వాడే వీడా?
పట్టుకోండి చూద్దాం
చరిత్ర అధ్యాపకుడిగా రిటైరయ్యాడు పరంధామయ్య. చరిత్ర అధ్యాపకుడు అయినప్పటికీ మొదటి నుంచి ఆయన ఆసక్తి మొక్కల మీదే. ప్రతి మొక్కలోనూ ఔషధగుణం ఉంటుందని చెప్పే పరంధామయ్య... ఆ గుణాలను పదిమందికీ తెలియజేయడానికి మొక్కలపై రకరకాల పరిశోధనలు చేసేవాడు. తమకు అందుబాటులో ఉన్న మొక్కల ఔషధ విలువను ప్రజలకు చేరువచేస్తే... వైద్యం పేరుతో చేసే లక్షల ఖర్చు తగ్గుతుందని చెప్పేవాడు.
ఆయన చెప్పింది కొందరికి ‘చాలా నిజం’ అనిపించేది.
కొందరికి మాత్రం చాదస్తం అనిపించేది.
రిటైరైన తరువాత బోలెడు తీరిక దొరకడంతో పరంధామయ్య ఊరూరు తిరుగుతూ మొక్కలపై పరిశోధనలు చేసేవాడు. ఈ క్రమంలో ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది పరిచయం అయ్యారు.
వాళ్లలో కొందరు తరచుగా పరంధామయ్య ఇంటికి వచ్చేవారు.
కొన్ని రోజుల పాటు ఉండి తిరిగి వెళ్లేవారు.
వనాల్లో తిరిగే అలవాటు ఉన్న పరంధామయ్య దగ్గర ఎప్పుడూ ఒక మినీ టేప్ రికార్డర్ ఉండేది. దీనిలో పక్షుల కూతలు, జంతువుల అరుపులను రికార్డ్ చేయడం ఆయనకు సరదాగా ఉండేది.
కొందరు పరంధామయ్య దగ్గర డబ్బు గుంజడానికి మొక్కల మీద ఆసక్తి ఉన్నట్లు నటించేవాళ్లు. వారు ఏ ఉద్దేశంతో ఇంటికి వచ్చినా ఆతిథ్య మర్యాదలు మాత్రం ఘనంగా చేసేవాడు.
‘‘ఈయనకు పెళ్లి కాలేదు. వారసులంటూ ఎవరూ లేరు. ఉన్న ఆస్తిని హాయిగా అనుభవించకుండా ఈ మొక్కల పిచ్చి ఏమిటో!’’ అని పరంధామయ్య గురించి చాటుమాటుగా అనేకునేవారు జనాలు.
‘‘ఎవరెవరో మీ ఇంటికి వస్తున్నారు. అందులో దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని సన్నిహితులెవరైనా సలహా ఇస్తే...
‘‘వాళ్లు పరాయిగ్రహం నుంచి వచ్చారా ఏమిటి?’’ అనేవాడు తప్ప ఎవరినీ అనుమానించేవాడు కాదు పరంధామయ్య.
రెండు మూడు వారాల పాటు పరంధామయ్య ఊళ్లో కనిపించలేదు.
‘ఎటు వెళ్లాడు?’ అని ఎవరు అనుకోలేదు.
ఎందుకంటే...పరిశోధన పేరుతో పరంధామయ్య ఊళ్లు తిరిగే విషయం అందరికీ తెలుసు కాబట్టి.
ఒకరోజు...
‘పరంధామయ్య ఆత్మహత్య చేసుకున్నాడట’ అంటూ జనాలు పరంధామయ్య విశాలమైన ఇంటివైపు పరుగులు తీస్తున్నారు.
ఆయన ఆత్మహత్యపై భిన్నమైన కథనాలు వినిపించాయి.
‘పరిశోధనలో పడి ఆయనకు మతి చలించింది. అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటాడు’ అనుకున్నారు ఎక్కువ మంది.
పోలీసులు సంఘటనస్థలికి చేరుకున్నారు.
కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నట్లుగా ఉన్నాడు పరంధామయ్య. కుడివైపు కణతకు బుల్లెట్ గాయం.
ఎదురుగా ఉన్న బల్లపై మినీ టేప్ రికార్డర్.
‘నా చావుకు నేనే కారణం’ అనే మాట తరువాత...రివాల్వర్ పేలిన శబ్దం వినిపించింది.
‘‘పరంధామయ్యది ఆత్మహత్య కాదు... హత్య’’ అని తేల్చేశాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
ఒక నెల క్రితం... పరంధామయ్య ఇంటికి ఒక వ్యక్తి కొత్తగా వచ్చాడు. అతడు చూడడానికి అచ్చం రౌడీలా ఉన్నాడు అని ఊరివాళ్లు చెప్పారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి నిజం కక్కించాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ. చంపింది తానే అని ఒప్పుకున్నాడు ఆ రౌడీ. ఇప్పుడు చెప్పండి. టేప్ రికార్డర్‌లో ‘నా చావుకు నేనే కారణం’ అని పరంధామయ్య గొంతు, ఆ తరువాత రివాల్వర్ పేల్చిన శబ్దం వినిపించినా ‘ఇది ఆత్మహత్య కాదు హత్య’ అని ఇన్‌స్పెక్టర్ నరసింహ ఎలా కనిపెట్టాడు?
రెండు ఆధారాలు:
1.‘నా చావుకు నేనే కారణం’ (రివాల్వర్ శబ్దం కూడా) అని వినిపించిన తరువాత...టేప్ ఆపేశారు. పరంధామయ్య తనను తాను కాల్చుకొని ఉంటే ఇలా చేయడం కుదరదు.
2. ఒక పక్క పడి ఉన్న రివాల్వర్‌పై ఎవరి వేలి ముద్రలు కనిపించలేదు. పరంధామయ్య ఆత్మహత్య చేసుకొని ఉంటే కచ్చితంగా ఆయన వేలిముద్రలు కనిపించేవి కదా!