సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అనేక పాలనా సంస్కరణలు తీసుకువచ్చిన అక్కడి ప్రభుత్వం 2019 నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తోంది. దాన్ని చూసిన ఇక్కడి అధికారులు ఆర్భాటంగా అమలులోకి తీసుకువచ్చారు. కానిస్టేబుళ్లకు పూర్తిస్థాయిలో, ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు ‘ప్రత్యేకంగా’ దీన్ని అమలు చేశారు. 2020లో కోవిడ్ ప్రభావంతో అమలైన లాక్‌డౌన్ నుంచి అదీ ఎత్తేశారు. ప్రస్తుతం పరిస్థితులు సాదారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ఇకనైనా ఉన్నతాధికారులు తమ ఆఫ్‌పై దృష్టి పెట్టాలని ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు కోరుతున్నారు.
ఆ రెండు స్థాయిలకు అనాలోచితంగా...
- రాజధానిలోని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడి పోలీసులు సర్వకాల సర్వావస్థల్లోనూ విధులకు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. ఒకప్పుడు సిబ్బంది సంఖ్యలో ఉన్న కొరతతో వీక్లీ ఆఫ్ అనేది ఊహించడానికీ సాధ్యమయ్యేది కాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన భారీ రిక్రూట్‌మెంట్స్ ఫలితంగా సిబ్బంది కొరత కొంత వరకు తీరింది. దీంతో ఏపీ ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఇక్కడా పోలీసులకు వీక్లీఆఫ్‌లు ప్రకటించారు.
- ఏఎస్సై స్థాయి వరకు సౌలభ్యాన్ని బట్టి వారంలో ఒకరోజు ఆఫ్ ఇస్తున్నారు. అయితే ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి వారికి మాత్రం నైట్‌డ్యూటీ తర్వాతి రోజును ఆఫ్‌గా తీసుకోవాలని సూచించారు. ఈ అధికారులను నెలలో కనీసం నాలు గు రోజులు ఈ డ్యూటీలు ఉంటాయి. పరిస్థితు లు సజావుగా ఉంటే మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు విధుల్లో ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్లినా విశ్రాంతి తీసుకోవడం తప్ప వ్యక్తిగత పనులు చూసుకోవడం, కుటుంబంతో గడపటం వంటివి దుర్లభంగా మారాయి.
- లాక్‌డౌన్‌తో వీక్లీ ఆఫ్ ఎత్తేశారు...
- కోవిడ్ మొదటి వేవ్ ప్రభావంతో 2020లో దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలైంది. నగరంలో పక్కాగా అమలు చేయడానికి, వసల కార్మికులను తరలించడానికి, ఇక్కడ ఉన్న వారికి ఆహారం అందించడానికి... ఇలా అనేక అంశాల్లో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. దీంతో అన్ని స్థాయిల వారికీ వీక్లీ ఆఫ్ ఎత్తేశారు.
- లాక్‌డౌన్ ముగిసి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైల వరకు ఆఫ్ అమలు చేస్తున్నారు. ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల విషయమే ఎవరూ పట్టించకోవట్లేదు. ప్రస్తుతం కనీసం నైట్‌డ్యూటీ తర్వాతి రోజు ఆఫ్ తీసుకోవడానికీ ఆస్కారం లేకుండా పోయింది.
- పోలీసు విభాగంలో ఇతర ర్యాంకులు ఉన్నప్పటికీ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల వరకే కేసుల ఒత్తిడి ఉంటుంది. ఆపై స్థాయి అధికారులు అరుదైన కేసుల్లో మినహాయిస్తే మిగిలిన వాటిలో కేవలం పర్యవేక్షణ విధులు నిర్వర్తింస్తుంటారు. ఈ నేపథ్యంలోనే వారిపై అంత పని ఒత్తిడి ఉండదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు వీక్లీ ఆఫ్ అమలు చేయాలని ఎస్సై, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు కోరుతున్నారు.
(చదవండి: 5 నెలల చిన్నారికి నిమ్స్‌లో అరుదైన చికిత్స )
Comments
Please login to add a commentAdd a comment