hgcl
-
ఓఆర్ఆర్ను ఏ ప్రాతిపదికన అప్పగించారు?
సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్లపాటు ఏ ప్రాతిపదికన ప్రైవేట్ కంపెనీకి అప్పగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) డైరెక్టర్‌తోపాటు ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్, ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 30 ఏళ్లపాటు ఓఆర్ఆర్ నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక అంచనా రాయితీ విలువ ఎంత అనేది వెల్లడించకుండా హెచ్ఎండీఏ, పురపాలక పరిపాలన–పట్టణాభివృద్ధి శాఖ కలసి ఐఆర్బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థతో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పిటిషన్లో పేర్కొన్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ను టోల్– ఆపరేట్– ట్రాన్స్ఫర్ (టీవోటీ) విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ఈ ఒప్పందానికి సంబంధించిన అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే ఆదేశాలివ్వలేం.. ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం రోజువారీగా టోల్ ఫీజు రూ.88 లక్షల వరకు వసూలవుతోందని, ఈ లెక్కన 30 ఏళ్ల కాలానికి లెక్కిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం కంపెనీ పాలవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని, దురుద్దేశంతోనే దాఖలు చేశారని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పిటిషనర్ తరఫు న్యాయవాదికి చెప్పింది. -
ఐపీఓవై–2022కు హైదరాబాద్ ఆతిథ్యం
గచ్చిబౌలి: ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్(ఐపీఓవై) అవార్డులకు ఎంపికైన హైదరాబాద్‌కు ప్రపంచ వ్యాప్తంగా మరింత గుర్తింపు రానుందని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్, హెచ్ఎండీఏ కార్యదర్శి బి.ఎం.సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయంలో మీడియాతో ఐపీవోవై–2022 వివరాలను ఆయన వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్‌కు ఆతిథ్య నగరంగా హైదరాబాద్ ఎంపికైందన్నారు. 65 దేశాల నుంచి 5 వేల మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఫొటో జర్నలిజం, డాక్యుమెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్ లైఫ్, స్ట్రీట్, పోర్ర్టెయిట్, వెడ్డింగ్, మొబైల్స్ తదితర 8 విభాగాల్లో అవార్డులు ఇస్తారని తెలిపారు. ఐపీఎఫ్ (ఇండియన్ ఫొటో ఫెస్టివల్) వ్యవస్థాపకులు అక్విన్ మాథ్యూస్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను ప్రత్యేక కేటగిరీగా చేర్చామన్నారు. మార్చి 21 నుంచి ప్రపంచ వ్యాప్త ఫొటోగ్రాఫర్ల నుంచి ఎంట్రీలను స్వీకరిస్తారన్నారు. విజేతల ప్రకటన ఆగస్టు 15, అవార్డుల ప్రదానం హైదరాబాద్‌లో సెప్టెంబర్ 10న ఉంటుందని తెలిపారు. రూ.25 లక్షలు నగదు, కెమెరాలను గెలుచుకునే అవకాశం ఫొటోగ్రాఫర్లకు ఉంటుందన్నారు. -
ఓఆర్ఆర్ ‘గ్రోత్’కు నవశక్తి
సాక్షి,సిటీబ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డులో అభివృద్ధి పనులతో పాటు గ్రోత్ కారిడార్ (గ్రిడ్ రోడ్లు, రేడియల్ రోడ్ల అనుసంధానం) పనులు వేగవంతం కానున్నాయి. ఆయా పనులను పట్టాలెక్కించేందుకు హెచ్ఎండీఏ చర్యలు ప్రారంభించింది. ఈ పనులను పర్యవేక్షించే ‘హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్’ (హెచ్‌జీసీఎల్)కు చైర్మన్‌గా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా అర్వింద్‌కుమారే కొనసాగుతున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆయనే ఉన్నారు. పలు విభాగాల బాధ్యతలు నిర్వహిస్తుండడంతో ఆయనపై పనిభారం పెరిగింది. దీంతో గ్రోత్ కారిడార్ పనులను పరుగులు పెట్టించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా ఉన్న హరిచందన దాసరికి హెచ్‌జీసీఎల్ చైర్మన్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సోమవారం అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓఆర్ఆర్పై ఫోకస్ పెట్టాల్సిందే.. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చైర్మన్‌గా హరిచందన చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. సుమారు 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పరిధిలో ఇంజినీరింగ్ పనులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ మార్గంలో వాహనాల రద్దీ విపరీతంగా ఉండడంతో ప్రస్తుతమున్న 19 ఇంటర్ చేంజ్లకు తోడు మరికొన్నింటిని ఏర్పాటు చేసేందుకు గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలను కార్యరూపంలోకి తేవాల్సి ఉంది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ మార్గంలో వాహనాల రద్దీ ఉండడంతో ఆ మార్గంలోనే ఉన్న నార్సింగ్ వద్ద మరో ఇంటర్ చేంజ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పనులను సైతం యుద్ధప్రాతిపదికన పట్టాలెక్కించాలి. దీన్ని ఆచరణలోకి తెస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని హెచ్ఎండీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఓఆర్ఆర్ మార్గంలోని సర్వీసు రోడ్ల వద్ద విలేజ్ అండర్ పాస్‌లను నిర్మించాల్సిన అవసరముంది. ఆ దిశగా హెచ్‌జీసీఎల్ చైర్మన్‌గా హరిచందన దృష్టి సారించాలి. పట్టాలెక్కని గ్రిడ్ రోడ్లు ఓఆర్ఆర్ గ్రోత్ కారిడార్‌లో అతిముఖ్యమైన గ్రిడ్ రోడ్ల నిర్మాణ పనులు ఎన్నో ఏళ్లుగా మరుగున పడిపోయాయి. 2008లో మాస్టర్ ప్లాన్ గ్రోత్ కారిడార్ ప్రకారం దాదాపు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ ఇరువైపులా దాదాపు 718 కిలోమీటర్ల మేర వందలాది గ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. కానీ పనులు మాత్రం పట్టాలెక్కలేదు. సర్వీస్ రోడ్లతో పాటు ఇంటర్ చేంజ్‌లతో అనుసంధానం చేస్తూ ఈ రహదారులను అభివృద్ధి చేస్తే ట్రాఫిక్ రద్దీ ఉండదని, అందుకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం–హయత్‌నగర్, మహేశ్వరం–శంషాబాద్– ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్–శంషాబాద్–మొయినాబాద్–శంకర్పల్లి, రామచంద్రపురం–శంకర్పల్లి–పటాన్చెరు, రాజేంద్రనగర్–శేరిలింగంపల్లి–రామచంద్రపురం–జిన్నారంగ్రిడ్ రోడ్లను అభివృద్ధి చేయాలని గుర్తించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. వీటిని నిర్మించినట్టయితే నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గి శివార్లలో అభివృద్ధి వేగం పుంజుకొనే అవకాశముంది. మేడ్చల్, కుత్బుల్లాపూర్, శామీర్‌పేట్, కీసర, ఘట్కేసర్, పటాన్చెరు ప్రాంతాలను అనుసంధానం చేస్తే ఆయా ప్రాంతాలు మినీ పట్టణాలుగా అభివృద్ధి చెందుతాయి. -
ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ
- ప్రయాణించే మార్గం స్థితిగతులు ముందే తెలుస్తాయ్.. - రెండు బిడ్స్ దాఖలు - రూ.210 కోట్లతో నిర్మాణం..నిర్వహణ సాక్షి, సిటీబ్యూరో: ఔటర్ రింగ్‌రోడ్డుపై ఆధునిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ రహదారిపై గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనదారులు ఆ మార్గంలో ట్రాఫిక్, వాతావరణం తదితర పరిస్థితులను తెలుసుకొనేందుకు వీలుగా ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. ఔటర్‌పై 19 జంక్షన్ల (ఇంటర్ ఛేంజెస్)లో రూ.210 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల కోసం హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది. వీటిని రెండ్రోజుల క్రితం తెరిచారు. ఎల్అండ్టీ, ఈఎఫ్‌సీఓఎన్ సంస్థల నుంచి రెండు బిడ్స్ దాఖలయ్యాయి. వీలైనంత త్వరలో సాంకేతిక ప్రక్రియను పూర్తిచేసి, రుణదాత జైకా అనుమతి తీసుకొన్నాక ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరవాలని అధికారులు నిర్ణయించారు. టెండర్ ప్రక్రియను వచ్చే 3 నెలల్లో పూర్తిచేసి 2014 నవంబర్‌లో నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్‌రోడ్డుపై 20 జంక్షన్లకు గాను 19 చోట్ల ఈ ఈ ఆధునిక సమాచార వ్యవస్థను 18 నెలల వ్యవధిలో నిర్మించి, అయిదేళ్ల పాటు నిర్వహించాలనేది లక్ష్యంగా నిర్దేశించారు. కాంట్రాక్టు సంస్థ ఖరారయ్యాక లక్ష్యాల మేరకు పనులు జరిగితే... ఔటర్‌పై ఆధునిక సమాచార వ్యవస్థ 2016లో అందుబాటులోకి రానుంది. కళ్ల ముందే సమాచారం ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని నగరాలలో మాత్రమే ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్’ అమల్లో ఉంది ఔటర్‌పై ఇది అందుబాటులోకి వస్తే నిర్ణీత కిలోమీటర్ల పరిధిలో తాము వెళ్లే రహదారిపై ట్రాఫిక్ స్థితిగతుల గురించి వాహనచోదకులు ముందే తెలుసుకోవచ్చుప్రయాణించే మార్గంలో రద్దీ, రోడ్డుపై తవ్వకాలు లేదా ప్రమాదాలు, అలాగే వర్షం నీరు నిలిచినా, పొగమంచు కమ్ముకున్నా.. వెంటనే ఆ వివరాలు తెలుస్తాయి 19 జంక్షన్లలో సీసీ కెమెరాలు, ఎమర్జెన్సీ కాల్ బాక్స్ (ఈసీబీ)లు, ఆటోమాటిక్ వెహికల్ క్లాసిఫయర్ కం కౌంటర్ (ఏబీసీసీ), వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డులు, లార్జ్ డిస్ప్లే స్క్రీన్, నానక్‌గూడలో ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్, కంప్యూటర్-ఎలక్ట్రానిక్-కమ్యూనికేషన్ సిస్టమ్ వంటివి ఏర్పాటు చేస్తారు ప్రతి జంక్షన్‌కు 1 కి.మీ. ముందుగానే వేరియబుల్ మెసేజ్ సైన్ బోర్డు ఉంటుంది. దీనిపై ఎప్పటికప్పుడు ఔటర్‌పై ట్రాఫిక్, రోడ్డు, వాతావరణ పరిస్థితుల సమాచారాన్ని ప్రత్యేక ఎలక్ట్రానిక్ డిస్ప్లే ద్వారా ప్రదర్శిస్తారు.