
కొండప్రాంతంలోని నివాసాలు ,కొండ చరియలు విరిగిపడటంతో దెబ్బతిన్న చర్చి
విజయవాడ: నగరంలో కొండ ప్రాంత వాసులు క్షణంక్షణం భయంతో వణుకుతున్నారు. వర్షాలు కురిస్తే కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడే 24 ప్రాంతాలను డేంజర్ జోన్‌గా గతంలోనే ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో తుపాను కారణంగా కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడ నగరంలో కొండప్రాంత వాసులు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వర్షానికి నాని కొండ చరియలు విరిగి ఇళ్లమీద పడతాయోనని భయాందోళనతో కొండలపై ఇళ్లల్లో నివసిస్తున్న పేదలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.
నగరంలో కొండ ప్రాంతంలో 50 వేల ఇళ్లలో సుమారు లక్షన్నర జనాభా ప్రమాదపు అంచున జీవిస్తున్నారు. కొండ ప్రాంతాల్లో వర్షానికి నాని కొండరాళ్లు, మట్టిపెళ్లలు ఇళ్లపై పడుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. ఆస్తి నష్టం మాట ఎలా ఉన్నా కొండరాళ్లు, మట్టి పెళ్లలు విరిగిపడితే తమ గతేంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిరుపేదలు నగరంలో నిలువ నీడలేక కొండలపై ఇళ్లు నిర్మించుకుని ప్రమాదం అని తెలిసినా జీవనం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ఉండగా, మరి కొన్ని ప్రాంతాల్లో కాలిబాట రోడ్లు నిర్మించుకున్నారు. చినుకు పడిందంటే దారీతెన్నూ లేని ఆయా ప్రాంతాల నుంచి జనం పడుతూ లేస్తూ కిందికి వచ్చి వెళుతున్నారు. నిరుపేదలైన తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే వేరే ప్రాంతాలకు వెళ్లి పోతామని కొండప్రాంతలోని కుటుంబాల వారు చెబుతున్నారు.
నగరంలోని కొండ ప్రాంతాలు ఇవే..
ఒన్‌టౌన్ ఏరియాలో చిట్టినగర్, విద్యాధరపురం, కుమ్మరిపాలెం సెంటర్, సితార, భవానీపురం, మిల్క్‌ప్రాజెక్టు, మల్లికార్జునపేట, కొత్తపేట, వాగుసెంటర్, చిట్టీనగర్, లంబాడీపేట, కబేళా, గొల్లపాలెంగట్టు ఉన్నాయి. టూటౌన్ ఏరియాలో మొగల్రాజపురం, మాచవరం, క్రీస్తురాజపురం, గుణదల, గంగిరెద్దుల దిబ్బ, పడవలరేవు క్వారీ, చుట్టగుంట, బ్రహ్మానందరెడ్డి నగర్, బందెలదొడ్డి, కార్మిక నగర్, బెత్లహేంనగర్ తదితర ప్రాంతాల్లో కొండగట్టుపై ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్నారు.
అత్యంత ప్రమాదకర ప్రాంతాలు
సొరంగం, గొల్లపాలెం గట్టు, లంబాడీపేట ప్రాంతాల్లో తరుచు మట్టిపెళ్లలు, కొండరాళ్లు విరిగి పడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే విధగా చుట్టగుంట, గుణదల గంగిరెద్దుల దిబ్బ, క్రీస్తురాజుపురం, మాచవరం ఏరియాల్లో కూడా తరచూ కొండగట్టు విరగి పడుతు ఇళ్లు ధ్వంసం అవుతున్న ఘటనలు ఉన్నాయి.
– రెండు నెలల క్రితం గుణదల గంగిరెద్దుల దిబ్బపై కొండచరియలు విరిగిపడి నాలుగిళ్లు పూర్తిగా దెబ్బతిని నేల మట్టమయ్యాయి. మరో రెండిళ్లు, చర్చి పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు.
– వారం రోజుల క్రితం సొరంగం ప్రాంతంలో కొండరాళ్లు జారి రోడ్లపై పడ్డాయి. ప్రజలు భయాందోళన చెందారు. ప్రతి వర్షాకాలంలో ఈ ప్రాంతంలో కొండరాళ్లు తరుచూ జారి పడుతూనే ఉంటాయి.
పరిష్కారం చూపాలి
ప్రతి ఏటా వర్షా కాలంలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో పేదలు తమ ఇళ్లను కోల్పోతున్నారు. మరికొందరి ఇళ్లు పాక్షికంగా దెబ్బ తింటున్నాయి. వీరికి పునరావాసం కల్పించేందుకు ఏ అధికారి ఇక్కడకు రారు. ఈ పరిస్థితి మారాలి. అధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలి.– టి.ఫ్రాన్సిస్, మాల మహానాడు అధ్యక్షుడు, గంగిరెద్దుల దిబ్బ
Comments
Please login to add a commentAdd a comment