Hero adhi
-
నెక్స్ట్ నువ్వే.. థియేటర్లో సందడి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ‘నెక్ట్స్ నువ్వే’ చిత్ర యూనిట్ సోమవారం విజయవాడలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా సినిమా ప్రదర్శిస్తున్న జీ3 రాజ్యువరాజ్ థియేటర్‌కు సోమవారం వచ్చిన యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో ముచ్చటించారు. అనంతరం హీరో ఆది విలేకరులతో మాట్లాడుతూ చిన్న చిత్రాన్ని హిట్‌చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం విజయవంతం కావడం సంతోషాన్నిచ్చిందన్నారు. బ్రహ్మాజీ, రఘుబాబు చక్కగా నటించి కామెడీ పండించారన్నారు. హీరోయిన్లు రష్మీ, వైభవీ శాండిల్య పాల్గొన్నారు. -
చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం మా ‘చుట్టాలబ్బాయి’ ద్వారా వచ్చింది. విజయవాడతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు వచ్చినా కృష్ణానదిలో చిల్లర వేస్తుంటాం. అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరికీ అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని సినీ నటుడు, వ్యాఖ్యాత సాయికుమార్, ఆయన తనయుడు ఆది అన్నారు. ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను వారిద్దరితో పాటు చుట్టాలబ్బాయి చిత్ర దర్శకుడు వీరభద్రం శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తులో జరుగుతున్న సామూహిక వరలక్ష్మీవ్రతాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి, పుష్కరాల నవ హారతులకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయికుమార్ పేర్కొన్నారు. ఆది నటించిన చుట్టాలబ్బాయి విజయవంతమైందని, ఆదితో కలిసి నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎక్కడికెళ్లినా ఆదిని చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారన్నారు. అమ్మవారి కరుణ, కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. హీరో ఆది మాట్లాడుతూ చుట్టాలబ్బాయి సినిమా విజయవంతంగా నడుస్తోందన్నారు. నాన్నతో కలిసి నటించడం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ సినిమా తన జీవితంలో మరిచిపోలేనిదన్నారు. వరలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం కలగడం మరింత సంతోషంగా ఉందని ఆది పేర్కొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. సాయికుమార్, ఆదితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. -
ఫుల్ గరం గరంగా..!
‘‘నాన్నగారు, నేను, నా తమ్ముళ్లు రవిశంకర్, అయ్యప్ప మేమందరం బాలనటులుగా చేసినవాళ్లమే. ఆది కూడా చిన్నప్పుడు ‘కప్పలు’ అనే నాటకంలో నటించాడు. బాలనటులుగా రాణించిన మేం ఈ బాలల దినోత్సవం నాడు సొంత సంస్థ ఆరంభించడం ఆనందంగా ఉంది. నటుడు నర్రా వెంకటేశ్వరరావుగారి కుమార్తె వసంతా శ్రీనివాస్, నా భార్య సురేఖ, ఛాయాగ్రాహకుడు బాబ్జీ సతీమణి షీలా బాబ్జీ నిర్మాతలుగా ఆదితో ‘గరం’ నిర్మించారు. దర్శకుడు మదన్ చాలా మంచి అవుట్‌పుట్ ఇచ్చారు’’ అని నటుడు సాయికుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసాయి స్క్రీన్స్ సంస్థను నిర్మాత అచ్చిరెడ్డి ఆవిష్కరించారు. ‘గరం’ మోషన్ పిక్చర్‌ను నటుడు రఘుబాబు, టైటిల్ లోగోను ఆది, అదా శర్మ ఆవిష్కరించారు. ‘‘ఒక సంపూర్ణమైన నటుడికి కావల్సిన అన్ని లక్షణాలూ ఉన్న హీరో ఆది’’ అని అచ్చిరెడ్డి అన్నారు. ఆది మాట్లాడుతూ - ‘‘సినిమా నిర్మాణం ఎంత కష్టమో మా హోమ్ బేనర్‌పై ఈ సినిమా నిర్మించినప్పుడు నాకు తెలిసింది. నిర్మాత లేనిదే సినిమా లేదు. అందుకే తెలుగు పరిశ్రమలో ఉన్న నిర్మాతలందరికీ ధన్యవాదాలు. నేను నిర్మాతల నటుడిగానే ఎప్పటికీ కొనసాగుతాను. అమ్మా, నాన్న, వసంతా ఆంటీ, షీలా ఆంటీల సపోర్ట్‌తో ఈ సినిమా వస్తోంది. ఈ చిత్రకథలో ఒక ఫైర్ ఉంది. ఫుల్ గరం గరంగా ఉంటుంది. ఇందులో ఉన్న ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకంతో చేశాం’’ అని చెప్పారు. మదన్ మాట్లాడుతూ - ‘‘శ్రీనివాస్ గవిరెడ్డి ఓ పాయింట్ చెబితే చాలా నచ్చింది. దాంతో ఆ కథను నేనే తెరకెక్కిస్తానని తనను అడిగాను. మనం ద్వేషించేవాళ్లని ప్రేమించే స్థాయికి ఎదగాలంటే కష్టం. ఈ చిత్రం ప్రధానాంశం ఇదే. ఆది ఎంతగానో ప్రేమించి ఈ సినిమా చేశాడు’’ అని చెప్పారు. కథను నమ్మి సాయికుమార్‌గారు, మదన్‌గారు ఈ చిత్రం రూపొందించారని కథ-సంభాషణల రచయిత శ్రీనివాస్ గవిరెడ్డి అన్నారు. సురేఖా సాయికుమార్, వసంతా శ్రీనివాస్, షీలా బాబ్జీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత బాబ్జీ, సంగీతదర్శకుడు అగస్త్య, ఛాయాగ్రాహకుడు సురేందర్ రెడ్డి, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.