మోదీ ఆ పరీక్షల్లో ఫెయిల్
న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దుచేయాలని వాంఛూ కమిటీ చేసిన సిఫార్సులను ఇందిరాగాంధీ తోసిపుచ్చారని ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. ప్రధాని నరేంద్రమోదీకి అసలు ఆర్థికశాస్త్రంపై జ్ఞానమే లేదని, ఆయన ఎప్పుడూ చరిత్ర టెస్టుల్లో ఫెయిలయ్యేవారని విమర్శించింది. ప్రధాని ప్రస్తుతం చేపట్టిన పెద్ద నోట్ల రద్దు అతిపెద్ద ఆర్థిక కుంభకోణమని అభివర్ణించింది. 'దురదృవశాత్తు ప్రధానికి ఎకనామిక్స్‌పై అసలు అవగాహనే లేదు, చరిత్ర టెస్టుల్లో ఎప్పుడూ విఫలమవుతూనే ఉంటారు' అని కాంగ్రెస్ నేత ఓమ్ ప్రకాశ్ మిశ్రా అన్నారు.
అతిపెద్ద ఆర్థిక కుంభకోణం కంటే పెద్ద నోట్ల రద్దు తక్కువేమీ కాదని విమర్శించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌ను ఆర్థిక తీవ్రవాద దిశగా ప్రధాని మరలిస్తున్నారన్నారు. 1971లో నోట్ల రద్దును ఇందిరాగాంధీ ప్రభుత్వం తొక్కేసిందనే ప్రధాని ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఆయనపై మండిపడింది. నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతంపై ప్రధాని స్పందిస్తూ ఎన్నికల్లో గెలవడానికి ఇందిరాగాంధీ నోట్లను రద్దు చేయలేదని, వారికి దేశం కంటే పార్టీనే ముఖ్యమని బిగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.