెద్ద ప్రాజెక్టును చేపడుతుంది. -
ఆఫ్ఘాన్‌లో 22 మంది తీవ్రవాదుల హతం
దేశంలో తీవ్రవాదుల ఏరివేత లక్ష్యంగా గత 24గంటల కాలవ్యవధిలో నిర్వహించిన ఆపరేషన్‌లో 22 మంది తాలిబాన్ తీవ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆఫ్ఘానిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.ఆ ఆపరేషన్‌లో మిలటరీ సంకీర్ణ దళాలు,నాటో దళాలు సంయుక్తంగా పాల్గొన్నాయని వివరించింది. కందహార్, గజనీ, హెరత్, ఉర్జగన్ తదితర ప్రావెన్స్లో ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపింది.అంతేకాకుండా ఆయుధాలను,పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఆ దాడుల్లో పాల్గొన్న వారిలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.