న్యూఢిల్లీ: స్విస్ ఇంజనీరింగ్ దిగ్గజం ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్స్ వ్యాపార విభాగాన్ని జపాన్ సంస్థ హిటాచీ కొనుగోలు చేయనుంది. ఈ విభాగంలో 80.1 శాతం వాటాలను హిటాచీ కొనుగోలు చేస్తున్నట్లు ఏబీబీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం పవర్ గ్రిడ్స్ వ్యాపార పరిమాణాన్ని 11 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.79,200 కోట్లు) లెక్క కట్టినట్లు, డీల్ విలువ సుమారు 6.4 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 46,080 కోట్లు) ఉండనున్నట్లు తెలిపింది. నియంత్రణ సంస్థల అనుమతుల మేరకు 2020 ప్రథమార్ధంలో డీల్ పూర్తి కావొచ్చని అంచనా. డీల్ ప్రాథమిక స్వరూపం ప్రకారం... ఈ జాయింట్ వెంచర్‌లో ఏబీబీ 19.9 శాతం వాటాలను అట్టే పెట్టుకోనుంది. ఒప్పందం ముగిసిన మూడేళ్ల తర్వాత సముచిత మార్కెట్ రేటుకు విక్రయించేసి వైదొలిగేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా పవర్ గ్రిడ్ పరిశ్రమలో స్థానం పటిష్టం చేసుకునేందుకు హిటాచీకి ఈ డీల్ లాభించనుంది.
ప్రధానంగా పారిశ్రామిక రోబోల తయారీలో ఉన్న ఏబీబీ... ఆటోమేషన్ వంటి విభాగాలపై దృష్టి పెట్టే క్రమంలో అంతగా లాభదాయకత లేని వ్యాపార విభాగాన్ని వదిలించుకునేందుకు తాజా డీల్ తోడ్పడనుంది. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కార్యకలాపాలపై 500 మిలియన్ డాలర్లు వెచ్చించనుండగా, ఏటా 500 మిలియన్ డాలర్ల మేర వ్యయాలు తగ్గుతాయని ఏబీబీ వివరించింది. జాయింట్ వెంచర్ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లో ఉంటుందని, ప్రస్తుత మేనేజ్‌మెంట్ టీమ్‌నే హిటాచీ కొనసాగిస్తుందని పేర్కొంది. మరోవైపు, పవర్ గ్రిడ్ బిజినెస్‌ను ఏబీబీ ప్రత్యేక వ్యాపార సంస్థగా విడగొడుతోందని, దీని విలువ నుంచి రుణభారం మొదలైనవన్నీ తీసేయగా.. 80.1% వాటాలను సుమారు 6.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నామని హిటాచీ తెలిపింది.
10 బిలియన్ డాలర్ల టర్నోవర్..
ఏబీబీకి చెందిన పవర్ గ్రిడ్ విభాగానికి .. వివిధ దేశాల్లో విద్యుత్ సరఫరా పరికరాలు, కంట్రోల్ వ్యవస్థల ఉత్పత్తి, నిర్వహణ కార్యకలాపాలు ఉన్నాయి. ఇందులో 36,000 మంది పైచిలుకు సిబ్బంది ఉన్నారు. గతేడాది 10.4 బిలియన్ డాలర్ల అమ్మకాలు సాధించింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో నిర్వహణ లాభాల మార్జిన్ స్వల్పంగా 60 బేసిస్ పాయింట్లు క్షీణించి 10.0 శాతానికి పరిమితమైంది. రెండేళ్ల క్రితమే పవర్ గ్రిడ్స్ విభాగాన్ని విక్రయించేయాలంటూ కొందరు షేర్‌హోల్డర్ల నుంచి డిమాండ్ వచ్చినప్పటికీ.. ఏబీబీ సీఈవో ఉల్‌రిచ్ స్పైస్‌హోఫర్ అంగీకరించలేదు. కానీ తాజాగా యూ–టర్న్ తీసుకుని విక్రయ ప్రతిపాదనకు అంగీకరించారు. ఏబీబీ సంస్థ భారత్‌లో ఏబీబీ ఇండియా పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా డీల్ నేపథ్యంలో సోమవారం ఎన్‌ఎస్‌ఈలో సంస్థ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,400 వద్ద క్లోజయ్యింది.
హిటాచీ చేతికి ఏబీబీ ‘పవర్’
Published Tue, Dec 18 2018 12:45 AM | Last Updated on Tue, Dec 18 2018 12:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment