Heron
-
ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్..
డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుకెళ్లి తొడ కొట్టిందట.. ఇదో సినిమాలోని డైలాగు.. సపోజ్.. ఫర్ సపోజ్.. కోడి నిజంగానే తొడకొడితే ఏమవుతుంది.. సాయంత్రానికి చికెన్ పకోడి అవుతుంది! ఇదిగో ఈ కొంగబావ కూడా ఆ కోడి టైపే.. అందుకే ఇన్‌ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్న తెలివిడి లేకుండా.. మొసలితోనే పరాచికాలాడింది.. అయినా.. ఫ్లూటు జింక ముందు ఊదాలి.. సింహం ముందు కాదు.. ఊదితే ఏమవుతుంది.. ఇలా అవుతుంది. పరాచికాలకు దిగిన కొంగ మరు క్షణంలోనే మొసలికి పలహారమైపోయింది. ఈ ఫొటోలను కెన్యాలోని మారా నది వద్ద తీశారు. -
షటప్..కొంగ బావా..
అమెరికాలోని ఫ్లోరిడా.. ఎవర్గ్లేడ్స్ జాతీయ పార్కు..మధ్యాహ్నం సమయం.. కొంగ బావ కడుపు మాడిపోతోంది.. ఒంటికాలిపై జపం చేసినా.. చేపలేమో చిక్కలేదాయో..మరేం చేయాలి అని ఆలోచనలో పడింది.. ఇంతలో అటుగా పోతున్న పచ్చ పాము కంటపడింది. ఎలాగూ నాన్వెజ్జే కదా.. ఏదైతే ఏమిటి అనుకుంది.. పామును అమాంతం మింగేద్దామని ప్లానేసింది.. ప్రయత్నమూ చేసింది. దీంతో పాముకేమో చిర్రెత్తుకొచ్చింది.. ఇద్దరి మధ్యా ఓ 20 నిమిషాలు భీకరమైన యుద్ధం నడిచింది. సడన్‌గా పాముకు లైటు వెలిగింది.. తనను మింగేద్దామనుకున్న కొంగ బావ మూతికే తాళమేసేస్తే.. అని అనుకుంది. వెంటనే.. మూతినిలా చుట్టుకుని.. సర్పబంధనం చేసేసింది.. అంతే.. కొంగ బావకు పరిస్థితి అర్థమైంది. తెల్ల జెండా ఎగరేసింది.. నోటికి బదులు కాళ్లకు పనిచెప్పింది.. ► ఈ ఆసక్తికర దృశ్యాన్ని అమెరికాకు చెందిన జోస్ గార్షియా అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. 2017 బర్డ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పోటీకి వచ్చిన ఎంట్రీల్లో మెచ్చదగిన చిత్రాలను తాజాగా విడుదల చేశారు. అందులో ఈ ఫొటోకూడా ఒకటి.