hindu doctor
-
పాకిస్తాన్లో హిందూ డాక్టర్ కాల్చివేత
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని కరాచీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డెరెక్టర్, ప్రముఖ కంటి వైద్యుడు, హిందూ మతస్థుడైన డాక్టర్ బీర్బల్ జినానీని దుండుగులు గురువారం తుపాకీతో కాల్చి చంపారు. కరాచీ సమీపంలోని ల్యారీ ఎక్స్‌ప్రెస్ రహదారిపై కారులో వెళ్తుండగా దుండుగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లో హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి. మార్చి నెలలో ఇది రెండో హత్య కావడం గమనార్హం. ఇటీవలే పాకిస్తాన్‌లోని హైదరాబాద్ పట్టణంలో హిందూ మతానికి చెందిన ధరమ్‌దేవ్ రాఠీ అనే వైద్యుడిని ముష్కరులు పొట్టనపెట్టుకున్నారు. -
మతాలు వేరైనా.. మమతలు ఒక్కటే
చివరి ఘడియల్లో చాలాచోట్ల ఇప్పుడు ఆసుపత్రి సిబ్బందే అయినవారు అవుతున్నారు. ఆఖరి చూపులూ వారివే అవుతున్నాయి. పాలక్కాడ్ లోని ఒక ఆసుపత్రిలో తాజాగా ఒక ముస్లిం మహిళ చివరి క్షణాలలో ఆ ఆసుపత్రి డాక్టర్.. రేఖ మాత్రమే ఆమె చెంతన ఉన్నారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం ఆ మహిళ చెవిలో ‘షహాద’ కూడా వినిపించారు! హిందూ మహిళ అయివుండీ షహాద చెప్పిన డాక్టర్ రేఖ ‘సంస్కారానికి’ ముస్లిం సమాజం అంతా హర్షిస్తోంది. డాక్టర్ రేఖాకృష్ణకు తనిక చేయగలిగిందేమీ లేదని అర్థమైంది! ఐసీయులో ఉన్న ఒక కోవిడ్ పేషెంట్ చివరి ఉఛ్వాస నిశ్వాసాలను ఆ క్షణంలో ఆమె చూస్తూ ఉన్నారు. పాలక్కాడ్‌లోని పఠంబి లో ‘సేవన హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్’లో ఆమె వైద్యురాలు. మే 17 ఆ రోజు. డాక్టర్ రేఖ కళ్లెదుట మరణశయ్యపై ఉన్నది ఒక ముస్లిం మహిళ. అప్పటికి కొద్దిసేపటికి క్రితమే వెంటిలేటర్‌ను తొలగించారు. కుటుంబ సభ్యులకు కబురు కూడా వెళ్లింది. పోయే ప్రాణం ఎందుకోసమో ఆగి ఉన్నట్లుగా అనిపించింది డాక్టర్ రేఖకు ఆమెను సమీపాన్నుంచి చూస్తున్నప్పుడు! ఆమె మనసులో ఏదో స్ఫురించింది. వెంటనే ఆ పేషెంట్ చెవిలో మెల్లిగా.. ‘లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లాహ్..’ అని ‘షహాద’ పఠించారు. అల్లా ఒక్కడే దేవుడు, మహమ్మదు అతడిచే అవతరించబడిన ప్రవక్త’ అనే విశ్వాస వచనమే షహాద. సంప్రదాయం ప్రకారం ఆ మతస్తులు చేయవలసిన ప్రార్థన షహాద. కుటుంబ సభ్యులు వచ్చేలోపు డాక్టర్ రేఖ తనే ఆ ప్రార్థన వచనాలను ఆఖరి మాటలుగా ఆ మహిళకు వినిపించారు. అప్పటికి రెండు వారాలుగా కోవిడ్ న్యుమోనియాతో చికిత్స పొందుతున్నారు ఆవిడ. అన్నీ రోజులూ ఆమె తరఫువాళ్లు ఆమెను చూడ్డానికి వీల్లేకపోయింది. ఆఖరికి.. చివరి చూపును కూడా! వారికి ఆ లోటు తెలియకుండా, పేషెంట్ మనసును గ్రహించినట్లుగా డాక్టర్ రేఖ ఒక ముస్లింలా ఆ ప్రార్థన వచనాలను పలికారు. ∙∙ హిందూ మహిళ అయుండీ షహాదను పఠించినందుకు ముస్లిములంతా డాక్టర్ రేఖపై దీవెన లు కురిపిస్తున్నారు. ‘‘ముందుగా అనుకున్నదేమీ కాదు. నాకెందుకో అలా చేయాలని అనిపించింది. బహుశా నేను దుబాయ్‌లో కొన్నాళ్లు పని చేసి వచ్చినందువల్ల, అక్కడి వారితో కలిసిమెలిసి ఉన్నందు వల్ల, వాళ్లు నా పట్ల చూపిన గౌరవ మర్యాదలకు కృతజ్ఞతగా నేనిలా చేసి ఉంటాను’’ అంటున్నారు డాక్టర్ రేఖ. ఆమెకు అరబిక్ వచ్చు. ‘‘అందుకే ఉచ్చారణ దోషాలు లేకుండా షహాద ను జపించగలిగాను’’ అంటారు. అయితే ఈ విషయం బయటికి రావడంలో డాక్టర్ రేఖ ప్రమేయం ఏమాత్రం లేదు. సాటి వైద్యుడి ద్వారా ఈ ఘటన గురించి తెలుసుకున్న ముస్లిం ప్రొఫెసర్ ఒకరు ఫేస్బుక్లో డాక్టర్ రేఖ చొరవ ను కొనియాడుతూ పెట్టిన పోస్ట్ చదివిన వారు అభినందనలు తెలియజేస్తుంటే ఆమె స్పందించవలసి వచ్చింది. అబ్దుల్ హమీద్ ఫైజీ అంబలక్కడవు అనే సున్నీ స్కాలర్ అయితే డాక్టర్ రేఖ చేసిన పని పట్ల అమితమైన భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘మతం పేరుతో మనుషులు ఒకరినొకరు ద్వేషించుకుంటున్న తరుణంలో పర మత సహనానికి ఆమె ఒక ఆదర్శంగా నిలిచారు’’అని అభివాదాలు తెలియజేశారు. ఇటీవలే మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఇలాంటి ‘సంస్కారవంతమైన’ ఘటనే జరిగింది. అయితే ఆ ఘటనలో.. ఆయేషా అనే ముస్లిం మహిళ.. అయినవారెవరూ దగ్గర లేకపోవడంతో ఒక హిందూ పురుషుడికి మత సంప్రదాయాల ప్రకారం తనే అంత్యక్రియలు జరిపించి అందరి మన్ననలు పొందారు. ‘‘దీన్నొక మత విషయంగా నేను చూడలేదు.. మనిషికి మనిషి సాయం అన్నట్లుగానే భావించాను’’ – డాక్టర్ రేఖాకృష్ణ -
హిందూ డాక్టర్ని కాల్చి చంపారు!
కరాచీః పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో 56 ఏళ్ళ హిందూ డాక్టర్ని ఆయన క్లినిక్ బయటే గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గార్డెన్ ఈస్ట్ నివాసి డాక్టర్ పిరీతమ్ లఖ్వానీ గురువారం క్లినిక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పాక్ కాలనీలోని బారారోడో సమీపంలో దుండగులు అతని ఛాతీలో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్రంగా గాయాలైన లఖ్వానీని అబ్బాసీ షహీద్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడినుంచీ అగాఖాన్ యూనివర్శిటీ ఆస్పత్రికి షిఫ్ట్ చేసినా లాభం లేకపోయింది. క్లినిక్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న లఖ్వానీపై దుండగులు దాడిచేసి, హత్య చేశారని ఆయన కుమారుడు రాకేష్ కుమార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులెవరో తన తండ్రి సెల్ ఫోన్ నుంచీ కాల్ చేసి, ఆయన హత్యకు గురైనట్లు తెలిపారని కుమార్ వివరించాడు. లఖ్వానీకి ఎవరితోనూ ఎటువంటి శత్రుత్వం లేదని, ఇంతకు ముందెన్నడూ ఎటువంటి బెదిరింపు కాల్స్ రాలేదని రాకేష్ చెప్తున్నాడు. కాగా లఖ్వానీ గత 15 సంవత్సరాలుగా అదే కాలనీలో క్లినిక్ నడుపుతున్నారని, హత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్తున్నారు. క్లినిక్ నివాస ప్రాంతంలోనే ఉన్నప్పటికీ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో కరెంటు లేకపోవడంతో దుండగులను ఎవరూ గుర్తించలేకపోయారని పోలీసులు అంటున్నారు. అసలు హత్యకు ఒక్కరే ప్రయత్నించారా, ఎక్కువ మంది ఉన్నారా అన్న విషయాలతోపాటు.. హత్యవెనుక కారణాలు ఇంకా తెలియ రాలేదని పోలీసులు చెప్తున్నారు. అయితే లఖ్వానీని చంపాలన్నదే టార్గెట్ గా పెట్టుకొని ఈ హత్య జరిగినట్లుగా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీస్ అధికారి మహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. లఖ్వానీది మతపరమైన హత్య అయి ఉండొచ్చని ముత్తహిదా ఖ్వామీ ఉద్యమ నేత సంజయ్ పెర్వానీ అభివర్ణించారు. డాక్టర్ లఖ్వానీ సెల్ ఫోన్ లో బ్యాలెన్స్ వేయించమని అసిస్టెంట్ ను బయటకు పంపిన సమయంలో బహుశా ఈ హత్య జరిగి ఉండొచ్చని, మరో రకమైన ఆధారాలేవీ కనిపించడంలేదని పెర్వానీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతవారం 32 ఏళ్ళ హిందూ డాక్టర్ అనిల్ కుమార్ కూడా కరాచీ ఆస్పత్రి ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని, అంతకు ముందు హిందూ మతానికి చెందిన ఇద్దరిని అబ్బాస్ టౌన్ లోని వైన్ షాప్ వద్ద దాడి చేసి కాల్చి చంపిన ఘటన చోటు చేసుకుందని అంటున్న పెర్వానీ.. లఖ్వానీది కూడా అటువంటి మతపరమైన హత్యే అయిఉండొచ్చంటున్నారు. -
హిందూ డాక్టర్ అనుమానాస్పద మృతి
కరాచీ: ఒక యువ హిందూ వైద్యుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన పాకిస్తాన్‌లోని కరాచిలో జరిగింది. శుక్రవారం ఉదయం తాను పనిచేస్తున్న ఆస్పత్రి ఐసీయూలోని శస్త్రచికిత్స విభాగంలోకి వెళ్లిన అనిల్‌కుమార్(32) ఎంతకీ తలుపులు తీయలేదని, దీంతో తలుపులు పగలగొట్టి చూడగా ఆయన కుర్చీలో చనిపోయి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలిలో ఒక సిరంజిని కనుగొన్నామని, డాక్టర్ చేతికి బ్యాండేజి కూడా ఉందని తెలిపారు. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కుమార్ మృతదేహాన్ని, సిరంజిని వైద్య పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. కాగా, ఇదే వారంలో పవిత్ర గ్రంథంపై(హోలీ బుక్) నిరసనల సందర్భంగా కొందరు దుండగులు ఒక హిందూ వ్యాపారిని చంపి, అతని హిందూ స్నేహితుడిని తీవ్రంగా గాయపరిచారు. -
ఐసీయూలో డాక్టర్ అనుమానాస్పద మృతి
కరాచీ: తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఓ యువ డాక్టర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది. శుక్రవారం సర్జికల్ ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్ అనిల్ కుమార్(32) ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తలుపులు పగులగొట్టి చూశారు. చైర్లో కూర్చుని కనిపించిన డాక్టర్‌ను దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అతడు అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నయీముద్దీన్ మాట్లాడుతూ.. డాక్టర్ మృతిపై అనుమానాలున్నాయన్నారు. డాక్టర్ మృతిచెందిన ప్రదేశంలో ఓ సిరంజిని గుర్తించామని, డాక్టర్ చేతికి బ్యాండేజీ సైతం ఉందని తెలిపారు. ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిరంజిని కెమికల్ లేబొరేటరీకి పంపించి పరీక్షిస్తున్నారు. గత వారం ఓ హిందూ వ్యాపారిని నిరసనకారులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.