విద్యా శాఖ మాజీ అధికారి బెదిరింపులు
మద్దతివ్వని ఉద్యోగులపై హూంకరింపు
రాత్రి సమయాల్లో ఫోన్ చేసి హెచ్చరికలు
మరోసారి దుమారం రేపుతున్న రికార్డింగ్
బెంబేలెత్తుతున్న ఉద్యోగులు
నేను కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం ఒక పత్రికా ప్రకటన ఇవ్వరా? నాకు అనుకూలంగా మాట్లాడరా? నేనే మళ్లీ వస్తా.. మీ కథ చూస్తా!
మీకు ఇన్‌చార్జీలు ఇచ్చా... అయినా కనీసం నేను మంచివాడినని చెప్పరా!!
కర్నూలు: విద్యాశాఖలోని పలువురు అధికారులకు మాజీ ఉన్నతాధికారి ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహిళా టీచర్‌ను వేధించారంటూ విధుల నుంచి సస్పెండైన విద్యా శాఖ మాజీ ఉన్నతాధికారి మరో వివాదంలో చిక్కుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా అర్ధరాత్రి సమాయల్లో ఫోన్ చేసి మరీ హెచ్చరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను మళ్లీ తిరిగి వస్తానని.. అప్పుడు అందరి సంగతి తేలుస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కాస్తా ఇప్పుడు విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.
ఆయన పర్మనెంట్ కాదు..
ప్రస్తుతం ఉన్న అధికారి పర్మనెంటు కాదని సదరు మాజీ ఉన్నతాధికారి ఘంటాపథంగా చెబుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) నిర్వర్తిస్తున్న ప్రస్తుత అధికారి పర్మనెంట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేయకపోవడం కూడా ఆయన వాదనకు బలం చేకూరుస్తోందని చెబుతున్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఎఫ్‌ఏసీ బాధ్యతలో ఉన్న అధికారి.. ఎవరు కనిపించినా ఇక్కడ ఈ ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని వాపోతున్నారు. అంతేకాకుండా కృష్ణా జిల్లాకు బదిలీపై వెళ్లేందుకు ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఉన్నతాధికారి కాస్తా మళ్లీ నేనే వస్తానని ప్రచారం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆయన నుంచి ఫోన్లు వస్తున్న అధికాారులు బిక్కుబిక్కుమంటున్నారు.
రికార్డు చేసిన ఓ అధికారి?
ఈ మొత్తం బెదిరింపుల వ్యవహారంలో మరోసారి ఫోన్ రికార్డింగ్ కీలకం కానుందని సమాచారం. ఇప్పటికే వాయిస్ రికార్డింగ్ బయటపడి కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన వైఖరి మారకపోవడం ఏమిటని పలువురు విసుక్కుంటున్నారు. తాజాగా కొద్దిరోజుల క్రితం వరకూ చేసిన బెదిరింపుల వ్యవహారం అంతా ఒక అధికారి రికార్డింగ్ చేసినట్టు సమాచారం. విషయం తెలిసిన సదరు మాజీ ఉన్నతాధికారి గత పది రోజుల నుంచి ఫోన్లు చేయడం బంద్ చేసినట్టు తెలిసింది. మొత్తం మీద మరోసారి విద్యాశాఖలో రికార్డింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది.
మళ్లీ వస్తా..మీ కథ చూస్తా!
Published Thu, Dec 3 2015 6:07 PM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM
Advertisement