Higher official
-
ఆఫ్‌లు ఆఫయ్యాయి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చిన అక్కడి ప్రభుత్వం 2019 నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తోంది. దాన్ని చూసిన ఇక్కడి అధికారులు ఆర్భాటంగా అమలులోకి తీసుకువచ్చారు. కానిస్టేబుళ్లకు పూర్తిస్థాయిలో, ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులకు ‘ప్రత్యేకంగా’ దీన్ని అమలు చేశారు. 2020లో కోవిడ్ ప్రభావంతో అమలైన లాక్డౌన్ నుంచి అదీ ఎత్తేశారు. ప్రస్తుతం పరిస్థితులు సాదారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ఇకనైనా ఉన్నతాధికారులు తమ ఆఫ్‌పై దృష్టి పెట్టాలని ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కోరుతున్నారు. ఆ రెండు స్థాయిలకు అనాలోచితంగా... రాజధానిలోని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ విధులకు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు సిబ్బంది సంఖ్యలో ఉన్న కొరతతో వీక్లీ ఆఫ్ అనేది ఊహించడానికీ సాధ్యమయ్యేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన భారీ రిక్రూట్మెంట్స్ ఫలితంగా సిబ్బంది కొరత కొంత వరకు తీరింది. దీంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఇక్కడా పోలీసులకు వీక్లీఆఫ్‌లు ప్రకటించారు. ఏఎస్సై స్థాయి వరకు సౌలభ్యాన్ని బట్టి వారంలో ఒకరోజు ఆఫ్ ఇస్తున్నారు. అయితే ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి వారికి మాత్రం నైట్‌డ్యూటీ తర్వాతి రోజును ఆఫ్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ అధికారులను నెలలో కనీసం నాలు గు రోజులు ఈ డ్యూటీలు ఉంటాయి. పరిస్థితు లు సజావుగా ఉంటే మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధుల్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్లినా విశ్రాంతి తీసుకోవడం తప్ప వ్యక్తిగత పనులు చూసుకోవడం, కుటుంబంతో గడపటం వంటివి దుర్లభంగా మారాయి. లాక్‌డౌన్‌తో వీక్లీ ఆఫ్ ఎత్తేశారు... కోవిడ్ మొదటి వేవ్ ప్రభావంతో 2020లో దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ అమలైంది. నగరంలో పక్కాగా అమలు చేయడానికి, వసల కార్మికులను తరలించడానికి, ఇక్కడ ఉన్న వారికి ఆహారం అందించడానికి... ఇలా అనేక అంశాల్లో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. దీంతో అన్ని స్థాయిల వారికీ వీక్లీ ఆఫ్ ఎత్తేశారు. లాక్డౌన్ ముగిసి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైల వరకు ఆఫ్ అమలు చేస్తున్నారు. ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల విషయమే ఎవరూ పట్టించకోవట్లేదు. ప్రస్తుతం కనీసం నైట్‌డ్యూటీ తర్వాతి రోజు ఆఫ్ తీసుకోవడానికీ ఆస్కారం లేకుండా పోయింది. పోలీసు విభాగంలో ఇతర ర్యాంకులు ఉన్నప్పటికీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారుల వరకే కేసుల ఒత్తిడి ఉంటుంది. ఆపై స్థాయి అధికారులు అరుదైన కేసుల్లో మినహాయిస్తే మిగిలిన వాటిలో కేవలం పర్యవేక్షణ విధులు నిర్వర్తింస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారిపై అంత పని ఒత్తిడి ఉండదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలని ఎస్సై, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కోరుతున్నారు. (చదవండి: 5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స ) -
నోరు పారేసుకున్న సర్పంచ్
సాక్షి, రంగారెడ్డి: గ్రామాల్లో 30 రోజుల కార్యాచరణ అమలు తీరును తెలుసుకునేందుకు వెళ్లిన అధికారిపై మొయినాబాద్ మండలం కనకమామిడి సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. ప్రణాళికను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసిన ఆ అధికారికి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతోపాటు దుర్భాషలాడారు. కనకమామిడి పంచాయతీ అనుబంధ గ్రామం సజ్జన్‌పల్లిని శనివారం జిల్లా పంచాయతీ విభాగం ఉన్నతాధికారి ఒకరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు ముళ్లపొదలు ఉన్నట్లు గుర్తించారు. గృహనిర్మాణ వ్యర్థాలు, శిథిలావస్థ ఇళ్ల తొలగింపు తప్ప మరే ఇతర పనులను చేపట్టనట్లు కనబడింది. ఈ సమయంలో స్థానికంగా సర్పంచ్ అందుబాటులో లేకపోవడంతో సదరు అధికారి ఫోన్లో ఆయన్ను నిలదీశారు. ‘ఎవరు చెబితే మీరు గ్రామానికి వచ్చారో తెలుసు. నువ్వేం చేస్తున్నావో తెలుసు. మీ సంగతి అంతా గమనించిన’ అని సర్పంచ్ దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. దీనిపై ఘటనా స్థలం నుంచి సదరు అధికారి ఆవేదనతో ఇన్చార్జి కలెక్టర్ హరీష్‌కు వివరించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ.. సదరు సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ అధికారికి సూచించారు. తనిఖీకి వచ్చిన అధికారి పట్ల అమర్యాదగా మాట్లడటంతో ఇన్చార్జి కలెక్టర్ ఆదేశాల మేరకు సర్పంచ్‌కు షాకాజ్ నోటీసులు జారీచేశారు. అలాగే 30 రోజుల ప్రణాళిక అమలులో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన పంచాయతీ సెక్రటరీ రవీందర్‌కు చార్జిమెమో ఇచ్చారు. దీనిపై సర్పంచ్ జనార్దన్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ అడిగేందుకు పలుమార్లు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. -
మళ్లీ వస్తా..మీ కథ చూస్తా!
విద్యా శాఖ మాజీ అధికారి బెదిరింపులు మద్దతివ్వని ఉద్యోగులపై హూంకరింపు రాత్రి సమయాల్లో ఫోన్ చేసి హెచ్చరికలు మరోసారి దుమారం రేపుతున్న రికార్డింగ్ బెంబేలెత్తుతున్న ఉద్యోగులు నేను కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక పత్రికా ప్రకటన ఇవ్వరా? నాకు అనుకూలంగా మాట్లాడరా? నేనే మళ్లీ వస్తా.. మీ కథ చూస్తా! మీకు ఇన్చార్జీలు ఇచ్చా... అయినా కనీసం నేను మంచివాడినని చెప్పరా!! కర్నూలు: విద్యాశాఖలోని పలువురు అధికారులకు మాజీ ఉన్నతాధికారి ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహిళా టీచర్‌ను వేధించారంటూ విధుల నుంచి సస్పెండైన విద్యా శాఖ మాజీ ఉన్నతాధికారి మరో వివాదంలో చిక్కుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అర్ధరాత్రి సమాయల్లో ఫోన్ చేసి మరీ హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను మళ్లీ తిరిగి వస్తానని.. అప్పుడు అందరి సంగతి తేలుస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కాస్తా ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. ఆయన పర్మనెంట్ కాదు.. ప్రస్తుతం ఉన్న అధికారి పర్మనెంటు కాదని సదరు మాజీ ఉన్నతాధికారి ఘంటాపథంగా చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్ఏసీ) నిర్వర్తిస్తున్న ప్రస్తుత అధికారి పర్మనెంట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేయకపోవడం కూడా ఆయన వాదనకు బలం చేకూరుస్తోందని చెబుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఎఫ్ఏసీ బాధ్యతలో ఉన్న అధికారి.. ఎవరు కనిపించినా ఇక్కడ ఈ ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని వాపోతున్నారు. అంతేకాకుండా కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్లేందుకు ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఉన్నతాధికారి కాస్తా మళ్లీ నేనే వస్తానని ప్రచారం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆయన నుంచి ఫోన్లు వస్తున్న అధికాారులు బిక్కుబిక్కుమంటున్నారు. రికార్డు చేసిన ఓ అధికారి? ఈ మొత్తం బెదిరింపుల వ్యవహారంలో మరోసారి ఫోన్ రికార్డింగ్ కీలకం కానుందని సమాచారం. ఇప్పటికే వాయిస్ రికార్డింగ్ బయటపడి కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన వైఖరి మారకపోవడం ఏమిటని పలువురు విసుక్కుంటున్నారు. తాజాగా కొద్దిరోజుల క్రితం వరకూ చేసిన బెదిరింపుల వ్యవహారం అంతా ఒక అధికారి రికార్డింగ్ చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన సదరు మాజీ ఉన్నతాధికారి గత పది రోజుల నుంచి ఫోన్లు చేయడం బంద్ చేసినట్టు తెలిసింది. మొత్తం మీద మరోసారి విద్యాశాఖలో రికార్డింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది.