High Risk Center
-
రిస్క్.. తప్పేనా..?
గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 2014 డిసెంబర్లో హై రిస్క్ కేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత ఇది రెండోది. ఈ కేంద్రానికి ఓ పర్యవేక్షణాధికారితో పాటు ముగ్గురు గైనకాలజిస్టులను నియమించారు. అంతేగాకుండా గర్భిణుల ప్రసూతికి అవసరమయ్యే అధునాతన సౌకర్యాలన్నీ కల్పించారు. శిశువులు జన్మించిన తర్వాత సంరక్షణకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేకమైన పరికరాలను సైతం ఏర్పాటు చేశారు. తొలుత చిన్న పిల్లల వైద్యుడిని ప్రత్యేకంగా నియమించారు. వీటన్నింటితో పాటు ఈ కేంద్రాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలతో పాటు యాదాద్రి, మేడ్చేల్, జనగామ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దారు. ఇక్కడ నెలకు సుమారుగా 200 డెలివరీలు చేస్తున్నారు. కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ హెల్ప్ డెస్క్ సిబ్బందిని కుదించడం వల్ల అనుకున్నంత సమర్థవంతంగా పనిచేయకపోడం ఇబ్బంది మారింది. గతంలో ఇక్కడ చిన్నపిల్లల వైద్యులు ప్రత్యేకంగా కొద్దికాలం పనిచేశారు. కానీ ప్రస్తుతానికి లేకపోవడంతో ఇక్కడ ప్రసవం అయిన బాలింతల చిన్నారులను ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు. ఇదే క్రమంలో సరైన వైద్య మందక తరుచూ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 21న హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి కాళ్లపై ఓ వ్యక్తిపడి ఈ కేంద్రంలో చిన్న పిల్లల వైద్యుడిని వెంటనే ఏర్పాటు చేయాలని... వైద్యం అందక ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారని వేడుకోవడం సమస్య తీవ్రతను చాటింది. కాగా హెల్ప్‌డెస్క్ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల తరుచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. కేంద్రంలో టాయ్లెట్లు, బాత్రూమ్ల నిర్వహణపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని కొందరు గొడవ చేయగా... ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఈ కేంద్రానికి అనుబంధంగా ఎస్ఎన్సీయూ(సిక్ న్యూ బర్న్ బేబీ కేర్ యూనిట్)ఏర్పాటు చేయాలని ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కేంద్రం గనుక వస్తే నలుగురు చిన్నపిల్లల వైద్యులు, 13మంది స్టాఫ్ నర్సులు, మరో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వచ్చే అవకాశమంది. ఫలితంగా మెరుగైన శిశువైద్యం అందనుంది. -
హై రిస్క్ కాదు.. నోరిస్క్!
మెదక్ మున్సిపాలిటీ: గర్భిణులకు ఎటువంటి వైద్య సేవలనైనా క్షణాల్లో అందించేందుకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో దాదాపు రూ.11లక్షలతో ఏర్పాటు చేసిన హైరిస్క్ కేంద్రం వల్ల ఈ ప్రాంత మహిళలకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అత్యవసర సమయాల్లో గర్భిణులను హైదరాబాద్ తదితర ప్రాంతాలకు పంపించకుండా ఇక్కడే వైద్య సేవలందిస్తామని అధికారులు ఊదరగొట్టారు. అయితే ఈ హైరిస్క్ ఆస్పత్రి పనితీరు ప్రకటనలకు మాత్రమే పరిమితమైంది. ఎవరైనా అధికారులు ఈ ఆస్పత్రిని తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు మాత్రం కేంద్రంలో రిస్క్‌చేసి ఆపరేషన్లు చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న వైద్యు లు అత్యవసర సమయాల్లో గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్‌ల్లో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. వీరిని 108లో పంపించాలంటే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుందని గర్భిణులను ప్రైవేట్ ఆంబులెన్స్‌ల్లో తరలిస్తున్నారు. చీటికి మాటికి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇబ్బందులు హైరిస్క్ సెంటర్ ఏర్పాటుతో తప్పుతాయని భావించిన గర్భిణులకు అవస్థలు మాత్రం తప్పడం లేదు. సోమవారం వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ తండాకు చెందిన మాలి అనే గర్భిణి మెదక్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆమెకు రక్తం తక్కువగా ఉందంటూ చికిత్స చేశారు. నెలలు నిండటంతో ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమెను ప్రైవేట్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. హైరిస్క్ కేంద్రంలో ఆపరేషన్ చేయాలని బంధువులు కోరినప్పటికీ రక్తం అందుబాటులో లేదంటూ వైద్యులు ఆమెను హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. అదే విధంగా మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధికి చెందిన పుష్ప అనే గర్భిణిని ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈమెకు షుగర్ లెవల్ అధికంగా ఉండటంతో ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇబ్బందులు తలె త్తుతాయని, అందుకని హైదరాబాద్‌కు రెఫర్ చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. హైరిస్క్ వస్తే గర్భిణులకు అవస్థలు తప్పుతాయని, చీటికి మాటికి హైదరాబాద్ వెళ్లాల్సిన దుస్థితి రాదని భావించామని పలువురు గర్భిణులు వాపోతున్నారు. ఈ మాత్రం దానికే హైరిస్క్ అంటూ లక్షలు ఖర్చుపెట్టి ఆర్భాటం చేయడం దేనికని గర్భిణులు, వారి బంధువులు ప్రశ్నిస్తున్నారు. వసతులు లేవు: సూపరింటెండెంట్ సెంటర్లో అన్ని వసతులు లేక పోవడంతోనే గర్భిణులను హైదరాబాద్‌కు రెఫర్ చేయాల్సి వస్తుందని మెదక్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పీసీ శేఖర్ తెలిపారు. ఆస్పత్రిలో ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు తదితర వసతులు లేని కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. -
మార్చి నెలాఖరుకల్లా మెద క్లో ‘హైరిస్క్ కేంద్రం’
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను నివారించేందుకు మార్చి నెలాఖరు కల్లా మెదక్‌లో ‘హైరిస్క్ కేంద్రం’ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఆమె, కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అరుణ్‌సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీలతో కలిసి మెదక్ ఏరియా ఆస్పత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో మార్చి 31లోగా ఏర్పాటు చేయనున్న హైరిస్క్ కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బందిని నియమించుకోవడంతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు 125 కాన్పులు జరుగుతున్నాయనీ, వీటిని 250కి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని, పరికరాలను సమకూరుస్తామన్నారు. ఆ స్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ప్రారంభించామని త్వరలోనే మరికొన్ని చోట్ల ప్రారంభించి మాతాశిశు మరణాలను తగ్గించేం దుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తెలిపారు. జి ల్లా కలెక్టర్ ఆరోగ్య విషయాలపై చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయిం ట్ కలెక్టర్ మూర్తి, ఆర్డీఓ వనజాదేవి, డీసీహెచ్ వీణాకుమారి, డీఎం,హెచ్ఎం పద్మ, డీపీఎం జగన్నాథ్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, వైద్యులు చంద్రశేఖర్, శివదయాల్, హేమ్రాజ్ పాల్గొన్నారు.