రిస్క్.. తప్పేనా..?
గజ్వేల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 2014 డిసెంబర్‌లో హై రిస్క్ కేంద్రం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో సిద్దిపేట తర్వాత ఇది రెండోది. ఈ కేంద్రానికి ఓ పర్యవేక్షణాధికారితో పాటు ముగ్గురు గైనకాలజిస్టులను నియమించారు. అంతేగాకుండా గర్భిణుల ప్రసూతికి అవసరమయ్యే అధునాతన సౌకర్యాలన్నీ కల్పించారు. శిశువులు జన్మించిన తర్వాత సంరక్షణకు అవసరమైన వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేకమైన పరికరాలను సైతం ఏర్పాటు చేశారు. తొలుత చిన్న పిల్లల వైద్యుడిని ప్రత్యేకంగా నియమించారు. వీటన్నింటితో పాటు ఈ కేంద్రాన్ని గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాలతో పాటు యాదాద్రి, మేడ్చేల్, జనగామ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే గర్భిణులకు ఉపయోగపడేవిధంగా తీర్చిదిద్దారు. ఇక్కడ నెలకు సుమారుగా 200 డెలివరీలు చేస్తున్నారు. కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ హెల్ప్ డెస్క్ సిబ్బందిని కుదించడం వల్ల అనుకున్నంత సమర్థవంతంగా పనిచేయకపోడం ఇబ్బంది మారింది. గతంలో ఇక్కడ చిన్నపిల్లల వైద్యులు ప్రత్యేకంగా కొద్దికాలం పనిచేశారు.
కానీ ప్రస్తుతానికి లేకపోవడంతో ఇక్కడ ప్రసవం అయిన బాలింతల చిన్నారులను ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా పేదలకు ఆర్థికభారం తప్పడం లేదు. ఇదే క్రమంలో సరైన వైద్య మందక తరుచూ శిశు మరణాలు సంభవిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 21న హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి కాళ్లపై ఓ వ్యక్తిపడి ఈ కేంద్రంలో చిన్న పిల్లల వైద్యుడిని వెంటనే ఏర్పాటు చేయాలని... వైద్యం అందక ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారని వేడుకోవడం సమస్య తీవ్రతను చాటింది. కాగా హెల్ప్‌డెస్క్ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల తరుచూ గొడవలు కూడా జరుగుతున్నాయి. కేంద్రంలో టాయ్‌లెట్లు, బాత్రూమ్‌ల నిర్వహణపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇటీవల డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని కొందరు గొడవ చేయగా... ఈ వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. ఈ కేంద్రానికి అనుబంధంగా ఎస్‌ఎన్‌సీయూ(సిక్ న్యూ బర్న్ బేబీ కేర్ యూనిట్)ఏర్పాటు చేయాలని ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కేంద్రం గనుక వస్తే నలుగురు చిన్నపిల్లల వైద్యులు, 13మంది స్టాఫ్ నర్సులు, మరో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు వచ్చే అవకాశమంది. ఫలితంగా మెరుగైన శిశువైద్యం అందనుంది.