![Police Indecent Behavior With Women Devotees In Indrakiladri](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/10/9/265.jpg.webp?itok=Q96v2-Tp)
అన్ని శాఖల అధికారులు, సిబ్బంది
విధులకు అడుగడుగునా ఆటంకాలు
మహిళా భక్తులతో అసభ్య ప్రవర్తన
పోలీసుల తీరుపై సాధారణ భక్తులు ఆగ్రహం
పోలీస్ కమిషనర్ వద్ద గోడు వెళ్లబోసుకున్న భక్తులు
‘నా పేరు నందిని. మాది కోదాడ. కుటుంబంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చాను. పావు గంటలో అమ్మవారి దర్శనం అవుతుందని చెప్పడంతో రూ.500 టికెట్లు తీసుకున్నాం. క్యూ లైన్‌లోకి వచ్చి గంటన్నర గడచినా చిన గాలిగోపురం వద్దే పోలీసులు నిలిపేశారు. టికెట్లు కొనని వారిని మాత్రం పంపించారు. ఇదేం అన్యాయం అని అడిగితే దురుసుగా మాట్లాడుతున్నారు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను పంపిస్తూ టికెట్లు కొన్న భక్తులను గంటల తరబడి నిలబెట్టేశారు’. ఇది ఒక్క నందిని అభిప్రాయమే కాదు. అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల అందరి విమర్శ.
విజయవాడస్పోర్ట్స్: ఇంద్రకీలాద్రిపై ఈ నెల మూడో తేదీన దసరా ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కొండను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని భక్తులతో పాటు, ఉత్సవ విధులకు హాజరైన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తొలి రోజు నుంచే పోలీసుల దౌర్జన్యంపై పలువురు అధికారులు, సిబ్బంది తమ శాఖల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. మంగళవారం పోలీసుల తీరు మరింత శృతిమించడంతో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై ఎన్నడూ లేని విధంగా నల్ల రిబ్బన్లతో నిరసనలు కొనసాగాయి.
అన్నింటా వారే..
పోలీస్‌శాఖ అధికారులు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించిన తరువాత దసరా ఉత్సవాలు ప్రారంభం కావడం కొన్నేళ్లగా ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అమ్మవారు తమ ఆడపడుచని, ఉత్సవం తమదేననే ధోరణిలో పోలీసులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దసరా ఉత్సవాలకు దేవదాయ శాఖ 1,200 మంది, మునిసిపల్ 1,500 మంది, ఎన్‌సీసీ 400 మంది, రెవెన్యూ 300 మంది, వైద్య–ఆరోగ్య 250 మంది, అగి్నమా పక శాఖ 150 మంది అధికారులు, సిబ్బందిని ఉత్సవాలకు కేటాయించగా.
పోలీస్ శాఖ మాత్రం ఆరు వేల మందిని కొండ చుట్టూ మోహరించింది. భక్తులకు అవసరమైన సేవలను దేవదాయ, రెవెన్యూ, మునిసిపల్, ఎన్‌సీపీ, వైద్య ఆరోగ్య శాఖలు అందిస్తుంటే రక్షణ పేరుతో వచ్చిన పోలీసులు పెత్తనం చెలాయిస్తున్నారు. మహామంటపం దిగువనున్న లిఫ్ట్‌ను పూర్తిగా స్వాదీనం చేసుకుని తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మినహా ఎవరినీ లిఫ్ట్‌లోకి అనుమతించడం లేదని, క్యూ లైన్ సజావుగా సాగకుండా నిరంతరం అడ్డుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఉత్సవాల తొలి రోజే దేవదాయ శాఖ ఇంజినీర్‌ను పోలీసులు అడ్డుకుని జులుం ప్రదర్శించారు. దీంతో సదరు ఉద్యోగి మహామంటపం కింద పోలీసుల కోసం వేసిన టెంట్‌లు, కురీ్చలను తొలగించేశారు. ఈ పంచాయితీ రాష్ట్ర సచివాలయం అధికారులు వరకు వెళ్లింది. లిఫ్ట్‌ల వద్ద పోలీసులు చేస్తున్న అతికి నిరసనగా అదే లిఫ్ట్‌ల వద్దే పారిశుద్ధ్య కార్మికులు చెత్తను డంప్ చేస్తున్నారు. ఓం రింగ్ నుంచి ప్రొటోకాల్ వరకు వెళ్లకుండా ఓ న్యాయమూర్తిని పోలీసులు ఇబ్బంది పెట్టారు.
చివరకు పోలీస్ ఉన్నతాధికారులు వచ్చి సదరు న్యాయమూర్తికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. రూ.500 టిక్కెట్లు కొన్న భక్తులను నిలిపివేసి, తమ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను పోలీసులు పంపించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, వినాయకుడి గుడి, ఘాట్‌రోడ్డు గాలిగోపురం ప్రాంతాల్లో తమను నిలిపివేస్తున్నారని, ఆలయంపై వరకు బైక్‌లను అనుమతించడం లేదని, తమను ఆలయంలోకి వెళ్లనీయడంలేదని పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు అసభ్యకరంగా ఉందని పోలీస్ కమిషనర్ వద్ద పలువురు మహిళలు వాపోయారు. ఉత్సవ సేవా కమిటీలో ఉన్న తమతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
నల్ల రిబ్బన్లతో నిరసన
ఖాకీల తీరుకు నిరసనగా మీడియా ప్రతినిధులు మంగళవారం ఆందోళనకు దిగారు. మీడియా పాయింట్ వద్ద నల్ల రిబ్బన్లు ధరించి నినాదాలు చేశారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిరసన కొనసాగింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకున్న పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు హుటా హుటిన మీడియా పాయింట్ వద్దకు చేరుకున్నారు. మీడియా పాయింట్ నుంచే డీజీపీ అమ్మవారి దర్శనానికి వెళ్లాల్సి ఉంది. డీజీపీ వెళ్లే సమయంలో పోలీస్ శాఖకు వ్యతిరేకంగా మీడియా ప్రతినిధులు నినాదాలు చేస్తే పరువు పోతుందని గ్రహించి, వారితో చర్చలు జరిపారు. డీసీపీ గౌతమి సాలి తీరు సరిగ్గా లేదని సీపీకి మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా వాళ్లను కొండపైకి అనుమతించవద్దని డీసీపీ పదేపదే ఆదేశాలిస్తున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటానని సీపీ హామీ ఇవ్వడంతో మీడియా ప్రతినిధులు నిరసన విరమించారు. ఆ వెంటనే అదే మార్గంలో డీజీపీని అమ్మవారి దర్శనానికి సీపీ వెంట బెట్టుకుని వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment