ఇజ్రాయెల్ డ్రోన్లతో పాక్, చైనాలకు చెక్!
- సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్ల కొనగోలు చేయనున్న భారత్
- ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీ నుంచి రూ.26 వేల కోట్లతో 10 డ్రోన్లు
- త్వరలో రక్షణ శాఖకు అప్పగింత
న్యూఢిల్లీ: ఆయుధ సమపార్జనలో భారత రక్షణ శాఖ మరో కీలక ముందడుగువేసింది. అటు పాకిస్థాన్, ఇటు చైనా సరిహద్దుల్లో తరచూ ఉద్రక్త పరిస్థితులు తలెత్తుతుండటం, ఆ రెండు దేశాలకంటే మెరుగైన లేదా సరిసమానమైన ఆయుధ సంపత్తిని కలిగిఉండటం అనివార్యంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిష్ఠాత్మక హెరాన్ టీపీ డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోనున్నది.
ఇజ్రాయెల్ ఎయిరోస్సేస్ ఇండస్ట్రీ (ఐఏఐ) తయారుచేసిన హెరాన్ టీపీ డ్రోన్లు.. భూమి నుంచి దాదాపు 11 కిలో మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు. నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి, పొటో, స్కానింగ్ చేస్తుంది. ఆదేశానుసారం పేలుళ్లు కూడా జరుపుతుంది. ఈ మానవరహిత వైమానిక వాహనం ఒక్కసారి ఇంధనం నింపుకున్న తర్వాత ఏకధాటిగా 50 గంటలకుపైగా ప్రయాణించగలదు. ఐఏఐ రూపొందించిన డ్రోన్లలో హెరాన్ టీపీ సరికొత్త వెర్షన్.
నిజానికి రక్షణ శాఖ మూడేళ్ల కిందటే డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనను భారత ప్రభుత్వం ముందుంచింది. సుధీర్ఘ కసరత్తు అనంతరం గత సెప్టెంబర్ లో ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ల కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 10 డ్రోన్లను కొనుగోలు చేసేందుకుగానూ ఏకంగా రూ. 26 వేల కోట్లు వెచ్చించనుంది. అతి తర్వరలోనే ఇజ్రాయెల్ డ్రోన్లు భారత్ కు చేరుకుంటాయన్న రక్షణ శాఖ సంబంధిత వివరాలు తెలిపేందుకు నిరాకరించింది.
ప్రస్తుతం భారత్ వద్ద నిఘా డ్రోన్లు మాత్రమే ఉన్నాయి. కొద్ది నెలల కిందట తన భూభాగంలో ఒక డ్రోన్ ను కూల్చేసిన పాక్ ఆర్మీ.. అది భారత్ కు చెందిన గూఢచార డ్రోనే అని ఆరోపించింది. ఆ తరువాత సదరు డ్రోన్ చైనాలో తయారయినట్లు, పాకిస్థానే దానిని వినియోగించినట్లు తెలియవచ్చింది. మరోవైపు పాకిస్థాన్ ఆర్మీ.. ఉగ్రవాదులపై డ్రోన్లతో దాడి చేసినట్లు గతవారం ప్రకటించింది. వీటన్నింటి దృష్ట్యా భారత్ కూడా కాల్పులు, పేలుళ్లు జరపగల డ్రోన్లను కొనుగోలు చేస్తున్నది.