ఆగ్రా రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ చార్జీ రూ.112
ఆగ్రా: రైల్వేస్టేషన్లో టాయ్‌లెట్ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? ఉచితం కాకుంటే గనక ఏ ఐదు రూపాయలో, 10 రూపాయలో. కానీ ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులు మాత్రం ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్సీటీసీ ఎగ్జిక్యూటివ్ లాంజ్‌కు తీసుకెళ్లాడు. బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్ చేశారట.
ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్ సేవల చార్జే తప్ప టాయ్‌లెట్‌కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ. 50 శాతం డిస్కౌంట్ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది.