Hindu Vahini
-
హరీష్ రావు ఆ సంస్థలో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్ : గో హత్యలు, లవ్ జిహాద్, మత మార్పిడి వంటి వాటిని నిరోధించడానికి హిందూ వాహిని పనిచేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అందరినీ ఆదరించే హరీష్‌రావు హిందూ వాహిని కార్యకర్తల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. హిందూ వాహిని అంటే ఏమిటో తెలియాలంటే హరీష్‌రావు ఒకసారి హిందూ వాహినిలో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలు ఏ కార్యక్రమం తలపెట్టినా పోలీసులు బెదిరించడం, అక్రమ కేసులు పెడతామని వేధించడం మానుకోవాలని కోరారు. హిందూ వాహిని చిన్న సంస్థ కాదని పెద్ద శక్తి అని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు హిందూ వాహిని కార్యకర్తనని రాజాసింగ్ వెల్లడించారు. హిందూ రాష్ట్రం ఏర్పాటు చేయడమే హిందూ వాహిని లక్ష్యమని స్పష్టం చేశారు. దేవీ నవరాత్రులు నిర్వహించే ప్రతీ మండపం వద్ద సనాతన ధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలను ఆదేశించారు. యువకులు దేశ రక్షణ, ధర్మ రక్షణ కోసం పని చేయాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు. -
యోగి యూపీలో దారుణం!
ముస్లిం వ్యక్తిని కొట్టిచంపిన హిందూత్వ గ్రూప్ మీరట్: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో వృద్ధుడైన ఓ ముస్లిం వ్యక్తిని కొందరు హిందూత్వ అతివాదులు కొట్టిచంపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి గత వారం ఇంటినుంచి పారిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన హిందూత్వ సంస్థ సభ్యులు 55 ఏళ్ల గులాం మహమ్మద్‌పై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిపోయిన జంట ఎక్కడ ఉన్నారని తెలుపాలని ఆయనపై దాడి చేశారు. ఆయన వివరాలు తెలుపలేకపోవడంతో వారు ఆయనను చితకబాదారని పోలీసులు తెలిపారు. స్థానిక మీరట్ డీఐజీ సంఘటనా స్థలాన్ని సందర్శించి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. మృతుడి కొడుకు నిందితులకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తుతెలియని ఆరుగురు హిందూవాహిని సంస్థ సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్టు అతను తన కేసులో పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని, గత ఎస్పీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న పోలీసులే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని హిందూ యువవాహిని సంస్థ పేర్కొంది. -
యూపీలో హోర్డింగ్‌ల కలకలం
మీరట్(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన ఓ నాయకుడు ఏర్పాటు చేసిన హోర్డింగులు కలకలం రేపుతున్నాయి. 'యోగి యోగి అనే మంత్రం జపించండి లేదా యూపీ విడిచి వెళ్లిపోండి' అంటూ మీరట్‌లోని ముఖ్య ప్రాంతాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు ఏర్పాటయ్యాయి. ప్రజాప్రతినిధులతోపాటు అధికారుల ఇళ్ల వద్ద వీటిని ఉంచారు. జిల్లా పోలీస్ కమిషనర్ నివాసం ఎదుట కూడా వీటిని ఏర్పాటు చేయటం అంతటా చర్చనీయాంశమయింది. ప్రధానమంత్రి, నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తోపాటు మీరట్ జిల్లా హిందూ వాహిని అధ్యక్షుడుగా చెప్పుకుంటున్న నీరజ్ శర్మ పంచాలీ ఫొటోలు ఈ హోర్డింగులపై ఉన్నాయి. ఈ అంశంపై పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని ఇంటలిజెన్స్ విభాగాన్ని ఆదేశించినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్ర గౌర్ తెలిపారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. హిందూ వాహిని రాష్ట్ర నేత నాగేంద్ర ప్రతాప్ సింగ్‌ను వివరణ కోరగా.. నీరజ్ శర్మ పంచాలీతో తమ సంస్థకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. నెల క్రితమే ఆయన్ను సంస్థ నుంచి బహిష్కరించినట్లు వివరించారు. హిందూవాహినిని అప్రతిష్టపాలు చేయటానికే ఆయన ఇటువంటి చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. -
దిలావర్పూర్లో హిందూవాహిని సమావేశం
నూతన కార్యవర్గం ఏర్పాటు, గ్రామంలో ర్యాలీ దిలావర్పూర్ : మండల కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో ప్రత్యేక ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హిందూవాహిణి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిరికొండ శ్రీనివాస్, ప్రచార కర్త విశాల్, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా భవిష్యత్‌లో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు. దిలావర్పూర్ నూతన కమిటీ అధ్యక్షడిగా వీరాచారి, ఉపాధ్యక్షుడిగా వెల్మల అశోక్, పాల్దె మనీశ్, ప్రధాన కార్యదర్శిగా గోపు రాకేశ్, గోరక్షక్ ప్రముఖ్‌గా కొప్పుల రమేశ్, సహ ప్రముఖ్‌గా కోడె కృష్ణ, లవ్‌జిహాద్ ప్రముఖ్‌గా రాజకిషన్, సహ ప్రముఖ్‌గా నిమ్మల అజయ్, శారీరక్ ప్రముఖ్‌గా ఆకుల రంజిత్, కార్యదర్శులుగా ఆలూర్ రమణ, పసుల రాంచందర్, దాత్రిక రాజ్‌కుమార్, సాయిప్రసాద్, కోడె నరేశ్‌లను ఎన్నుకున్నారు. ఇందులో బీజేపీ మండలాధ్యక్షుడు పీసరి శైలేశ్వర్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.