గురుపౌర్ణమి నాటికి 120 గ్రామాలకు తాగునీరు
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్
పుట్టపర్తి అర్బన్,న్యూస్‌లైన్: సత్యసాయి తాగునీటి పథకం ద్వారా వచ్చే గురుపౌర్ణమి నాటికి పుట్టపర్తి నియోజకవర్గంలోని 120 గ్రామాలకు పూర్తి స్థాయిలో తాగునీరు అందించనున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు.
గురువారం సత్యసాయి ఆరాధనోత్సవాలను పురస్కరించుకొని హిల్‌వ్యూ స్టేడియంలో నారాయణసేవను ప్రారంభించడానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు సత్యసాయి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలనం చేసి నారాయణ సేవను ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ ఈ ఆరాధనోత్సవాల సందర్భంగా 50 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామన్నారు. జూలై 12న జరిగే గురుపౌర్ణమి నాటికి కొత్తచెరువు, బుక్కపట్నం, పుట్టపర్తి మండలాల్లోని 120 గ్రామాలకు తాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమం అనంతరం సత్యసాయి చిత్రపటానికి మహా మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్లు చక్రవర్తి, ఆర్జే రత్నాకర్, శ్రీనివాసన్, నాగానంద, కార్యదర్శి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.