ఉల్లి కోసం మహిళల ఆందోళన
హిందూపురం అర్బన్ : కిలో రూ.20తో ఉల్లిగడ్డలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం మార్కెట్‌యార్డులో సోమవారం మహిళలు ఆందోళన చేశారు. ఉదయమే పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. ఉల్లిగడ్డలు అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. నామమాత్రంగా ఒకరోజు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ నిలదీశారు. ఎంతమందికి పంపిణీ చేశారో రికార్డు చూపాలంటూ పట్టుబట్టారు.
ఇందుకు యార్డు అధికారులు చెత్తబుట్టలో ఉన్న స్లిప్పులు చూపడంతో మరింత ఆగ్రహించారు. ఇష్టమొచ్చినట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. కొందరు నాయకుల పేర్లు చెప్పుకుని 10, 20 కిలోలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఉల్లి ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో యార్డు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఉదయం ఎనిమిది నుంచి వేచి ఉన్నామని, తమకు ఉల్లిగడ్డలు ఇప్పించాలని కోరారు. యార్డు కార్యదర్శి కర్ణాటకలో ఉల్లిధరలు తెలుసుకోవడానికి వెళ్లారని, వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని సిబ్బంది సర్దిచెప్పడంతో మహిళలు వెనుదిరిగారు.
శని, ఆదివారం ఇచ్చాం
-కేదర్నాథ్, యార్డు ఉద్యోగి
రెండోవిడతగా వచ్చిన 200 బస్తాల ఉల్లిని శని,ఆదివారం పంపిణీ చేసేశాం. పంపిణీ రికార్డును అధికారులు అనంతపురం తీసుకుపోయారు.