Hindustani Awam Morcha
-
ఎన్నికలకు ముందు బిహార్‌లో కీలక పరిణామం
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌లోని ప్రతిపక్ష కూటమి ‘మహాఘట్బంధన్’కు ఎదురుదెబ్బ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ప్రకటించింది. మహాఘట్‌బంధన్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. జితన్‌రామ్ మాంఝీ నివాసంలో నేడు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీట్ల పంపకం విషయం గురించి చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హామ్-ఎస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో జితన్‌రామ్ మాంఝీ కలత చెందినట్లు తెలుస్తోంది. దీని గురించి ఆయన కుమారుడు సంతోష్ సుమన్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ మహాఘట్బంధన్ నుంచి బయటకు రావాలనుకుంటుంది. కోర్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని నిర్ణయించాం. సమన్వయ కమిటి ఏర్పాటు చేయాలని మేం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. బిహార్‌లో కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), రాష్ట్రీయ లోక్ సమత పార్టీ (ఆర్ఎల్ఎస్పి), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)లు కలిసి మహాఘట్‌బంధన్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 29తో ఇప్పుడు ఉన్న నితీశ్‌కుమార్ ప్రభుత్వం కాలపరిమితి ముగుస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలలో ఎన్నికలు జరగాల్సివుంది. కరోనా సంక్షోభం కారణంగా ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు. చదవండి: ‘ముందే చెప్పాను.. కానీ ఎగతాళి చేశారు’ -
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి
పట్నా / పణజి / ఇంఫాల్: కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా నిర్ణయం నేపథ్యంలో గోవా, మణిపుర్లో కాంగ్రెస్, బిహార్‌లో ఆర్జేడీ నేతలు ఆయా రాష్ట్రాల గవర్నర్లతో శుక్రవారం భేటీ అయ్యారు. బిహార్ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ రాజ్‌భవన్‌లో గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 80 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ నిలిచిన నేపథ్యంలో తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ‘గవర్నర్‌ను కలసి మాకు 111 మంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉన్నట్లు లేఖను సమర్పించాం. వీరిలో ఆర్జేడీతో పాటు కాంగ్రెస్, హిందుస్తానీ అవామ్ మోర్చా(హెచ్ఏఎం), సీపీఐ(ఎంఎల్) పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకవేళ గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తే మేం కచ్చితంగా విజయం సాధిస్తాం. ఎందుకంటే చాలామంది శాసనసభ్యులు మాకు అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు’అని మీడియాకు తెలిపారు. ఏకైక పెద్దపార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్ నిర్ణయం సరైనదైతే.. బిహార్‌లో ఆర్జేడీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 2015లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ 80 సీట్లలో గెలుపొందగా, జేడీయూ 71 చోట్ల, బీజేపీ 53 చోట్ల, కాంగ్రెస్ 27 సీట్లలో గెలుపొందాయి. వీటితో పాటు ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ చెరో రెండు సీట్లను దక్కించుకున్నాయి. తొలుత ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన జేడీయూ.. ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టింది. మృదులా సిన్హాతో కాంగ్రెస్ భేటీ గోవాలో అతిపెద్ద పార్టీగా నిలిచిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్షనేత చంద్రకాంత్ కవ్లేకర్ గోవా గవర్నర్ మృదులా సిన్హాను శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో కాంగ్రెస్ నేతలతో కలసి ఆమెకు లేఖను సమర్పించారు. 2017 గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం గవర్నర్‌కు పార్టీ రాసిన లేఖ ప్రతిని దీనికి జత చేశారు. తమ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు రోజుల్లోగా అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఈ లేఖలో తెలిపింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న కర్ణాటక గవర్నర్ నిర్ణయం 2017లో గోవా గవర్నర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని రుజువు చేస్తోందని పేర్కొంది. 40 సీట్లున్న గోవా అసెంబ్లీకి గతేడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 17 చోట్ల విజయం సాధించినా.. కేవలం 13 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ గోవా ఫార్వర్డ్ పార్టీ(3), మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీ(3), ముగ్గురు స్వతంత్రుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు మణిపుర్ మాజీ సీఎం ఇబోబీ సింగ్ నేతృత్వంలో 9 మంది కాంగ్రెస్ సీఎల్పీ నేతల బృందం శుక్రవారం ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ జగదీశ్ ముఖితో రాజ్‌భవన్‌లో భేటీ అయింది. ఈ సందర్భంగా అసెంబ్లీలోని 60 స్థానాల్లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిల్చిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరినట్లు సింగ్ మీడియాకు తెలిపారు. గతేడాది జరిగిన మణిపుర్ అసెంబ్లీఎన్నికల్లో కాంగ్రెస్ 28 చోట్ల, బీజేపీ 21 సీట్లలో విజయం సాధించాయి. కానీ స్థానిక పార్టీల సాయంతో బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మృదులా సిన్హాకు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు -
ఎమ్మెల్యే పదవి వదులుకున్న మాజీ సీఎం
పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎమ్మెల్యే పదవిని మాంఝీ వదులుకున్నారని ఆయన సన్నిహిత సహాయకుడు దనిశ్ రిజ్వాన్ తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శి రామ్ ముఖియాను కలిసి రాజీనామా లేఖ సమర్పించారని వెల్లడించారు. వెంటనే తన రాజీనామా ఆమోదించాలని మాంఝీ కోరినట్టు చెప్పారు. జహానాబాద్ జిల్లాలోని జహనాబాద్ జిల్లాలో మగ్దంపూర్ అసెంబ్లీ స్థానానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 70 ఏళ్ల మాంఝీ 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మరోవైపు తాను స్థాపించిన హిందూస్తానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎం) పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మాంఝీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జేడీ(యూ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు హెచ్ఏఎం జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. హెచ్ఏఎం ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరింది. -
'మాంఝీ మాతో రండి'
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమతో కలిసి రావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీని ఆహ్వానించారు. సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (యునెటైడ్), రాష్ట్రీయ జనతా దళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జనతాదళ్ (సెక్యులర్), సమాజ్‌వాదీ జనతా పార్టీలు కలిసి జనతా పరివార్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ములాయంసింగ్ యాదవ్ అధినేతగా ఉన్నారు. త్వరలోనే బీహార్‌లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కావాల్సిన అన్ని రకాల బలాలను సమీకరించేందుకు ఇప్పుడు జనతా పరివార్ శ్రమిస్తోంది. కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మాంఝీ నిరాకరించిన నేపథ్యంలో ఆయనను జేడీయూ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన సొంతంగా హిందుస్థాని అవామ్ మోర్చా అనే రాజకీయ సంస్థను స్థాపించుకున్నారు. దీంతో ఆ సంస్థను కూడా తమతో చేర్చుకొని మరింత బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో లాలూ మాంఝీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. -
మాంఝీ సంచలన వ్యాఖ్యలు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. హిందుస్థానీ అవామ్ మోర్చా (హామ్ ) పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాజీముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తరువాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారంటూ మాంఝీ నితీశ్ పై విరుచుకుపడ్డారు. బీహార్ లో ఎస్పీ,ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్ నగర్ లోని మాతా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించి వెళ్లిన తరువాత కూడా దేవస్థానం యాజమాన్యం దేవస్థానాన్ని శుభ్రం చేయించారని ఆయన ఆరోపించారు. ప్రస్తుత తన పరిస్థితికి జేడీయూ లోని అగ్రకుల నాయకులే కారణమన్నారు. తాను దళితుడిని కాబట్టే తనకు అన్యాయం జరిగిందని మాంఝీ వాపోయారు.