వైద్యుడి ఆత్మహత్యతో కలకలం
♦ మొయినాబాద్ మండలం
♦ నక్కలపల్లి సమీపంలోని నిష్ ఫాంహౌస్‌లో ఘటన
♦ భయమే ప్రాణం తీసింది! చర్చనీయాంశమైన ఘటన
హైదరాబాద్‌లో వైద్యుల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న డాక్టర్ శశికుమార్ (45) తన రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మొయినాబాద్ : ఆర్థిక లావాదేవీల విషయంలో చెలరేగిన వివాదంతో తోటి వైద్యుడిపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో డాక్టర్ కొన్ని గంటల్లోనే పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడడం చర్చనీయాంశమైంది. మండల పరిధిలోని నక్కలపల్లిలో జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి పోలీసులు నక్కలపల్లిలోని నిష్ ఫాంహౌస్‌కు చేరుకోవడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికుమార్‌ను పట్టుకునేందుకు పోలీసులు ఫాంహౌస్‌కు చేరుకుని పరిశీలించే సరికే అతను ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా పడిఉన్నాడు.
ఆత్మహత్య చేసుకోవాలని ముందే అనుకుని...
డాక్టర్ శశికుమార్ ఆత్మహత్య చేసుకోవాలనే బలమై న నిర్ణయంతోనే వచ్చినట్లు అర్థమవుతోంది. తన వెంట రివాల్వార్, కొడవలి, ఆక్సాబ్లేడ్, తాడుతో ఏదో ఒక దానితో ఆత్మహత్య చేసుకోవాలనే వాటిని తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మద్యం సేవించిన అనంతరం సూసైట్ నోట్ రాసిపెట్టి రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండేళ్ల క్రితం కొనుగోలు...
నగరానికి చెందిన చంద్రకళ రెండేళ్ల క్రితం నక్కలపల్లి రెవెన్యూలో రెండెకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో పండ్ల మొక్కలు నాటారు. అప్పుడప్పుడు వచ్చినప్పడు ఉండేందుకు కంటైనర్‌తో రెండు గదులు, రేకుల షెడ్డు నిర్మించారు. ఈ ఫాంహౌస్‌లో నెల రోజుల క్రితం నుంచి నక్కలపల్లికి చెందిన శంకరయ్య వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే చంద్రకళకు శశికుమార్ స్నేహితుడు కావడంతో సోమవారం కాల్పుల ఘటన అనంతరం వారిద్దరూ ఫాంహౌస్‌కు వచ్చారు. కానీ అప్పటికీ చంద్రకళకు నగరంలో జరిగిన కాల్పుల విషయం తెలియదు.
భయంతోనే ఆత్మహత్య!
ఆర్థిక లావాదేవీల విషయంలో చెలరేగిన వివాదంలో జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో తోటి వైద్యుడు ఉదయ్‌కుమార్ చనిపోయాడన్న భయంతో డాక్టర్ శ శికుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలిసింది. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించిన రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, మొయినాబాద్ సీఐ శ్రీనివాస్‌లు సైతం అతని వద్ద రివాల్వర్ లేకుంటే ఆత్మహత్యకు పాల్పడేవాడు కాదని అభిప్రాయపడ్డారు.