డాక్టర్ ఆత్మహత్య! | Dr. Suicide! | Sakshi
Sakshi News home page

డాక్టర్ ఆత్మహత్య!

Published Wed, Feb 10 2016 3:31 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

డాక్టర్ ఆత్మహత్య! - Sakshi

డాక్టర్ ఆత్మహత్య!

♦ కాల్పుల కేసులో ఊహించని ట్విస్ట్   
♦ తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న డాక్టర్ శశికుమార్
 
 సాక్షి, హైదరాబాద్: నిన్న హత్యాయత్నం.. నేడు ఆత్మహత్య.. ‘చంపింది’ నేను కాదంటూ సూసైడ్ నోట్.. తెరపైకి కొత్త క్యారెక్టర్లు! ఒక్కరోజులోనే ఊహించని ట్విస్ట్! హిమాయత్‌నగర్‌లో డాక్టర్ కాల్పుల కేసు కీలక మలుపు తిరి గింది. కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ శశికుమార్ మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సాయంత్రం తోటి డాక్టర్ ఉదయ్‌కుమార్‌ను కాల్చిన రివాల్వర్‌తోనే కాల్చుకుని చనిపోయాడు. ఉదయ్‌ను ‘చంపింది’ తాను కాదు.. సాయికుమార్ అని సూసైడ్‌నోట్‌లో రాశాడు. మరోవైపు శశికుమార్ భార్య కాంతి తన భర్తను కిరాయి రౌడీలతో హతమార్చారని ఆరోపించా రు. అటు హత్యాయత్నం కేసు, ఇటు ఆత్మహత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం...

 పదిహేనేళ్ల కిందటే పరిచయం..
 రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కొండాపూర్, మాదాపూర్, చైతన్యపురిల్లో స్థిరపడిన డాక్టర్లు ఉదయ్‌కుమార్, సాయికుమార్, శశికుమార్‌లకు వారి వృత్తుల నేపథ్యంలో పది హేనేళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది. వీరిలో శశికుమార్ జనరల్ సర్జన్. మిగిలిన ఇద్దరూ అనస్థీషియన్లు. ముగ్గురూ కలసి ఓ ఆసుపత్రిని నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. వీరితోపాటు సాయికుమార్, ఉదయ్‌కుమార్ భార్యలను డెరైక్టర్లుగా నియమించుకుని మాదాపూర్‌లో ‘లారెల్ హాస్పిటల్’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1న ఓపీ విభాగం ప్రారంభమైంది. మార్చి నాటికి పూర్తి స్థాయిలో వైద్య సేవలందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 వివాదం మొదలైందిలా...
 లారెల్ హాస్పిటల్‌లో రూ.75లక్షల పెట్టుబడి పెట్టిన శశికుమార్.. మరో రూ.25లక్షలు రూ.2 వడ్డీకి అప్పుగా ఇచ్చారు. ఏడాదిన్నర క్రితం ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న సం దర్భంలో శశికుమార్‌కు డెరైక్టర్ హోదాలో నెలకు రూ.2లక్షలు, సర్జరీ విభాగం అధిపతిగా నెలకు రూ.1.5లక్షలు చొప్పున వేతనం ఇచ్చే లా ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఆసుపత్రి నిర్వహణలో కీలక పాత్ర తనకే ఉండాలని శశికుమార్ స్పష్టం చేయడంతో మిగిలిన ఇద్ద రూ అంగీకరించారు. అయితే ఆసుపత్రి పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో చెల్లింపులు జరగలేదు. ఈ ముగ్గురి పెట్టుబడి ఆసుపత్రి ఏర్పాటుకు సరిపోకపోవడంతో ఉదయ్, సాయికుమార్‌లు గతేడాది నవంబర్‌లో అమెరికాలోని రోబోటిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్‌ను సంప్రదించారు. ఆసుపత్రిలో ఆయనకు 22 శాతం వాటా ఇస్తూ.. పెట్టుబడి కింద దాదాపు రూ.2కోట్ల వరకు తీసుకున్నారు. దీం తో తనకున్న ప్రాధాన్యం తగ్గుతుందని శశికుమార్ భావించాడు. తన డబ్బు తనకివ్వాలని మిగిలిన ఇద్దరిపై ఒత్తిడి తెచ్చాడు.

 రమ్మంది శశికుమారే
 కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో సోమవారం మధ్యాహ్నం మిగిలిన ఇద్దరికీ ఫోన్లు చేసిన శశికుమార్ హిమాయత్‌నగర్ ప్రాంతానికి రమ్మన్నాడు. సాయంత్రం ముగ్గురూ మినర్వా కాఫీ షాప్‌లో కలుసుకున్నారు. కాసేపటికి వాగ్వాదం చోటుచేసుకుంది. అందరి దృష్టి వీరిపై పడటంతో బయటకు వచ్చి.. ఉదయ్ కారులో స్ట్రీట్ నెం.6లోకి వెళ్లి ఓ అపార్ట్‌మెంట్ వద్ద ఆగారు. కారులో మరోసారి వాగ్యుద్ధం జరిగింది.దీంతో ‘మిమ్మల్ని చంపేస్తా’ అంటూ శశికుమార్ తన వద్ద ఉన్న లెసైన్డ్స్ రివాల్వర్‌తో ఉదయ్ కుమార్‌ను వెనుక నుంచి కాల్చాడు. ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో నాంపల్లిలోని ‘మారూఫ్ ఆర్మరీ’లో తుపాకీని డిపాజిట్ చేసి, ఆదివారమే తిరిగి తీసుకున్నాడు.

 కాల్పుల తర్వాత ఏం జరిగింది?
 కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న ఉదయ్... శశికుమార్ కాల్చిన తూటాతో తీవ్రంగా గాయపడ్డారు. డోర్ తీసుకుని దిగే ప్రయత్నంలో కింద పడిపోయారు. కొద్ది క్షణాలకు తేరుకుని అటుగా వస్తున్న ఓ ఆటోను ఆపి హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. తనపై కాల్పులు జరిగాయని ఉదయ్ చెప్పడంతో ఆసుపత్రి సిబ్బం ది పోలీసులకు సమాచా రం ఇచ్చారు. ఉదయ్‌పై కాల్పులు జరగ్గానే భయంతో కారు దిగి పారిపోయిన సాయికుమార్ కొద్దిసేపటికి ఆపోలో వద్దకు వచ్చా రు. ఈలోపు అక్కడకు చేరుకున్న నారాయణగూడ పోలీసులు సాయికుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఈయనే ప్రధాన సాక్షి అని అధికారులు తెలిపారు.

 ఫామ్‌హౌస్‌కు వెళ్లిన శశికుమార్
 కాల్పులకు పాల్పడిన వెంటనే తన ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేసిన శశికుమార్ గంటన్నర తర్వాత సోమాజిగూడలోని తన స్నేహితురాలు చంద్రకళ ఇంటికి వెళ్లారు. ఆమె దగ్గర విషయం దాచి, తన మనసు బాగోలేదని, మీ ఫామ్‌హౌస్‌కు వెళ్దామని చెప్పాడు. వారింటి నుంచి రెండు మద్యం సీసాలు తీసుకున్నాడు. తర్వాత చంద్రకళ తన కారులోనే శశికుమార్‌ను తీసుకుని మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు తీసు కువెళ్లింది. ఆయనను ఫామ్‌హౌస్‌లో దింపిన స్నేహితురాలు భోజనం తదితర ఏర్పాట్లు చేయాలంటూ వాచ్‌మన్ శంకరయ్యకు చెప్పి తిరిగి వచ్చేసింది. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి 9.30 గంటల్లోపు రెండుసార్లు వాచ్‌మెన్ నెంబర్‌కు ఫోన్ చేసి.. శశికుమార్‌తో మాట్లాడింది. ఫామ్‌హౌస్‌లో మద్యం సేవించి, కాస్త ఆహారం తీసుకున్న తర్వాత శశికుమార్ ఓసారి తన ఫోన్ నుంచి భార్యకు ఫోన్ చేసి ‘సారీ’ అని చెప్పి ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు.

 టీవీల్లో చూసి హడావుడిగా...
 సోమాజిగూడలోని తన ఇంటికి వచ్చిన చంద్రకళ టీవీ ఆన్ చేసుకున్నారు. అప్పుడే ఉదయ్‌పై కాల్పులు, శశికుమార్ పరారీ, పోలీసుల గాలిం పు తదితర విషయాలు ఆమె దృష్టికి వచ్చాయి. దీంతో తమ ఇంటి సమీపంలో ఉండే ఆర్మీ అధికారి సాయంతో పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయం చెప్పారు. పోలీసు లు వెంటనే నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్‌స్పెక్టర్ భీమ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చంద్రకళను వెంట తీసుకుని ఫామ్‌హౌస్‌కు చేరుకుంది. అక్కడ కిటికీ నుంచి చూసి శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే మొయినాబాద్ పోలీసులతో పాటు శశికుమార్ సోదరుడికి సమాచారం ఇచ్చారు.

 తాడు.. కొడవలి.. యాక్సాబ్లేడ్..
 ఫామ్‌హౌస్‌లోని తాడు, కొడవలి, యాక్సాబ్లేడ్స్‌ను తీసుకుని మంచం వద్దకు వెళ్లిన శశికుమార్.. వాటితో ఆత్మహత్య చేసుకోవడానికి సాధ్యం కాకపోవడంతో తన రివాల్వర్‌తోనే కుడి కణతపై కాల్చుకున్నారు. అతి సమీపం నుంచి కాల్చుకోవడంతో తూటా తల ఎడమ వైపు నుంచి బయటకు వచ్చింది. ఘటనాస్థలి నుంచి స్వాధీనం చేసుకున్న రివాల్వర్‌లో నాలుగు తూటాలు, రెండు ఖాళీ క్యాట్రిడ్జ్‌లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీన్ని బట్టి ఓ తూటా ఉదయ్‌పై కాల్చగా.. మరోటి ఆత్మహత్యకు వాడినట్లు భావిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టువూర్టం అనంతరం సోదరుడు పీటర్‌కు శశికుమార్ మృతదేహాన్ని అప్పగించారు. కేసులో ఉదయ్, సాయిలతో పాటు శశికుమార్ స్నేహితురాలి నుంచి వాంగ్మూలాలు నమోదు చేసినట్టు డీసీపీ వీబీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.  

 నమూనాలు సేకరించిన పోలీసులు
 నారాయణగూడ, మొయినాబాద్ పోలీసులు ఘటనాస్థలిలతో పాటు సాయికుమార్, శశికుమార్ నుంచి గన్ షాట్ రెసిడ్యూ నమూనాలు సేకరించారు. ఫామ్‌హౌస్ నుంచి రివాల్వర్‌ను స్వాధీనం చేసుకుని, దానిపై ఉన్న వేలి ముద్రల్ని సరిచూడటానికి ఉదయ్, సాయిలతో పాటు శశికుమార్ మృతదేహం నుంచీ వేలిముద్రలు సేకరించారు. వీటన్నింటినీ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు.
 
 ఉదయ్ తల నుంచి బుల్లెట్ తొలగింపు
 ఉదయ్‌కుమార్‌కు మంగళవారం శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు ఆయన తల నుంచి బుల్లెట్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో ఉంచారు. ప్రాణానికి హాని ఏమీ లేదని వారం రోజుల్లో కోలుకునే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు.
 
 సమాచారం లేకే అఘాయిత్యం
 సూసైడ్ నోట్ ప్రారంభంలోనే ‘సాయికుమార్ కిల్డ్ ఉదయ్ విత్ మై రివాల్వర్’ అని శశికుమార్ రాశాడు. దీన్నిబట్టి తూటా తగిలిన ఉదయ్ కుమార్ చనిపోయినట్లు శశి భావించి ఉంటాడని పోలీసులు చెప్తున్నారు. ఉదంతం తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడం, చంద్రకళ ఇంట్లో టీవీ చూడకపోవడం, ఫామ్‌హౌస్‌లో టీవీ లేకపోవడంతో ఉదయ్ బతికే ఉన్నాడని, చికిత్స పొందుతున్నాడనే విషయాలు శశికుమార్‌కు తెలియలేదని అంటున్నారు. ఉదయ్‌కు ప్రాణాపాయం లేదనే సమాచారం తెలిసి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.  
 
 పథకం ప్రకారం హత్య చేశారు: శశికుమార్ భార్య
 ‘‘నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. పథకం ప్రకారం హత్య చేసి కట్టుకథ అల్లుతున్నారు..’’ అని శశికుమార్ భార్య కాంతి ఆరోపించారు. మంగళవారం ఆమె చైతన్యపురి ప్రభాత్‌నగర్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... ‘‘సోమవారం మధ్యాహ్నం సాయికుమార్, ఉదయ్‌కుమార్ ఫోన్ చేసి నా భర్తను పిలిచారు. వారే కిడ్నాప్ చేసి ఫామ్‌హౌస్‌లో కిరాయి రౌడీలతో హతమార్చారు. ఏడాదిన్నర కాలంగా ఆసుపత్రి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. నా భర్త రూ.2.5 కోట్లు పెట్టుబడి పెట్టారు. గత కొంత కాలంగా జరుగుతున్న వివాదం వల్ల నా భర్త మనస్తాపంతో ఉన్నారు. మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ ఎవరిదో, అక్కడకు నా భర్తను ఎవరు తీసుకెళ్లారో తెలీదు. నా భర్త మరణంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులను శిక్షించాలి’’ అని అన్నారు. శశికుమార్ న్యూమారుతీనగర్ జైన్‌మందిర్ సమీపంలో ఓ ల్యాప్రోస్కోపిక్ ఆసుపత్రిని కూడా నిర్వహిస్తున్నాడు. ఇటీవలే దిల్‌సుఖ్‌నగర్‌లోని సిగ్మా ఆసుపత్రిని లీజుకు తీసుకున్నాడు. సాయినిఖిత ఆస్పత్రికి డెరైక్టర్‌గా ఉన్నాడు.
 
 చంపింది నేను కాదంటూ లేఖ
 ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శశికుమార్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘‘ఉదయ్‌ని నేను చంపలేదు. నా రివాల్వర్‌తో సాయికుమార్ చంపాడు. మా మధ్య హాస్పిటల్‌కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ విషయంలో గొడవ జరిగింది. అసలు నిందితులు సాయికుమార్, ఓబుల్‌రెడ్డి, రామణారావు, చెన్నారెడ్డి, కేకేరెడ్డిలు. వారిని శిక్షించాలి. భార్యా పిల్లలకు అన్యాయం చేస్తున్నా. మళ్లీ జన్మంటూ ఉంటే మంచి భర్తగా, మంచి తండ్రిగా పుడతాను’’ అని రాశాడు. తనకు ఎవరు ఎంత మొత్తం ఇవ్వాలో అందులో తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement