History professor
-
స్టూడెంట్ను ప్రేమించి.. ఆపై తెగ నరికాడు!
రష్యన్ నవలాకారుడు, ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ ఒలేగ్ సొకోలోవ్(63) కోపంలో తన ప్రేయసి, మాజీ విద్యార్థిని అయిన అనస్తేసియా యెష్‌చెంకో(24)ను క్షణికావేశంలో అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆపై.. ఆమె తల, చేతులు, కాళ్లను వేరుచేశాడు. అంతేకాక అనస్తేసియా శరీరభాగాలను కనిపించకుండా చేసి, ఆ తర్వాత తనను ఎంతగానో ప్రభావితం చేసిన నెపోలియన్ వస్త్రధారణలో బహిరంగంగా ఆత్మహత్య చేసుకోవడానికి పథకం పన్నినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ ఒలేగ్ సొకోలోవ్ శనివారం తాగిన మైకంలో మొయికా నదిలో జారిపడి.. అక్కడి పోలీసులకు చిక్కాడు. అనుమానస్పదంగా కనిసిస్తున్న సోకోలోవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని బ్యాగ్‌ను చెక్ చేయగా.. అందులో కత్తిరించిన మహిళ చేతులు ఉన్నాయి. దీంతో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు .. యూనివర్సిటీ మాజీ విద్యార్థిని, తన ప్రేయసి అయిన అనస్టేసియా తలలేని శరీరాన్ని(మొండెం) పోలీసులు సొకోలోవ్ ఇంట్లో గుర్తించారు. పోలీసులకు సీసీ కెమెరాలను చెక్ చేయగా.. మొయికా నది సమీపంలో సంచరిస్తూ.. తన బ్యాగ్‌ను నదిలో పారివేసే క్రమంలో కాలుజారి నదిలో పడ్డాడని పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని.. దీంతో ఆమెను హతమార్చాననే పోలీసులకు అసలు విషయం చెప్పాడు. నేరాన్ని అంగీకరించిన ప్రొఫెసర్ సొకొలోవ్, అనస్టేసియా హత్యపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారని సమాచారం. ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ ఒలేగ్ సొకోలోవ్, అనస్తేసియా యెష్‌చెంకో రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ యూనివర్సిటీలో ప్రముఖ చరిత్ర విభాగపు ప్రొఫెసర్‌గా ఒలేగ్ సోకోలోవ్కు మంచి పేరుంది. ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్ బోనపార్టేపై అనేక పుస్తకాలు రాయడంతో పాటు ఆయన చేసిన కృషికిగాను ఫ్రాన్స్ ప్రతిష్టాత్మక పురస్కారం 'లీజన్ ఆఫ్ ఆనర్' అవార్డును సొంతం చేసుకున్నారు. సొకోలోవ్ ఇంత దారుణానికి పాల్పడతారని తాము ఎన్నడూ ఊహించలేదని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనస్టేసియాను సొకొలోవ్ హత్య చేసిన నేపథ్యంలో.. ఫ్రెంచ్ అకడెమిక్ ఇన్స్టిట్యూట్ రష్యన్ కిల్లర్ ప్రొఫెసర్‌ను విధుల నుంచి బహిష్కరించింది. సొకోలోవ్, అనస్తేసియా కలిసి ఫ్రెంచ్ చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు పుస్తకాలు కూడా రాశారు. అంతేకాక వీరిద్దరికి చారిత్రక శైలిలో దుస్తులు ధరించడానికి మక్కువ చూపేవారని తెలిసింది. నెపోలియన్ ప్రభావం అధికంగా ఉన్న సొకొలోవ్కు.. నెపోలియన్ తరహా బట్టలు వేసుకోవడమంటే అమితమైన ఇష్టం. అనస్టేసియాను ఆయన 'జోసెఫిన్' అని ఎంతో ప్రేమగా పిలిచేవారని యూనివర్సిటీ విద్యార్థులు గుర్తు చేశారు. ఫ్రాన్స్ ఒకప్పటి చక్రవర్తి నెపోలియన్ మొదటి భార్య పేరు జోసెఫిన్ కావడంతో ఆమెను ముద్దుగా ఆ పేరుతో పిలిచేవారు. ఇక ప్రొఫెసర్ సొకోలోవ్ 'హైపోథెర్మియా' అనే వ్యాధితో ఇబ్బంది పడుతూ.. ఆస్పత్రిలో చికిత్స తీసుకొంటున్నారని న్యాయవాది పొచుయేవ్ తెలిపారు. హైపోథెర్మియా వ్యాధి బారిన పడిన వారికి శరీరంలో వేడి జనించడం కన్నా.. వేగంగా వేడిని కోల్పోతారు. దీనివల్ల రోగి శరీర ఉష్ణోగ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయి గుండె, నాడీవ్యవస్థతో పాటు అవయవాల పనితీరు దెబ్బతింటుంది. -
వాడే వీడా?
పట్టుకోండి చూద్దాం చరిత్ర అధ్యాపకుడిగా రిటైరయ్యాడు పరంధామయ్య. చరిత్ర అధ్యాపకుడు అయినప్పటికీ మొదటి నుంచి ఆయన ఆసక్తి మొక్కల మీదే. ప్రతి మొక్కలోనూ ఔషధగుణం ఉంటుందని చెప్పే పరంధామయ్య... ఆ గుణాలను పదిమందికీ తెలియజేయడానికి మొక్కలపై రకరకాల పరిశోధనలు చేసేవాడు. తమకు అందుబాటులో ఉన్న మొక్కల ఔషధ విలువను ప్రజలకు చేరువచేస్తే... వైద్యం పేరుతో చేసే లక్షల ఖర్చు తగ్గుతుందని చెప్పేవాడు. ఆయన చెప్పింది కొందరికి ‘చాలా నిజం’ అనిపించేది. కొందరికి మాత్రం చాదస్తం అనిపించేది. రిటైరైన తరువాత బోలెడు తీరిక దొరకడంతో పరంధామయ్య ఊరూరు తిరుగుతూ మొక్కలపై పరిశోధనలు చేసేవాడు. ఈ క్రమంలో ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది పరిచయం అయ్యారు. వాళ్లలో కొందరు తరచుగా పరంధామయ్య ఇంటికి వచ్చేవారు. కొన్ని రోజుల పాటు ఉండి తిరిగి వెళ్లేవారు. వనాల్లో తిరిగే అలవాటు ఉన్న పరంధామయ్య దగ్గర ఎప్పుడూ ఒక మినీ టేప్ రికార్డర్ ఉండేది. దీనిలో పక్షుల కూతలు, జంతువుల అరుపులను రికార్డ్ చేయడం ఆయనకు సరదాగా ఉండేది. కొందరు పరంధామయ్య దగ్గర డబ్బు గుంజడానికి మొక్కల మీద ఆసక్తి ఉన్నట్లు నటించేవాళ్లు. వారు ఏ ఉద్దేశంతో ఇంటికి వచ్చినా ఆతిథ్య మర్యాదలు మాత్రం ఘనంగా చేసేవాడు. ‘‘ఈయనకు పెళ్లి కాలేదు. వారసులంటూ ఎవరూ లేరు. ఉన్న ఆస్తిని హాయిగా అనుభవించకుండా ఈ మొక్కల పిచ్చి ఏమిటో!’’ అని పరంధామయ్య గురించి చాటుమాటుగా అనేకునేవారు జనాలు. ‘‘ఎవరెవరో మీ ఇంటికి వస్తున్నారు. అందులో దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని సన్నిహితులెవరైనా సలహా ఇస్తే... ‘‘వాళ్లు పరాయిగ్రహం నుంచి వచ్చారా ఏమిటి?’’ అనేవాడు తప్ప ఎవరినీ అనుమానించేవాడు కాదు పరంధామయ్య. రెండు మూడు వారాల పాటు పరంధామయ్య ఊళ్లో కనిపించలేదు. ‘ఎటు వెళ్లాడు?’ అని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే...పరిశోధన పేరుతో పరంధామయ్య ఊళ్లు తిరిగే విషయం అందరికీ తెలుసు కాబట్టి. ఒకరోజు... ‘పరంధామయ్య ఆత్మహత్య చేసుకున్నాడట’ అంటూ జనాలు పరంధామయ్య విశాలమైన ఇంటివైపు పరుగులు తీస్తున్నారు. ఆయన ఆత్మహత్యపై భిన్నమైన కథనాలు వినిపించాయి. ‘పరిశోధనలో పడి ఆయనకు మతి చలించింది. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు’ అనుకున్నారు ఎక్కువ మంది. పోలీసులు సంఘటనస్థలికి చేరుకున్నారు. కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు పరంధామయ్య. కుడివైపు కణతకు బుల్లెట్ గాయం. ఎదురుగా ఉన్న బల్లపై మినీ టేప్ రికార్డర్. ‘నా చావుకు నేనే కారణం’ అనే మాట తరువాత...రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది. ‘‘పరంధామయ్యది ఆత్మహత్య కాదు... హత్య’’ అని తేల్చేశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఒక నెల క్రితం... పరంధామయ్య ఇంటికి ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు. అతడు చూడడానికి అచ్చం రౌడీలా ఉన్నాడు అని ఊరివాళ్లు చెప్పారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి నిజం కక్కించాడు ఇన్స్పెక్టర్ నరసింహ. చంపింది తానే అని ఒప్పుకున్నాడు ఆ రౌడీ. ఇప్పుడు చెప్పండి. టేప్ రికార్డర్లో ‘నా చావుకు నేనే కారణం’ అని పరంధామయ్య గొంతు, ఆ తరువాత రివాల్వర్ పేల్చిన శబ్దం వినిపించినా ‘ఇది ఆత్మహత్య కాదు హత్య’ అని ఇన్స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు? రెండు ఆధారాలు: 1.‘నా చావుకు నేనే కారణం’ (రివాల్వర్ శబ్దం కూడా) అని వినిపించిన తరువాత...టేప్ ఆపేశారు. పరంధామయ్య తనను తాను కాల్చుకొని ఉంటే ఇలా చేయడం కుదరదు. 2. ఒక పక్క పడి ఉన్న రివాల్వర్‌పై ఎవరి వేలి ముద్రలు కనిపించలేదు. పరంధామయ్య ఆత్మహత్య చేసుకొని ఉంటే కచ్చితంగా ఆయన వేలిముద్రలు కనిపించేవి కదా!