యోగి యూపీలో దారుణం!
- ముస్లిం వ్యక్తిని కొట్టిచంపిన హిందూత్వ గ్రూప్
మీరట్: ఉత్తరప్రదేశ్ బులంద్‌షహర్‌లో వృద్ధుడైన ఓ ముస్లిం వ్యక్తిని కొందరు హిందూత్వ అతివాదులు కొట్టిచంపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్థాపించిన హిందూ యువవాహిని సంస్థ సభ్యులే ఈ దారుణానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి గత వారం ఇంటినుంచి పారిపోయారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన హిందూత్వ సంస్థ సభ్యులు 55 ఏళ్ల గులాం మహమ్మద్‌పై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిపోయిన జంట ఎక్కడ ఉన్నారని తెలుపాలని ఆయనపై దాడి చేశారు.
ఆయన వివరాలు తెలుపలేకపోవడంతో వారు ఆయనను చితకబాదారని పోలీసులు తెలిపారు. స్థానిక మీరట్ డీఐజీ సంఘటనా స్థలాన్ని సందర్శించి వెంటనే నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు. మృతుడి కొడుకు నిందితులకు వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గుర్తుతెలియని ఆరుగురు హిందూవాహిని సంస్థ సభ్యులు ఈ దారుణానికి పాల్పడినట్టు అతను తన కేసులో పేర్కొన్నాడు. అయితే, ఈ ఘటనతో తమకెలాంటి సంబంధం లేదని, గత ఎస్పీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న పోలీసులే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని హిందూ యువవాహిని సంస్థ పేర్కొంది.