చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారు
చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారు
Published Sat, Aug 27 2016 12:28 AM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం మా ‘చుట్టాలబ్బాయి’ ద్వారా వచ్చింది. విజయవాడతో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు వచ్చినా కృష్ణానదిలో చిల్లర వేస్తుంటాం. అమ్మ దీవెనలు ప్రతి ఒక్కరికీ అందాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని సినీ నటుడు, వ్యాఖ్యాత సాయికుమార్, ఆయన తనయుడు ఆది అన్నారు. ఇంద్రకీలాద్రిపై వరలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను వారిద్దరితో పాటు చుట్టాలబ్బాయి చిత్ర దర్శకుడు వీరభద్రం శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం మహామండపంలోని ఆరో అంతస్తులో జరుగుతున్న సామూహిక వరలక్ష్మీవ్రతాల సందర్భంగా ఏర్పాటుచేసిన ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. వరలక్ష్మీదేవిగా దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి, పుష్కరాల నవ హారతులకు వ్యాఖ్యాతగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయికుమార్ పేర్కొన్నారు. ఆది నటించిన చుట్టాలబ్బాయి విజయవంతమైందని, ఆదితో కలిసి నటించడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎక్కడికెళ్లినా ఆదిని చుట్టాలబ్బాయిగా ఆదరిస్తున్నారన్నారు. అమ్మవారి కరుణ, కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నానన్నారు. హీరో ఆది మాట్లాడుతూ చుట్టాలబ్బాయి సినిమా విజయవంతంగా నడుస్తోందన్నారు. నాన్నతో కలిసి నటించడం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ సినిమా తన జీవితంలో మరిచిపోలేనిదన్నారు. వరలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునే భాగ్యం కలగడం మరింత సంతోషంగా ఉందని ఆది పేర్కొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు ప్రసాదాలు అందజేశారు. సాయికుమార్, ఆదితో ఫొటోలు దిగేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు.
Advertisement