సాక్షి, హైదరాబాద్: నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతలను 30 ఏళ్లపాటు ఏ ప్రాతిపదికన ప్రైవేట్ కంపెనీకి అప్పగించారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) డైరెక్టర్‌తోపాటు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్, ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. 30 ఏళ్లపాటు ఓఆర్‌ఆర్ నిర్వహణ, టోల్ వసూలు బాధ్యతల టెండర్‌ను రూ.7,380 కోట్లకు ఓ కంపెనీకి అప్పగించడంలో పారదర్శకత లేదంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ టెండర్‌ను ఐఆర్‌బీ కంపెనీ దక్కించుకున్న విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన కనుగుల మహేశ్‌కుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రాథమిక అంచనా రాయితీ విలువ ఎంత అనేది వెల్లడించకుండా హెచ్‌ఎండీఏ, పురపాలక పరిపాలన–పట్టణాభివృద్ధి శాఖ కలసి ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థతో ఒప్పందం చేసుకోవడం అక్రమమని పిటిషన్‌లో పేర్కొన్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ను టోల్– ఆపరేట్– ట్రాన్స్‌ఫర్ (టీవోటీ) విధానంలో నిర్వహించడానికి ప్రభుత్వం మే 28న కుదుర్చుకున్న ఒప్పందం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన అంచనా విలువను వెల్లడించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఒప్పందం వాస్తవ పరిస్థితిని పరిశీలించేలా కాగ్‌కు ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడే ఆదేశాలివ్వలేం..
ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.
ప్రస్తుతం రోజువారీగా టోల్ ఫీజు రూ.88 లక్షల వరకు వసూలవుతోందని, ఈ లెక్కన 30 ఏళ్ల కాలానికి లెక్కిస్తే వేల కోట్ల రూపాయల ప్రజాధనం కంపెనీ పాలవుతుందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్‌లో ప్రజాప్రయోజనం ఏమీ లేదని, దురుద్దేశంతోనే దాఖలు చేశారని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత దశలో ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పిటిషనర్ తరఫు న్యాయవాదికి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment