Hill collided
-
కాళ్ల కింద నేల కదులుతోంది
చిన్న వర్షం వస్తుంది, అంతలోనే ఎగువ నుంచి మన్ను ఉప్పెనలా ముంచుకొస్తుంది. అడ్డొచ్చిన ఇళ్లు, మనుషులను కబళిస్తుంది. ఒక్కోసారి వర్షం రాకుండానే ఈ ఉపద్రవాలు జరుగుతుంటాయి. మన్ను,బండరాళ్లు జారిపడి తరచూ కట్టడాలు, రహదారులు ధ్వంసం కావడం కొడగు, మల్నాడు జిల్లాల్లో మామూలు విషయంగా మారింది. వర్షాలు జోరందుకోవడంతో మళ్లీ మట్టి చరియల విపత్తు పొంచి ఉంది. హుబ్లీ: కాళ్ల కింది భూమి కదిలిపోతోంది. చిన్న వర్షం వచ్చినా, రాకపోయినా నేల కుదించుకుపోతూ ప్రాణ ఆస్తి నష్టాలకు గురిచేస్తోంది. దశాబ్దకాలంగా నైరుత్య కర్ణాటకలోని మల్నాడు జిల్లాల్లో మట్టి చరియలు జారిపడడం, ఇళ్లు, మనుషులను ముంచేస్తుండడం, ప్రత్యేకించి వర్షాకాలం వస్తుండగానే ఈ పెనుముప్పు ఆరంభమవుతోంది. దీంతో కొడగు, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, చిక్కమగళూరు, హాసన్ జిల్లాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఎత్తైన కొండలు, మట్టి దిబ్బల దిగువన వందలాది ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలకు మట్టి చరియలు జారిపడే బెడద క్షణక్షణం వెంటాడుతోంది. భూ ప్రకంపనలు సైతం ఓ మోస్తరు వర్షం తాకిడికి మట్టి పొరలు వదులై కింది ప్రాంతం వైపు జారుతూ అది పెద్ద విపత్తు అవుతున్నాయి. 2009లో వర్షాకాలంలో ఉత్తర కన్నడ జిల్లాలో ఒకేరోజు 20 చోట్ల మట్టిచరియలు కూలినట్లు నమోదైంది. 19 మంది వరకూ సజీవ సమాధి అయ్యారు. పులి మీద పుట్రలా కొడగు తదితర ప్రాంతాల్లో తరచూ భూ ప్రకంపనలు మట్టి చరియలు కూలడానికి మరింత కారణమవుతున్నాయి. మానవుల చర్యలూ కారణమే పశ్చిమ కనుమల్లో భాగమైన కొడగు, చిక్కమగళూరు తదితర జిల్లాల్లో మట్టితో కూడిన పెద్ద పెద్ద పర్వత ప్రాంతాలు, ఎత్తైన ప్రదేశాలు ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టుగా ఉంటున్నాయి. అపురూపమైన వన్యప్రాణి సంపద కూడా ఈ ప్రాంతాల సొత్తు. ఫలితంగా ఏటా లక్షలాది మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి వస్తుంటారు. ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందేకొద్దీ కొత్త కొత్త ప్రాంతాలకు నిర్మాణాలు విస్తరించాయి. అడవులను, పల్లపుప్రాంతాలను చదును చేసి రిసార్టులు, భవనాలు తదితరాలను నిర్మిస్తూ వచ్చారు. ఒకప్పుడు అడవులు, పొదలతో కూడిన ప్రాంతాలు ఇప్పుడు జనావాసాలుగా మారాయి. దీంతో ఇలాంటి ప్రాంతాల్లో మట్టి చరియలు కూలినప్పుడల్లా అది ప్రాణ ఆస్తి నష్టానికి దారితీస్తూ సంచలనాత్మకమవుతోంది. ఇక్కడ ఎక్కువగా కుండపోత వర్షాలు కురవడం, మట్టితో కూడిన పర్వతాలు, బలహీనమైన నేల స్వభావం, మానవుల చర్యలు వంటివి కూడా దోహదం చేస్తున్నాయి. నిపుణుల అధ్యయనాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అటవీ, పర్యావరణ ఉన్నతాధికారులతో పాటు ఇస్రో, ఐఐఎస్సీకి చెందిన నిపుణులు ఉన్నారు. కొడగు తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎందుకు చరియలు కూలుతున్నాయో క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరించారు. ఇటీవలే ఈ సమితి సీఎం యడియూరప్పకు నివేదికను అందజేసినప్పటికీ మళ్లీ వర్షాకాలం రావడం, కరోనా లాక్డౌన్ వల్ల అమలు అనేది ఆలస్యమవుతోంది. తరచూ ప్రమాదాలు రాష్ట్ర అటవీ– పర్యావరణ, జీవ వైవిధ్య మండలి ఈ సమస్యపై అధ్యయనం చేసినప్పటికీ, కారణాలను, పరిష్కారాలను కనుగొనడం దుర్లభంగా మారింది. ఐదురోజుల కిందట మంగళూరు వద్ద మట్టి చరియలు విరిగిపడి నాలుగు ఇళ్లు ధ్వంసం కాగా, ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. రెండేళ్ల కిందట కొడగు జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తినప్పుడు పదుల సంఖ్యలో మట్టిచరియలు కూలిన దుర్ఘటనలు జరిగాయి. ఒక సంఘటనలో ఏడుగురికిపైగా మృత్యువాత పడగా, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద భవనాలు సైతం మట్టి చరియల తాకిడికి తలకిందులయ్యాయి. -
ప్రమాదం అంచున నివాసం
విజయవాడ: నగరంలో కొండ ప్రాంత వాసులు క్షణంక్షణం భయంతో వణుకుతున్నారు. వర్షాలు కురిస్తే కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడే 24 ప్రాంతాలను డేంజర్ జోన్‌గా గతంలోనే ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో తుపాను కారణంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ నగరంలో కొండప్రాంత వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షానికి నాని కొండ చరియలు విరిగి ఇళ్లమీద పడతాయోనని భయాందోళనతో కొండలపై ఇళ్లల్లో నివసిస్తున్న పేదలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. నగరంలో కొండ ప్రాంతంలో 50 వేల ఇళ్లలో సుమారు లక్షన్నర జనాభా ప్రమాదపు అంచున జీవిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో వర్షానికి నాని కొండరాళ్లు, మట్టిపెళ్లలు ఇళ్లపై పడుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఆస్తి నష్టం మాట ఎలా ఉన్నా కొండరాళ్లు, మట్టి పెళ్లలు విరిగిపడితే తమ గతేంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలు నగరంలో నిలువ నీడలేక కొండలపై ఇళ్లు నిర్మించుకుని ప్రమాదం అని తెలిసినా జీవనం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ఉండగా, మరి కొన్ని ప్రాంతాల్లో కాలిబాట రోడ్లు నిర్మించుకున్నారు. చినుకు పడిందంటే దారీతెన్నూ లేని ఆయా ప్రాంతాల నుంచి జనం పడుతూ లేస్తూ కిందికి వచ్చి వెళుతున్నారు. నిరుపేదలైన తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి పోతామని కొండప్రాంతలోని కుటుంబాల వారు చెబుతున్నారు. నగరంలోని కొండ ప్రాంతాలు ఇవే.. ఒన్‌టౌన్ ఏరియాలో చిట్టినగర్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్, సితార, భవానీపురం, మిల్క్‌ప్రాజెక్టు, మల్లికార్జునపేట, కొత్తపేట, వాగుసెంటర్, చిట్టీనగర్, లంబాడీపేట, కబేళా, గొల్లపాలెంగట్టు ఉన్నాయి. టూటౌన్ ఏరియాలో మొగల్రాజపురం, మాచవరం, క్రీస్తురాజపురం, గుణదల, గంగిరెద్దుల దిబ్బ, పడవలరేవు క్వారీ, చుట్టగుంట, బ్రహ్మానందరెడ్డి నగర్, బందెలదొడ్డి, కార్మిక నగర్, బెత్లహేంనగర్ తదితర ప్రాంతాల్లో కొండగట్టుపై ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్నారు. అత్యంత ప్రమాదకర ప్రాంతాలు సొరంగం, గొల్లపాలెం గట్టు, లంబాడీపేట ప్రాంతాల్లో తరుచు మట్టిపెళ్లలు, కొండరాళ్లు విరిగి పడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే విధగా చుట్టగుంట, గుణదల గంగిరెద్దుల దిబ్బ, క్రీస్తురాజుపురం, మాచవరం ఏరియాల్లో కూడా తరచూ కొండగట్టు విరగి పడుతు ఇళ్లు ధ్వంసం అవుతున్న ఘటనలు ఉన్నాయి. – రెండు నెలల క్రితం గుణదల గంగిరెద్దుల దిబ్బపై కొండచరియలు విరిగిపడి నాలుగిళ్లు పూర్తిగా దెబ్బతిని నేల మట్టమయ్యాయి. మరో రెండిళ్లు, చర్చి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. – వారం రోజుల క్రితం సొరంగం ప్రాంతంలో కొండరాళ్లు జారి రోడ్లపై పడ్డాయి. ప్రజలు భయాందోళన చెందారు. ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతంలో కొండరాళ్లు తరుచూ జారి పడుతూనే ఉంటాయి. పరిష్కారం చూపాలి ప్రతి ఏటా వర్షా కాలంలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో పేదలు తమ ఇళ్లను కోల్పోతున్నారు. మరికొందరి ఇళ్లు పాక్షికంగా దెబ్బ తింటున్నాయి. వీరికి పునరావాసం కల్పించేందుకు ఏ అధికారి ఇక్కడకు రారు. ఈ పరిస్థితి మారాలి. అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.– టి.ఫ్రాన్సిస్, మాల మహానాడు అధ్యక్షుడు, గంగిరెద్దుల దిబ్బ -
కొండను ఢీకొన్న విమానం
* 54 మంది మృతి * ఇండోనేసియాలో దుర్ఘటన * శకలాలు లభ్యం జకార్తా: ఇండోనేసియా వైమానిక చరిత్రలో మరో దుర్ఘటన! తూర్పు ఇండోనేసియాలోని పపువా ప్రాంత రాజధాని జయపుర నుంచి 49 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో ఆదివారం ఓకిస్‌బిల్ నగరానికి బయలుదేరిన ట్రిగనా ఎయిర్‌లైన్స్ విమానం గమ్యానికి కొద్దిదూరంలోనే కొండను ఢీకొట్టి కూలిపోయింది. విమానంలోని మొత్తం 54 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాదం జరిగిందని, విమాన శకలాలను ఓక్‌బపే జిల్లాలోని ఓ గ్రామస్తులు కనుగొన్నారని అధికారులు వెల్లడించారు. 45 నిమిషాల్లో గమ్యానికి చేరుకోవాల్సిన విమానం ప్రతికూల వాతావరణంలో చిక్కుకొని చివరి 9 నిమిషాల ప్రయాణ సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. విమానాన్ని ల్యాండ్ చేసేందుకు వీలుగా ఎత్తు తగ్గించుకునేందుకు అనుమతివ్వాలంటూ పైలట్ నుంచి చివరిసారిగా ఏటీసీకి విజ్ఞప్తి అందింది. విమానం ఓ కొండను ఢీకొని కుప్పకూలినట్లు బింటాంగ్ జిల్లాలోని ఓక్‌బపే గ్రామస్తులు చెప్పారు. ప్రమాదానికి ముందు విమానం చాలా తక్కువ ఎత్తులో ఎగిరిందన్నారు. దీంతో సహాయ సిబ్బంది గాలింపునకు బయలుదేరారు. అడవి, కొండలు, ప్రతికూల వాతావరణం కారణంగా గాలింపును మధ్యలోనే నిలిపేసి సోమవారం తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. శకలాల గుర్తింపునకు మరో విమానాన్ని ఆ ప్రాంతానికి పంపినప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా అదీ వెనక్కి వచ్చేసింది. దుర్ఘటనకు ముందు పైలట్ నుంచి ఎటువంటి ప్రమాద సంకేతాలు అందలేదని ప్రభుత్వం తెలిపింది. ఓకిస్‌బిల్ అడవి మీదుగా విమానం ప్రయాణించే సమయానికిభారీ వర్షం, బలమైన గాలులు, దట్టమైన పొగమంచు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఇప్పటిదాకా ట్రిగనా ఎయిర్‌కు చెందిన 14 విమానాలు తీవ్ర ప్రమాదాలకు గురయ్యాయి. సరైన భద్రతా ప్రమాణాలను పాటించడంలేదన్న కారణంతో యూరోపియన్ యూనియన్ తమ గగనతలంలో ఈ విమాన సర్వీసుల రాకపోకలపై నిషేధం విధించింది. కాగా, ఆదివారం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ సమీపంలోనూ నమీబియాకు చెందిన ఓ చిన్న వైద్య విమానం కూలిపోయి ఐదుగురు మరణించారు. ఓ రోగి, అతడి కూతురును వైద్య సిబ్బంది తరలిస్తుండగా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ దుర్ఘటన జరిగింది.