himayathnagar
-
ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం.. ఇదేం పాడు పని
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్) : వృత్తిపరంగా నిజామాబాద్‌లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. హైదరాబాద్‌లో మాత్రం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇలా తప్పులు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగిడిని ఎట్టకేలకు నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు పంపినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా రామ్‌గర్ గ్రామంలోని పీహెచ్సీ సెంటర్లో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనూప్ దేవదాసన్.. నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నాడు. 2018లో హిమాయత్‌నగర్ ఎస్బీఐ టచ్ బ్యాంక్‌లో ఇన్నోవా కారు కోసం లోన్ తీసుకున్నాడు. దీని ఖరీదు రూ.19 లక్షలు. బ్యాంక్ వాళ్లకు పత్రాల్లో అనూప్దేవదాసన్ అడ్రస్‌లో హిమపురి కాలనీ, మన్సురాబాద్, ఎల్బీనగర్ ఉంది. మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లించాడు. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశాడు. ఈ విషయంపై పలుమార్లు బ్యాంక్ అధికారులు పత్రాల్లో ఇచ్చిన అడ్రాస్ ఇంటికి వెళ్లగా అనూప్దేవదాసన్ అనే వ్యక్తి ఇక్కడ ఎవరూ లేరని అక్కడి వారు చెప్పారు. ఫోన్ నంబర్లు మార్చి, అడ్రస్‌లు వేర్వేరు చెబుతూ బ్యాంక్ అధికారులను తిప్పలు పెట్టడం సాగాడు. దీంతో 2019 ఆగస్టు 8న బ్యాంక్ అధికారులు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. నగరంలోని నల్లకుంటలో నివాసం ఉంటున్నట్లు సమాచారం రావడంతో గురువారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. మూడు చెక్‌బౌన్స్ కేసుల్లో నిందితుడు అనూప్ దేవదాసన్ చెక్ బౌన్స్ కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నాడు. పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకుని వారికి చెక్‌లు ఇచ్చాడు. చెక్‌బుక్‌లు పోయాయని కొత్త చెక్‌బుక్‌ల కోసం అప్లై చేస్తుండేవాడు. ఇలా డబ్బులు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడంతో వారు కోర్టులను ఆశ్రయించగా మూడు చెక్‌బౌన్స్ కేసుల్లోనూ అతడు నిందితుడిగా ఉన్నాడు. ( చదవండి: పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా.. ) -
గిప్ట్ వచ్చిందని ఫోన్.. ఫ్లాట్ చూపించి మోసం
హిమాయత్‌నగర్: ప్లాట్లు ఇప్పిస్తామంటూ మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సోమవారం రాత్రి హియాయత్ నగర్‌లోని ‘గ్లోబల్ టార్జ్ ప్రైడ్’ సంస్థ కార్యాలయంలో 100 మందికి పైగా బాధితులు ఆందోళన చేపట్టారు. దీనిపై సమాచారం అందడంతో నారాయణ గూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూతురి పెళ్లి ఆగిపోయింది లక్కీ డ్రా ద్వారా బహుమతి వచ్చిందంటే నమ్మి వెళ్లాం. నగర శివారు ప్రాంతాల్లో ప్లాట్లు తక్కువ ధరకే ఇస్తామంటే ఆశపడి లక్షల్లో డబ్బులు చెల్లించాం, ఈరోజు, రేపు అంటూ మోసం చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. డబ్బులు లేక నా కూతురి పెళ్లి ఆగిపోయింది. –భాగ్యలక్ష్మి, సికింద్రాబాద్ రూ.3 లక్షలు కట్టాను తక్కువ ధరకే ప్లాట్ ఇస్తామంటే ఆశ పడ్డాను, అప్పుచేసి రూ.3 లక్షలు కట్టాను. ఇప్పుడు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేదు. అప్పుల వాళ్ళు ఇంటిమీదకొస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. –సరిత, సంతోష్‌నగర్. గిప్ట్ వచ్చిందని ముంచారు.. గిప్ట్ వచ్చిందంటూ ఫోన్ రావడంతో అబిడ్స్ వెళ్లాం. నగర శివార్లలో మంచి ఫ్లాట్ చూపించి రూ.2 లక్షలు కట్టమంటే కట్టాం, ఏడాదిన్నర అవుతున్నా ప్లాటు లేదు , డబ్బు ఇ్వమంటే స్పందన లేదు, నా కూతురుకు మొహం చూపలేకపోతున్నా. నాకు న్యాయం చేయాలి. –రాజేశ్వరి, ఉప్పల్ -
వెంకన్నకే శఠగోపం
హిమాయత్‌నగర్: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుసంధానంగా ఉన్న కల్యాణ మండపాలు వ్యాపార సముదాయాలకు కేరాఫ్‌గా మారాయి. ధనాపేక్షతో టీటీడీ అధికారులు సాక్షాత్తు వెంకన్నకే శఠగోపం పెడుతున్నారు. వారికి లీజుకు ఇచ్చిన మండపాల్లో పెళ్లిళ్లు నిర్వహించకుండా ప్రైవేటు వ్యాపారాలకు అద్దెకు ఇస్తున్నారు. టీటీడీకి కట్టాల్సిన బకాయిలు సైతం చెల్లించకపోవడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం ఆగ్రహానికి గురైంది. హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని టీటీడీ కల్యాణ మండపం లీజు గడువు ముగిసినా లీజుదారులు దానిని ఖాళీ చేయకుండా పాత కోర్టు ఆర్డర్‌ను చూపిస్తూ అధికారులను ఇబ్బంది పెడుతున్నాడు. గత ఆరు నెలలుగా టీటీడీకి ఒక్క రూపాయి చెల్లించకపోగా నిబంధనలకు విరుద్ధంగా కల్యాణ మండపాన్ని నిర్వహిస్తున్నందుకు గాను దానిని సీజ్ చేశారు. దాదాపు రూ.కోటి బకాయిలు ప్రస్తుతం టీటీడీలోని కళ్యాణమండపం ఎస్.వైష్ణవి పేరుతో కొనసాగుతోంది. 2016 అక్టోబర్న లీజుకు తీసుకున్నారు. 2018 అక్టోబర్‌తో లీజు గడువు ముగిసినా ఖాళీ చేయడం లేదు. దీంతో తిరుపతి నుంచి వచ్చిన అధికారులు మండపాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే రోజు లైసెన్సుదారుడు కోర్టుకు వెళ్లి ఎక్స్టెన్షన్ కోరుతూ స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. అయితే ఇప్పటి వరకు లీజును పొడిగిస్తున్నట్లు కానీ..లీజు ముగిసిన నాటి నుంచి నేటి వరకు టీటీడీకి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో దాదాపు రూ.కోటి వరకు బకాయిపడినట్లు టీటీడి విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. వ్యాపార సంస్థలకే ప్రాధాన్యం:పెళ్లిళ్ల కోసం మాత్రమే టీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తోంది. అయితే కల్యాణమండపాన్ని లీజుకు ఇచ్చే సమయంలోనే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయితే హిమాయత్‌నగర్ టీటీడీలో మాత్రం కథ భిన్నంగా ఉంది. లీజు దారుడు పెళ్లిళ్లకు మండపాన్ని ఇవ్వకుండా వ్యాపార సంస్థలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటుకు కేటాయిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. లీజు దారుడి వ్యవహరశైలిపై టీటీడీ ఉద్యోగులు విజిలెన్స్ అధికారులకు సమచారం అందించడంతో ఈ నెల 22న విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసినందున మండపాన్ని స్వాధీనం చేసుకుంటున్నామంటూ మండపాన్ని సీజ్ చేశారు. ఈ విషయంపై తిరుమల విజిలెన్స్ ఎస్టేట్ ఆఫీసర్‌ను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా..‘ఇటువంటి విషయాలు బయట పెట్టకూడదని, నిదానంగా అన్నీ సర్దుకుంటాయని బదులిచ్చారు’. -
మేమూ మనుషులమే...
హిమాయత్‌నగర్: ‘మేమూ మనుషులమే. మాకు అందరిలా స్వేచ్ఛగా సమాజంలో తిరిగే హక్కుంది. బస్, ఆటో, బస్టాండ్.. ఇలా ఎక్కడైనా మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. జంతువుల్లా భావిస్తూ మమ్మల్ని చూస్తేనే అందరూ పరార్ అవుతున్నార’ హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తూ గుండెలు పగిలేలా చేయొద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. హైదరగూడలోని సెంట్రల్ పార్క్ హోటల్లో ‘ఇండియా హెచ్ఐవీ ఎయిడ్స్ అలియాన్స్’ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ‘హ్యాండ్సప్ ఫర్ హెచ్ఐవీ ప్రివెన్షన్’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు నగరవ్యాప్తంగా ఉన్న హిజ్రాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తొలుత జరిగిన కార్యక్రమంలో వీరంతా మోడల్స్ తరహాలో క్యాట్‌వాక్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అనంతరం హిజ్రాల ప్రతినిధి, సోషలిస్టు చంద్రముఖి.. ఐహెచ్ఏ క్లినిక్ మేనేజర్ కె.బాలకృష్ణ, దర్శన్ ఫౌండేషన్ చైర్మన్ కుమార్‌లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హెచ్ఐవీ ఎయిడ్స్ బిల్లును రాజ్యసభలో ఆమోదించినప్పటికీ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. హిజ్రాలను కూడా సాధారణ మనుషుల్లాగే గుర్తించి ప్రభుత్వం నుంచి వారికి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందించాలని జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ 2014లో ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. అవి ఎక్కడా అమలు కావడం లేదన్నారు. జంతువుల్లా చూస్తున్నారు... అందరిలా మేము ఆటోల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఆటో ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగానే ఏదో జంతువు వచ్చిందనే విధంగా మమ్మల్ని చూసి పారిపోతున్నారు. దీంతో మేం మానసికంగా ఎంతో కుంగిపోతున్నాం. – అంజలి మేమూ సాధించగలం.. అందరూ అబ్బాయిలు, అమ్మాయిల్లా మేమూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధించగలం. మేమూ గొప్ప గొప్ప చదువులు చదివాం... కానీ సమాజాన్ని చదవలేకపోతున్నాం. మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. – మధుశ్రీ -
ఫ్యాషన్ తళుకులు
హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్డీ)లో ముంబైకి చెందిన డిజైనర్ శనివారం నూతన కలెక్షన్స్ ను ప్రవేశపెట్టారు. వీటిని ఐఎన్ఐఎఫ్డీ విద్యార్థులు ప్రదర్శించారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు. – హిమాయత్‌నగర్ -
మార్కెట్లోకి హ్యుందాయ్ గ్లోబల్ ఎస్యూవీ
హిమాయత్‌నగర్: హ్యుందాయ్ కొత్తగా ప్రవేశపెట్టిన గ్లోబల్–ఎస్యూవీ కారును సంస్థ సౌత్ రీజనల్ సేల్స్ మేనేజర్ ఎంఏ సలీమ్ అమీన్ గురువారం హిమాయత్‌నగర్‌లోని లక్ష్మీ హ్యుందాయ్ షోరూమ్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. సరికొత్త టుక్సాన్ డైనమిక్ లైనప్‌తో దీనిని ప్రవేశపెడుతున్నామన్నారు. అత్యాధునిక సాంకేతికత, ఉన్నత ప్రమాణాలతో నేటి తరం అభిరుచులకు అనుగుణంగా దీనిని రూపొందించామని సీఈఓ భాస్కరరాజు చెప్పారు. పెట్రోల్, డీజిల్ మోడల్స్‌లో ఈ కారు లభ్యమవుతుందన్నారు. -
లాక్మే పెళ్లి సింగారం
సాక్షి, సిటీబ్యూరో: పెళ్లి వేళ సిగ్గుల సింగారాలను రంగరించుకునే నవ వధువును అద్భుతమైన అలంకరణతో అందంగా తీర్చిదిద్దడమనేది ఓ కళ అన్నారు ప్రసిద్ధ బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ సుష్మాఖాన్. హిమాయత్‌నగర్‌లోని లాక్మె సెలూన్లో ‘బ్రైడల్ ఇల్యూమినేట్ లుక్స్’ పేరుతో మంగళవారం ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌నకు ఆమె హాజరయ్యారు. నవవధువు అలంకరణతో మోడల్స్ మెరిశారు. వర్క్‌షాప్ ఐదు రోజులు కొనసాగుతుంది. -
ఎంసెట్-౩లో మెరిసిన నగరం
సాక్షి, సిటీబ్యూరో: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఇటీవల నిర్వహంచిన తెలంగాణ ఎంసెట్–3లో నగర విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. టాప్–10లో ఐదు ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. ఎంసెట్–2లో మాదిరిగానే ర్యాంకులు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా ఎంసెట్–2లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు కాకపోవడం గమనార్హం. నగరం 20,648 మంది విద్యార్థులకు ఎంసెట్–3కి దరఖాస్తు చేసుకోగా 15,371 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 15,195 మంది (98.85 శాతం) అర్హత సాధించారు. లాలాగూడ సాయినగర్‌కు చెందిన పి. శ్రీ హారిక 151 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. బహదూర్‌పురకు చెందిన జీషాన్ హమీద్ జలీలి నాలుగో ర్యాంకు దక్కించుకున్నాడు. ఇతను టీఎస్ ఎంసెట్–1లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే. మెహిదీపట్నం అరబ్ లేన్‌కు చెందిన ఇక్రంఖాన్ 5వ ర్యాంకు, భారతీ నగర్ కాలనీ వాసి శ్రీకాంతేశ్వర్ రెడ్డి 6వ ర్యాంకు, బేగంపేటకు చెందిన బలుసు కావ్య 9వ ర్యాంకు సాధించారు. వీరితోపాటు వందలోపు 40 ర్యాంకులు నగర వాసులే దక్కించుకోవడం విశేషం. కేటగిరీల వారీగా.. బీసీ–ఏ కేటగిరీలో సరూర్‌నగర్ చెరుకుతోట కాలనీకి చెందిన బి. శివాని 148 మార్కులతో 52 ర్యాంకు సాధించి ఈ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచింది. రామంతపూర్ గణేష్ నగర్‌కు చెందిన అభితేజ్ 53వ ర్యాకు, అశోక్ నగర్ వాసి కొయ్య వినీత్ రెడ్డి 91వ ర్యాంకు సాధించారు. బీసీ–బి కేటగిరీలో ఈసామియా బజార్‌కు చెందిన కుందారం వైష్ణవి 42వ ర్యాంకు, మీర్‌పేట సర్వోదయ నగర్‌కు చెందిన తాళ్లపల్లి రవితేజకు 43వ ర్యాంకు దక్కించుకున్నారు. బీసీ–సి కేటగిరీలో జీడిమెట్లకు చెందిన సర్హా సుహితకు 37వ ర్యాంకు లభించింది. బీసీ–డి కేటగిరీలోనూ ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నల్లకుంట పద్మా కాలనీకి చెందిన రాజబోయిన వెంకటేష్‌కు 39, కూకట్పల్లి బాలాజీ నగర్ వాసి డి. శ్రీ వరుణ్‌కు 45వ ర్యాంకు దక్కింది. -
టీటీడీ కళ్యాణ మండపంలో..
హిమాయత్‌నగర్: లిబర్టీ వద్ద ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ‘సిల్క్ కాటన్ ఎక్స్పో’ అదరహో అంటోంది. క్రాఫ్ట్ వీవర్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఎగ్జిబిషన్ మహిళలను విశేషంగా ఆకట్టుకుంటోంది. నగరం నలుమూలల నుంచి యువత, మహిళలు పెద్ద ఎత్తున విచ్చేసి తమకు కావాల్సిన చీరెలను కొనుగోలు చేసుకుంటున్నారు. దాదాపు 25 రకాల చీరెలు, డ్రస్ మెటీరియల్స్ ఈ ఎగ్జిబిషన్లో ఉంచినట్లు నిర్వాహకులు అక్బర్ అలీ తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందన్నారు. -
ఓటుకు నోటులో ఎవరినీ వదిలిపెట్టద్దు
హిమాయత్‌నగర్: ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో చర్యలు తీసుకుంటే అందరిపైనా తీసుకోవాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య అన్నారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దళిత క్రైస్తవుడైన తనపై రాజకీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏసీబీ దాడులకు ముందు కానీ, తర్వాత కానీ తాను సంబంధిత వ్యక్తులెవరితోనూ ఫోన్లో మాట్లాడలేదన్నారు. ఎవరో ఒకరిని బలి చేయాలనే తనను వేధిస్తున్నారని ఆయన అన్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆ ఫోన్ మాట్లాడింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలితే అతడిపైనా... ఆ ఫోన్‌ను ట్యాపింగ్ చేయించిన కేసీఆర్‌లపై కూడా చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మా ఓట్లతో గెలిచి మాపైనే పెత్తనమా?
హిమాయత్‌నగర్: లక్షల జీతాలు తీసుకుంటున్న ఉన్నతాధికారుల సభలు, సమావేశాల ఖర్చు కార్మికులపై మోపుతున్నారని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన కార్మికులపై రుబాబు చేయడమేగాక ఇళ్లలో పాచి పనిని చేయించుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మున్సిపల్ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని, కార్మికులకు కనీస వేతనాలను రూ. 15వేలకు పెంచుతామన్న నేతలు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు. కార్పొరేటర్ల బర్త్‌డేలు, ఫంక్షన్లకు కార్మికులు కేకులు తీసుకెళ్లి కట్ చేయాల్సి వస్తుందన్నారు. లేకపోతే వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కార్మికులకు మాస్క్‌లు, షూలు. గ్లౌవ్స్ ఇవ్వటం లేదన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ , మహబూబ్‌నగర్ అటవీ ప్రాంతాల వద్ద పనిచేసే కార్మికులు జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో రషీద్, కృష్ణ. ఆనంద్, సుధాకర్ గౌడ్, సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు.