ఐసీయూలో డాక్టర్ అనుమానాస్పద మృతి
కరాచీ: తాను పనిచేస్తున్న ఆసుపత్రిలోని ఇంటెన్సీవ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో ఓ యువ డాక్టర్ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పాకిస్తాన్లోని కరాచీలో చోటుచేసుకుంది. శుక్రవారం సర్జికల్ ఐసీయూలోకి వెళ్లిన డాక్టర్ అనిల్ కుమార్(32) ఎంతకీ బయటకు రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది తలుపులు పగులగొట్టి చూశారు. చైర్లో కూర్చుని కనిపించిన డాక్టర్ను దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అతడు అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సీనియర్ పోలీస్ ఆఫీసర్ నయీముద్దీన్ మాట్లాడుతూ.. డాక్టర్ మృతిపై అనుమానాలున్నాయన్నారు. డాక్టర్ మృతిచెందిన ప్రదేశంలో ఓ సిరంజిని గుర్తించామని, డాక్టర్ చేతికి బ్యాండేజీ సైతం ఉందని తెలిపారు. ఎవరైనా ఇంజెక్షన్ ఇచ్చి చంపారా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సిరంజిని కెమికల్ లేబొరేటరీకి పంపించి పరీక్షిస్తున్నారు. గత వారం ఓ హిందూ వ్యాపారిని నిరసనకారులు కాల్చిచంపిన విషయం తెలిసిందే.