పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌లోని ప్రతిపక్ష కూటమి ‘మహాఘట్‌బంధన్’కు ఎదురుదెబ్బ తగిలింది. కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ప్రకటించింది. మహాఘట్‌బంధన్‌తో తెగతెంపులు చేసుకుంటున్నట్టు గురువారం ప్రకటించింది. జితన్‌రామ్ మాంఝీ నివాసంలో నేడు జరిగిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సీట్ల పంపకం విషయం గురించి చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హామ్-ఎస్ పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో జితన్‌రామ్ మాంఝీ కలత చెందినట్లు తెలుస్తోంది. దీని గురించి ఆయన కుమారుడు సంతోష్ సుమన్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ మహాఘట్‌బంధన్ నుంచి బయటకు రావాలనుకుంటుంది. కోర్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని నిర్ణయించాం. సమన్వయ కమిటి ఏర్పాటు చేయాలని మేం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. కూటమిలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని పేర్కొన్నారు.
బిహార్‌లో కాంగ్రెస్‌తో పాటు రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), రాష్ట్రీయ లోక్ సమత పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి), వికాషీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి)లు కలిసి మహాఘట్‌బంధన్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 29తో ఇప్పుడు ఉన్న నితీశ్‌కుమార్ ప్రభుత్వం కాలపరిమితి ముగుస్తుంది. అక్టోబర్, నవంబర్ నెలలో ఎన్నికలు జరగాల్సివుంది. కరోనా సంక్షోభం కారణంగా ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment