Hitachi group
-
హిటాచీ చేతికి ఏబీబీ ‘పవర్’
న్యూఢిల్లీ: స్విస్ ఇంజనీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు) ఉండనున్నట్లు తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు 2020 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కావొచ్చని అంచనా. డీల్ ప్రాథమిక స్వరూపం ప్రకారం... ఈ జాయింట్ వెంచర్లో ఏబీబీ 19.9 శాతం వాటాలను అట్టే పెట్టుకోనుంది. ఒప్పందం ముగిసిన మూడేళ్ల తర్వాత సముచిత మార్కెట్ రేటుకు విక్రయించేసి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పవర్ గ్రిడ్ పరిశ్రమలో స్థానం పటిష్టం చేసుకునేందుకు హిటాచీకి ఈ డీల్ లాభించనుంది. ప్రధానంగా పారిశ్రామిక రోబోల తయారీలో ఉన్న ఏబీబీ... ఆటోమేషన్ వంటి విభాగాలపై దృష్టి పెట్టే క్రమంలో అంతగా లాభదాయకత లేని వ్యాపార విభాగాన్ని వదిలించుకునేందుకు తాజా డీల్ తోడ్పడనుంది. వ్యాపార పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలపై 500 మిలియన్ డాలర్లు వెచ్చించనుండగా, ఏటా 500 మిలియన్ డాలర్ల మేర వ్యయాలు తగ్గుతాయని ఏబీబీ వివరించింది. జాయింట్ వెంచర్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంటుందని, ప్రస్తుత మేనేజ్మెంట్ టీమ్‌నే హిటాచీ కొనసాగిస్తుందని పేర్కొంది. మరోవైపు, పవర్ గ్రిడ్ బిజినెస్‌ను ఏబీబీ ప్రత్యేక వ్యాపార సంస్థగా విడగొడుతోందని, దీని విలువ నుంచి రుణభారం మొదలైనవన్నీ తీసేయగా.. 80.1% వాటాలను సుమారు 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నామని హిటాచీ తెలిపింది. 10 బిలియన్ డాలర్ల టర్నోవర్.. ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్ విభాగానికి .. వివిధ దేశాల్లో విద్యుత్ సరఫరా పరికరాలు, కంట్రోల్ వ్యవస్థల ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి. ఇందులో 36,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. గతేడాది 10.4 బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ స్వల్పంగా 60 బేసిస్ పాయింట్లు క్షీణించి 10.0 శాతానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితమే పవర్ గ్రిడ్స్ విభాగాన్ని విక్రయించేయాలంటూ కొందరు షేర్‌హోల్డర్ల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ.. ఏబీబీ సీఈవో ఉల్రిచ్ స్పైస్హోఫర్ అంగీకరించలేదు. కానీ తాజాగా యూ–టర్న్ తీసుకుని విక్రయ ప్రతిపాదనకు అంగీకరించారు. ఏబీబీ సంస్థ భారత్‌లో ఏబీబీ ఇండియా పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ఎన్ఎస్ఈలో సంస్థ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,400 వద్ద క్లోజయ్యింది. -
భారత్‌లో హిటాచి ఏటీఎమ్ ల తయారీ కంపెనీ
రూ.100 కోట్లతో బెంగళూరులో ఏర్పాటు న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన హిటాచి గ్రూప్ భారత్‌లో ఏటీఎమ్‌లు తయారు చేసే కంపెనీని ఏర్పాటు చేస్తోంది. బెంగళూరులో హిటాచి టెర్మినల్ సొల్యూషన్స్ ఇండియా పేరుతో రూ. 100 కోట్లతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలో బ్యాంక్ ఖాతాదారులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో హిటాచి గ్రూప్‌కు చెందిన హిటాచి-ఓమ్రన్ టెర్మినల్ సొల్యూషన్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈఏడాది జూన్‌లో ఏటీఎమ్‌ల తయారీని ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరికల్లా నెలకు 1,500 ఏటీఎమ్‌లను ఉత్పత్తి చేయగలమని హిటాచి కంపెనీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి అనుగుణంగా ఈ ఏటీఎమ్‌ల తయారీ కంపెనీని ఆరంభిస్తున్నామని, ఉద్యోగ కల్పనకు, భారత ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నామని వివరించింది. 2015 కల్లా 5,000 ఏటీఎమ్‌లను భారత్‌లో ఏర్పాటు చేశామని, పేర్కొంది. కాగా భారత్‌లో ప్రస్తుతం రెండు లక్షల ఏటీఎమ్‌లు, సీడీ(క్యాష్ డిస్పెన్సింగ్ ఏటీఎమ్)లు ఉన్నాయి. -
మైక్రోసాఫ్ట్‌తో కలసి ఐటీ సేవలు
సీఎం కేసీఆర్‌తో హిటాచి బృందం భేటీ స్మార్ట్ సిటీ సొల్యూషన్స్‌లో సహకారం హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సంస్థతో కలసి రాష్ట్రంలో ఐటీ ఆధారిత సేవలు అందించేందుకు హిటాచి అనుబంధ సంస్థ హిటాచి సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆసక్తి వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో హిటాచి జపాన్, అమెరికా ప్రతినిధి బృందం వేర్వేరుగా శనివారం భేటీ అయ్యింది. సాధారణ ప్రజలు నేరుగా ముఖ్యమంత్రితో ఆన్లైన్లో ముఖాముఖి జరిపేలా స్మార్ట్ సిటీ సొల్యూషన్ రూపొందిస్తామని హిటాచి ప్రతినిధులు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడంలో తమవంతు సహకారం అందిస్తామన్నారు. పరిశ్రమల ప్రణాళిక, ఆరోగ్యం, విద్య, రవాణా, జైళ్లు, రక్షణ రంగాల్లో ఐటీ ఆధారిత సేవలు అందించేందుకు ఆసక్తితో ఉన్నట్లు హిటాచి బృందం వెల్లడించింది. ఒకే కార్డుపై వివిధ రకాల సేవలు అందించే ప్రతిపాదనపై ఆసక్తి చూపిన కేసీఆర్... సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్లో స్మార్ట్ సిటీ సొల్యూషన్ అవకాశాలను పరిశీలించాలన్నారు. రాష్ట్రంలో భారీ యంత్ర సామగ్రి తయారీ ప్లాంటును నెలకొల్పాలని కోరారు. హిటాచి బృందంలో సీఈఓ, ఎండీ అనంత నారాయణన్, గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మైక్ గిల్లిస్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గ్యారీ పీటర్సన్‌తోపాటు మరో ఆరుగురు వున్నారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, పరిశ్రమల కార్యదర్శి అరవింద కుమార్, హెచ్ఎండీఏ ఎండీ శాలిని మిశ్రా తదితరులు సీఎం భేటీలో పాల్గొన్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా రంగంలో నైపుణ్యం పెంపు, చిన్న పరిశ్రమలకు అవసరమైన ఐటీ సాంకేతికత అందించే దిశగా సహకారం ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు హిటాచి బృందాన్ని కోరారు. దీనిపై త్వరలో బ్లూప్రింట్ సమర్పిస్తామని హిటాచి ప్రతినిధులు వెల్లడించారు.