మాట్లాడుతున్న శివకుమార్
హిమాయత్‌నగర్: లక్షల జీతాలు తీసుకుంటున్న ఉన్నతాధికారుల సభలు, సమావేశాల ఖర్చు కార్మికులపై మోపుతున్నారని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వెళ్లిన కార్మికులపై రుబాబు చేయడమేగాక ఇళ్లలో పాచి పనిని చేయించుకుంటున్నారని ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మున్సిపల్ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ వ్యవస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని, కార్మికులకు కనీస వేతనాలను రూ. 15వేలకు పెంచుతామన్న నేతలు అధికారంలోకి రాగానే పట్టించుకోవడం లేదన్నారు.
కార్పొరేటర్‌ల బర్త్‌డేలు, ఫంక్షన్లకు కార్మికులు కేకులు తీసుకెళ్లి కట్ చేయాల్సి వస్తుందన్నారు. లేకపోతే వారి నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కార్మికులకు మాస్క్‌లు, షూలు. గ్లౌవ్స్ ఇవ్వటం లేదన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ , మహబూబ్‌నగర్ అటవీ ప్రాంతాల వద్ద పనిచేసే కార్మికులు జంతువుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమలో రషీద్, కృష్ణ. ఆనంద్, సుధాకర్ గౌడ్, సాయిదీప్ తదితరులు పాల్గొన్నారు.