HM posts
-
జిల్లా కేడర్‌గా టీచర్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ పోస్టులను లోకల్ కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. అయితే, వీరందరికి కలిపికాకుండా వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం జీవోలు 254, 255, 256లను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత్, మండల పరిషత్ యాజమాన్యంలోని ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, వాటి తత్సమాన పోస్టులను జిల్లా కేడర్‌గా ప్రభుత్వం నిర్ధారించింది. వాటి ఆధారంగానే భవిష్యత్తులో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని పేర్కొంది. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ఇవే ఆధారం కానున్నాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని గెజిటెడ్ హెడ్మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌గా చేసింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్–1, గ్రేడ్–2 పోస్టుల లోకల్ కేడర్ ఆర్గనైజేషన్‌కు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. హైస్కూల్ హెడ్మాస్టర్ పోస్టులు గతంలో జోనల్ కేడర్‌లో ఉండగా, ఇపుడు మల్టీ జోన్ పరిధిలోకి తెచ్చింది. ఆ పోస్టు బదలాయింపు రాష్ట్ర విద్యా శిక్షణా, పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ), కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (సీటీఈ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ)లలో లెక్చరర్ పోస్టులను మల్టీ జోనల్ కేడర్‌కు ప్రభుత్వం బదలాయించింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన జీవోకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఉద్యోగోన్నతుల ద్వారా హెచ్ఎం పోస్టుల భర్తీ
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జోన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రధానోపాధ్యాయ పోస్టులను ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి తెలిపారు. అరండల్‌పేటలోని తన కార్యాలయంలో ఆమె సోమవారం మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతుల ప్రక్రియపై దృష్టి సారించామని చెప్పారు. గురజాల(గుంటూరు), అద్దంకి(ప్రకాశం), పల్లెపాడు, రాపూరు(నెల్లూరు)ల్లోని ప్రభుత్వ హైస్కూళ్ల హెచ్ఎం పోస్టులను జోనల్ స్థాయిలో సీనియార్టీ ప్రాతిపదికన స్కూల్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతి కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నామని వివరించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను రెండు మూడు రోజుల్లో ఖరారు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో గ్రేడ్-2 హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులతో భర్తీ చేసేందుకు ఆయా జిల్లాల డీఈవోలు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. జిల్లా స్థాయిలో ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌ను ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో చేపట్టే అవకాశముందని తెలిపారు. -
18 హైస్కూలు హెచ్ఎం పోస్టులు ఖాళీ
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఖాళీగా ఉన్న 18 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టుల భర్తీకి నవంబర్ మొదటి వారంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిసింది. వీటిలో 16 జిల్లా పరిషత్ హైస్కూళ్లు కాగా రెండు ప్రభుత్వ హైస్కూళ్లు. పోస్టుల భర్తీపై పాఠశాల విద్య గుంటూరు ఆర్జేడీ పి.పార్వతి చర్యలు ప్రారంభించారు. పోస్టుల వివరాలను ఇప్పటికే డీఈఓ కార్యాలయం నుంచి తెలుసుకున్నారు. పర్చూరు మండలం చెరుకూరు, ముండ్లమూరు మండలం వేముల, కొత్తపట్నం మండలం ఆలూరు, చీమకుర్తి మండలం గాడిపర్తివారిపాలెం, దేవరపాలెం, నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు, అర్ధవీడు మండలం కాకర్ల, తర్లుపాడు మండలం తాడివారిపల్లె, కంభం మండలం జంగంగుంట్ల, కంభం (బాలికలు), సింగరాయకొండ మండలం పాకల, తాళ్లూరు మండలం శివరాంపురం, పుల్లలచెరువు మండలం మర్రివేముల, బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం, మండల కేంద్రాలు గుడ్లూరు, దర్శి (బాలికలు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలు సహా కంభం, పొదిలి (బాలికలు) ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో హెడ్మాస్టరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.