బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ మాంఝీ రాబోయే ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. హిందుస్థానీ అవామ్ మోర్చా (హామ్ ) పార్టీని స్థాపిస్తున్నట్టుగా ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన మాజీముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. కుల వివక్ష చూపించి తనను అవమానించారన్నారు. తాను రాజీనామా చేసిన తరువాత ముఖ్యమంత్రి నివాసాన్ని పవిత్ర గంగాజలంతో కడిగించారంటూ మాంఝీ నితీశ్ పై విరుచుకుపడ్డారు. బీహార్ లో ఎస్పీ,ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు.
అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్ నగర్ లోని మాతా పరమేశ్వరి దేవాలయాన్ని సందర్శించి వెళ్లిన తరువాత కూడా దేవస్థానం యాజమాన్యం దేవస్థానాన్ని శుభ్రం చేయించారని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత తన పరిస్థితికి జేడీయూ లోని అగ్రకుల నాయకులే కారణమన్నారు. తాను దళితుడిని కాబట్టే తనకు అన్యాయం జరిగిందని మాంఝీ వాపోయారు.