ఐపీఎస్ ఫోన్‌నే ట్యాప్ చేస్తారా?
► ఇదేమి పరిపాలన
► బాధ్యులపై చర్యలు తీసుకోరెందుకు?
► విధానసభలో బీజేపీ పక్షనేత శెట్టర్
► ఐజీపీ చరణ్‌రెడ్డి ఫోన్‌ను డీసీపీ హిలోరియా ట్యాప్ చేయడంపై ఆగ్రహం
సాక్షి, బెంగళూరు: ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బుధవారం విధానసభలో ప్రతిధ్వనించింది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ – పార్టీ, ప్రధాన విపక్షమైన బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీరో అవర్‌లో బీజేపీ పక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఐజీపీ అయిన చరణ్‌రెడ్డి ఫోన్‌కాల్‌ను డీసీపీ అజయ్ హిలోరియా అక్రమంగా ట్యాప్ చేసి ఆ వివరాలను బహిరంగ పరడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. దీని వల్ల రాష్ట్రంలో పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకూ బాధ్యులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై సర్కారుకు పట్టు లేకపోతే
నిజాయితీగల అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరన్నారు. ‘అసలు ఫోన్ ట్యాపింగ్‌కు అనుమితి ఇచ్చింది ఎవరు? ఒక వేళ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదా? ఆ యంత్ర పరికరాలు ఎలా సమకూర్చుకున్నారు.?’ అన్న విషయాల పై ప్రభుత్వం వెంటనే బహిరంగంగా సమాధానం చెప్పాలన్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఫోన్లను ట్యాప్ చేయడం చూశాంకాని ఐపీఎస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే స్పీకర్ కోళివాడ సర్దిచెప్పారు. మంత్రి ఎం.బీ పాటిల్ మాట్లాడుతూ పాలనా వ్యవస్థ పై ప్రభుత్వానికి పట్టు లేదనడం సరికాదన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయమై శాసనసభకు ప్రభుత్వం తరఫున స్పష్టతనిస్తామని తెలిపారు.
ఇదీ ట్యాపింగ్ కథ
గత ఏడాది సెప్టెంబర్‌లో కావేరి నదీ జలాల వివాద సమయంలో ఆందోళనకారులు బెంగళూరులో విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ సమయంలో అదనపు పోలీస్ కమిషనర్‌గా ఉన్న చరణ్‌రెడ్డి పశ్చిమ విభాగ డీసీపీ అజయ్ హిలోరితో నగరంలో పరిస్థితులు శృతి మించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోన్లో చర్చించారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచాలని కూడా చర్చించారు. విధ్వంసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో బ్యాటరాయనపుర పోలీసులు అరెస్ట్ చేసిన కన్నడ సంఘానికి చెందిన కార్యకర్త ప్రకాశ్‌ను విడుదల చేయాలంటూ చరణ్‌రెడ్డి డీసీపీ అజయ్‌హిలోరికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణను డీసీపీ అజయ్ హిలోరీ ఓ విలేఖరికి అందించారంటూ అదనపు కమిషనర్ చరణ్‌రెడ్డి అప్పటి డీజీపీ ఓం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులకే ఓంప్రకాశ్ రిటైర్ కావడంతో తదుపరి డీజీపీ ఆర్కె దత్తా... చరణ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్‌ను ఆదేశించారు.