ఊరూవాడ గోదావరే..! మరో 24 గంటలు హైఅలర్ట్..!
భద్రాద్రి: ఊహించినట్టుగానే భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది తొలిసారిగా మూడో ప్రమాద హెచ్చరికను దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చిన గోదావరి ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేస్తుండగా భద్రాచలం వద్ద రాత్రి నది నీటిమట్టం 53 అడుగులను దాటింది.
దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతోపాటు హైఅలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటలపాటు గోదావరి తీరం వెంబడి ప్రాంత ప్రజలను, సిబ్బందిని జిల్లా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
వేగంగా పెరుగుతున్న వరద
రెండు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ, తగ్గుతూ వచ్చిన గోదావరి శుక్రవారం అతి వేగంగా పెరిగి రెండో, మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకుంది. ఉదయం 6 గంటలకు 46.20 అడుగులుగా ఉన్న గోదావరి 10 గంటలకు 11,44,645 క్యూసెక్కుల నీటి ప్రవాహం దిగువకు వెళ్తుండగా, నీటిమట్టం 48 అడుగులుగా నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
అంతే వేగంగా పెరుగుతూ సాయంత్రం 5 గంటలకు 51.40 అడుగులకు చేరింది. రాత్రి 8.43 గంటలకు 53 అడుగులకు చేరుకోగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 12 గంటలకు 14,54,937 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండగా, నీటిమట్టం 53.60 అడుగులుగా నమోదైంది.
మరో 24 గంటలు హైఅలర్ట్..
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఇంకా వచ్చే అవకాశం ఉండటంతో మరో 24 గంటలు గోదావరి తీర ప్రాంతాల వెంబడి అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సుమారు 2 లక్షల 58 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 9 లక్షల 11 వేలు, మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి 13 లక్షల 17వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఈ నీరు శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం భద్రాచలం చేరుకునే అవకాశం ఉందని, దీంతో 58 అడుగుల నుంచి 60 అడుగుల వరకు వరద చేరుకునే అవకాశం ఉందని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని ముంపు గ్రామాల ప్రజలను ట్రాక్టర్ల ద్వారా పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 30 రెవెన్యూ గ్రామాల నుంచి 3,077 కుటుంబాలకు చెందిన 9,798 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.
గ్రామాలకు రాకపోకలు బంద్
► గోదావరి వరద నీరు ఏజెన్సీలో పలు చోట్ల ప్రధాన రహదారులపైకి రావడంతో గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో తూరుబాక, బుర్రవేముల ప్రధాన రహదారిపై నీరు చేరటంతో భద్రాచలం నుంచి ఆ మండలానికి వెళ్లే పరిస్థితి లేదు.
► బైరాగులపాడు, సున్నంబట్టి గ్రామాల నడుమ, పర్ణశాల గ్రామంలో వెళ్లే చోట్ల వరద నీరు చేరటంతో ఆయా గ్రామాలకు మండల కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
► చర్ల మండలంలో కుదునూరు, దేవరపల్లి గ్రామాల నడుమ, సుబ్బంపేట వద్ద ప్రధాన రహదారుల నడుమ గోదావరి వరద చేరటంతో ఇటు భద్రాచలం నుంచి చర్లకు, అటు చర్ల నుంచి వెంకటాపురం, వాజేడు మండలాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొత్తపల్లి, గండుపల్లి గ్రామాల నడుమ రాకపోకలు నిలిచిపోయాయి.
► బూర్గంపాడు, రెడ్డిపాలెం మధ్య రోడ్డుపైకి నీరు చేరటంతో పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు. బూర్గంపాడు నుంచి కుక్కునూరు రోడ్డుకు, భద్రాచలం నుంచి నెల్లిపాక గ్రామాలకు రవాణా ఆగిపోయింది.
► అశ్వాపురం మండలంలో రామచంద్రాపురం, ఇరవెండి గ్రామాల మధ్య రహదారిపైకి గోదావరి వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లా అధికారులు హెచ్చరించినట్లు 60 అడుగులకు చేరితే ఏజెన్సీలో అనేక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది.